Opposition Unity : విపక్షాలను ఏకం చేసేందుకు చరిత్రాత్మక అడుగు.. చర్చనీయాంశంగా రాహుల్, నితీష్ భేటీ
ABN , First Publish Date - 2023-04-12T16:34:08+05:30 IST
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మరో ముందడుగు పడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మరో ముందడుగు పడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congess Leader Rahul Gandhi), జేడీయూ (JDU) చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar), ఆర్జేడీ (RJD) నేతలు ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. బీజేపీపై ఐకమత్యంగా పోరాడే అవకాశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav), జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా పాల్గొన్నారు.
ఖర్గే మీడియాతో మాట్లాడుతూ, ఇది చారిత్రక సమావేశమని చెప్పారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తేవడమే తమ లక్ష్యమని తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఇది చరిత్రాత్మక ముందడుగు అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను సమైక్యపరచడం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇది ఓ ప్రక్రియ అని, దేశం కోసం ప్రతిపక్షాల దార్శనికతను ఇది తీర్చిదిద్దుతుందన్నారు.
నితీశ్ కుమార్ మాట్లాడుతూ, సాధ్యమైనన్ని పార్టీలను సమైక్యపరచి, కలిసికట్టుగా పని చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు నితీశ్ ఆర్జేడీ అగ్ర నేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)ను కలిశారు. లాలూ తన కుమార్తె మీసా భారతి నివాసంలో ఉన్నారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్‌లో, తాము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, దేశాన్ని కాపాడతామని తెలిపారు. ప్రజా గళాన్ని వినిపించాలని, దేశానికి నూతన దిశను ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు శపథం చేశారన్నారు.
ఖర్గే అంతకుముందు డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేలతో కూడా మాట్లాడారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీపై పోరాటానికి నూతన సమీకరణాలను ప్రతిపక్షాలు అన్వేషిస్తున్నాయి. కొన్ని పార్టీలు ప్రతిపక్షాల ఫ్రంట్‌లో చేరేందుకు స్పష్టమైన వైఖరిని తెలిపాయి, మరికొన్ని పార్టీలు మిశ్రమంగా స్పందించాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ (TMC) మొదట్లో ప్రకటించింది, అయితే రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాట్లాడుతూ, ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని, బీజేపీని గద్దె దించాలని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కూడా తన వైఖరిని స్పష్టం చేయలేదు. ఈ పార్టీకి ఇటీవలే ఎన్నికల కమిషన్ ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతోంది, కానీ కాంగ్రెస్‌ను చేర్చుకోవడానికి సముఖత వ్యక్తం చేయడం లేదు.
రాహుల్ గాంధీపై అనర్హత గురించి..
మోదీ ఇంటి పేరును అవమానించారనే ఆరోపణలపై దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష పడింది. అనంతరం ఆయన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడని పార్లమెంటు సచివాలయం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :
Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం
Heat wave:ఒడిశాలో తీవ్రమైన వేడిగాలులు...వచ్చే 5రోజులపాటు పాఠశాలలకు సెలవు