Priyanka Gandhi: ఇందిర నుంచి సోనియా ఏమి నేర్చుకున్నారంటే?
ABN , First Publish Date - 2023-01-16T18:53:34+05:30 IST
రాజీవ్ గాంధీని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇటలీ నుంచి ఇండియాకు వచ్చిన సోనియాగాంధీ ఇక్కడి సంప్రదాయాలకు ఎలా అలవాటు..
బెంగళూరు: రాజీవ్ గాంధీ (Rajiv Gandhi)ని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇటలీ నుంచి ఇండియాకు వచ్చిన సోనియాగాంధీ (Sonia Gandhi) ఇక్కడి సంప్రదాయాలకు ఎలా అలవాటు పడ్డారు? తొలుత రాజకీయాలంటే ఏమాత్రం ఇష్టపడిన ఆమె ఆ తర్వాత ప్రజాసేవ వైపు ఎందుకు మళ్లారు? తన అత్తగారైన ఇందిరాగాంధీ (Indira Gandhi) నుంచి ఆమె నేర్చుకున్న కీలకమైన పాఠం ఏమిటి?. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను సోనియా గాంధీ కుమార్తె, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వెల్లడించారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ బెంగళూరులో సోమవారం ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, ఇద్దరు ధైర్యవంతులు, ఉక్కు సంకల్పం కలిగిన మహిళలు... నానమ్మ ఇందిరాగాంధీ, అమ్మ సోనియాగాంధీ చేతుల్లో తాను పెరిగానని చెప్పారు. ఇటలీలో పుట్టిపెరిగిన అమ్మ (సోనియా) మొదట్లో భారతీయ సంప్రదాయాలను నేర్చుకునేందుకు చాలా కష్టపడేదని, రాజకీయాలను ఇష్టపడేది కాదని అన్నారు. 21 ఏళ్ల వయస్సులో రాజీవ్ గాంధీతో సోనియాగాంధీ ప్రేమలో పడ్డారని చెప్పారు.
''పెళ్లి చేసుకున్న తర్వాత నాన్నగారితో (రాజీవ్) కలిసి అమ్మ నేరుగా ఇటలీ నుంచి ఇండియా వచ్చేసింది. ఇక్కడి సంప్రదాయాలకు అలవాటు చేసుకునేందుకు చాలా కష్టపడింది. ప్రతి విషయం నానమ్మ ఇందిరాగాంధీ నుంచి అమ్మ తెలుసుకునే వారు. 44 ఏళ్ల ఏళ్ల వయస్సులో భర్తను కోల్పోయింది. రాజకీయాల పట్ల అమ్మకు ఆసక్తి లేనప్పటికీ దేశసేవ కోసం ఆ మార్గంలోకి వచ్చారు. ఇవాళ 76 ఏళ్ల వయసులోనూ దేశ సేవకే అమ్మ కట్టుబడి ఉంది'' అని ప్రియాంక తెలిపారు.
ఇందిర నుంచి నేర్చుకున్న పాఠం...
ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ ఓ కీలక పాఠం నేర్చుకున్నారని ప్రియాంక గాంధీ తెలిపారు. ''నీ జీవితంలో ఏది జరిగిందనేది ప్రధానం కాదు, ఎంతటి పెద్ద విషాదాన్ని నువ్వు ఎదుర్కొన్నా పట్టించుకోవద్దు, ఎంత లోతుగా పోరాడావన్నదే ప్రధానం. అది ఇల్లు కావచ్చు, పని కావచ్చు, బయట కావచ్చు, దృఢ చిత్తంతో మనంత మనంగా పోరాడాలి'' అని ఇందిరాగాంధీ నుంచి తన తల్లి పాఠం నేర్చుకున్నారని ప్రియాంక తెలిపింది.
నానమ్మ జ్ఞాపకాలు...
ముప్పై మూడేళ్ల వయస్సున్న సంజయ్ గాంధీని ఇందిరాగాంధీ కోల్పోయినప్పుడు తన వయస్సు 8 ఏళ్లని ప్రియాంక గుర్తు చేసుకున్నారు. సంజయ్ గాంధీ మృతి చెందిన మరుసటి రోజే ఇందిరారాంధీ తన బాధ్యతల్లో తలమునకలయ్యారని, దేశం పట్ల, విధి నిర్వహణ పట్ల, దేశ సేవ పట్ల ఆమెకున్న అంకిత భావం, ఆత్మశక్తికి ఇది నిదర్శనమని అన్నారు. తుది శ్వాస వరకూ నానమ్మ (ఇందిర) దేశసేవ కోసమే పాటుపడిందని ప్రియాంక గుర్తుచేసుకున్నారు.
ప్రతి గృహిణికి నెలకు రూ.2,000
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి వస్తే కుటుంబంలోని ప్రతి గృహిణికి నెలనెలా రూ.2,000 చొప్పున సాయం అందిస్తామన్నారు. గృహ లక్ష్మి పథకం కింద 1.5 కోట్ల మంది గృహిణులకు ఇందువల్ల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఇంటింటికీ ప్రతినెలా 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.