Tomatoes Free: స్మార్ట్‌ఫోన్ కొంటే 2 కిలోల టొమాటోలు ఫ్రీ!
ABN , First Publish Date - 2023-07-10T02:20:55+05:30 IST
దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మొబైల్ ఫోన్ల వ్యాపారి అభిషేక్ వినూత్నంగా ఆలోచించాడు.
భోపాల్, జూలై 9: దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మొబైల్ ఫోన్ల వ్యాపారి అభిషేక్ వినూత్నంగా ఆలోచించాడు. తన వద్ద స్మార్ట్‌ఫోన్లు కొన్నవారికి 2 కిలోల టమాటాలను ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. దీంతో అతనికి విపరీతమైన పబ్లిసిటీ లభించింది. ‘‘ఆఫర్ ప్రకటించిన తర్వాత నా దుకాణానికి వచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది’’ అని అభిషేక్ చెప్పాడు. ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీలో అజయ్ ఫౌజీ అనే టమాటాల వ్యాపారి తన దుకాణానికి ఏకంగా ప్రైవేటు భద్రతను నియమించుకున్నారు. వినియోగదారులు దుకాణాలకు ఎగబడటమే కాక, కొన్ని చోట్ల చోరీలు కూడా చేస్తున్నారని, అందుకే భద్రత కోసం బౌన్సర్లను దుకాణం వద్ద మోహరించామని ఆయన వివరించారు. మరోవైపు, తమిళనాడులోని కడలూరుకు చెందిన రాజేశ్.. తన కూరగాయల దుకాణం నాల్గో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 550 కిలోల టమాటాలను రూ.20కి కిలో చొప్పున అమ్మాడు. కిలోకు రూ.20 అని ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే అన్ని టమాటాలు అమ్ముడుపోయాయి. కాగా, కూరగాయల ధరల పెరుగుదలపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.