Samajwadi party: బాబాయ్‌కి అఖిలేష్ కీలక హోదా

ABN , First Publish Date - 2023-01-29T19:44:20+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ 62 మందితో కూడిన జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితాను ఆదివారంనాడు ప్రకటించింది. ఆ ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా..

Samajwadi party: బాబాయ్‌కి అఖిలేష్ కీలక హోదా

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) 62 మందితో కూడిన జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితాను ఆదివారంనాడు ప్రకటించింది. ఆ ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా అఖిలేష్ యాదవ్‌ (Akhilesh Yadav), ఆయన చిన్నాన్న (బాబాయ్) శివపాల్ యాదవ్‌ (Shivpal Yadav) ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. 14 మంది జాతీయ కార్యదర్శులలో ఇటీవల 'రామచరిత మానస్‌'పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వామి ప్రసాద్ మౌర్యకు, సీనియర్ నేత అజంఖాన్‌కు చోటు దక్కింది.

బాబాయ్-అబ్బాయ్ (శివపాల్-అఖిలేష్) ద్వయం 2016లో విడిపోయారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణాంతరం గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన మెయిన్‌పురి లోక్‌సభ ఎన్నికలకు ముందు తిరిగి ఇద్దరూ ఏకమయ్యారు. ఈ క్రమంలో 62 మందితో కూడిన పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ల జాబితాను ట్విట్టర్ ఖాతాలో ఎస్‌పీ ప్రకటించింది.

శివపాల్ సొంత పార్టీ..

శివపాల్ యాదవ్ 2016లో ఉత్తరప్రదేశ్ యూనిట్ అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయనకు, అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మంత్రివర్గం నుంచి శివపాల్ యాదవ్‌ను అఖిలేష్ తొలగించారు. పార్టీ తనను పక్కనపెట్టేయడంతో శివపాల్ సొంతంగా ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (లోహియా)ను 2018లో స్థాపించాడు. తన మేనల్లుడు అక్షయ్ యాదవ్‌పై ఫిరోజాబాద్ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత మెయిన్‌పురి ఉప ఎన్నికల సమయంలో మళ్లీ బాబాయ్-అబ్బాయి ఒకే వేదికపైకి వచ్చారు.

కాగా, స్వామి ప్రసాద్ మౌర్య మొదట్లో బీజేపీలో ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఫజిల్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

జాబితాలో ఇతరులు..

కాగా, ఎస్‌పీ తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితాలోని 14 మంది ప్రధాన కార్యదర్శులలో రవి ప్రకాష్ వర్మ, బలరాం యాదవ్, విశ్వాంభర్ ప్రసాద్ నిషద్, అవదేశ్ ప్రసాద్, ఇంద్రజిత్ సరోజ్, రామ్జీలాల్ సుమన్, లాల్జీ వర్మ, రామ్ అచల్ రాజ్‌భర్, జే ఆంటోని, హరేంద్ర మాలిక్, నీరజ్ చౌదరికి చోటు దక్కింది. అఖిలేష్ యాదవ్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా కొనసాగుతుండగా, కిరణ్‌మయి నంద ఉపాధ్యక్షుడుగా, రామ్ గోపాల్ యాదవ్ జాతీయ ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతారు. పార్టీ కోశాధికారిగా సుదీప్ రంజన్ సేన్ కొనసాగుతున్నారు. 19 మంది జాతీయ కార్యదర్శులలో మధు గుప్తా, కమల్ అఖ్తర్, రాజేంద్ర చౌదరి, రాజీవ్ రాయ్, అభిషేక్ మిశ్రా తదితరులున్నారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లలో జయాబచ్చన్, అబు అసిమ్ అజ్మి, రామ్ గోవింద్ చౌదరి, పవన్ పాండే, లీలావతి కుష్వాహ, ఉజ్వల్ రమణ్ సింగ్, అక్షయ్ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, రాజ్‌కుమార్ మిశ్రా తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-01-29T19:44:22+05:30 IST