No Confidence Motion : మరో వివాదంలో రాహుల్ గాంధీ.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటున్న స్మృతి ఇరానీ..

ABN , First Publish Date - 2023-08-09T14:52:54+05:30 IST

‘మోదీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో ఊరట పొంది కొన్ని రోజులు కూడా గడవక ముందే రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. లోక్ సభ నుంచి వెళ్లిపోతూ ఆయన మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. మహిళలంటే ఇష్టపడనివారు మాత్రమే ఇటువంటి పనులు చేయగలరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No Confidence Motion : మరో వివాదంలో రాహుల్ గాంధీ..  ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటున్న స్మృతి ఇరానీ..

న్యూఢిల్లీ : ‘మోదీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో ఊరట పొంది కొన్ని రోజులు కూడా గడవక ముందే రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. లోక్ సభ నుంచి వెళ్లిపోతూ ఆయన మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. మహిళలంటే ఇష్టపడనివారు మాత్రమే ఇటువంటి పనులు చేయగలరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మహిళా మంత్రులు, ఎంపీలు ఆయనపై లోక్ సభలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఆరోపణలలో వాస్తవాన్ని సరిచూసేందుకు అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం లోక్ సభలో పెను దుమారం రేగింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్షమాపణ చెప్పాలని ఆయనను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రతిపాదించిన ఈ తీర్మానంపై చర్చ మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో తాను పర్యటించానని చెప్పారు. తాను సహాయక శిబిరాలకు వెళ్లానని, దురాగతాలను ఎదుర్కొన్న మహిళలతో తాను మాట్లాడానని తెలిపారు. కుమారుల మృతదేహాల వద్ద ఉన్న తల్లులతో మాట్లాడానని చెప్పారు. భయానక సంఘటనల గురించి చెప్పేటపుడు ఆ మహిళలు స్పృహ కోల్పోయారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదని ఆరోపించారు. బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందన్నారు. ఆయన ఆ రాష్ట్రానికి ఎన్నడూ వెళ్లలేదన్నారు. మణిపూర్ ఇక ఉండబోదన్నారు. మణిపూర్ మహిళల బాధలు బీజేపీకి అర్థం కావడంలేదన్నారు. భారత దేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసిందని ఆరోపించారు. తన తల్లి పార్లమెంటులో ఉన్నారని, మణిపూర్‌లో భారత మాతను హత్య చేశారని ఆరోపించారు. బీజేపీ నేతలు ద్రోహులని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పరోక్షంగా రావణాసురుడితో పోల్చారు. రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడు చెప్పిన మాటలనే వినేవాడని, మోదీ కూడా ఇద్దరి మాటలనే వింటారని, వారిద్దరూ అమిత్ షా, అదానీ అని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు దేశభక్తులు కాదని, దేశ ద్రోహులు అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో అధికార పక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం ఏర్పడింది.


కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, మణిపూర్ కోసం కాంగ్రెస్ చేసినదేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు భారత దేశాన్ని విడిచిపెట్టిపోవాలన్నారు. ‘‘మీరు ఇండియా కాదు’’ అని దుయ్యబట్టారు. ‘‘మీది ఇండియా కాదు, అవినీతికి ప్రతిరూపం’’ అని ప్రతిపక్ష కూటమి పేరును ఉద్దేశించి ఆరోపించారు.

స్మృతి ఇరానీ మాట్లాడుతుండగానే రాహుల్ గాంధీ లోక్ సభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఆయన సభ నుంచి వెళ్లిపోతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు. అయితే ఈ సంఘటన కెమెరాలలో చిత్రీకరణ అయినట్లు కనిపించలేదు. ఈ ఆరోపణల్లో వాస్తవాలను తెలుసుకునేందుకు అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

‘‘ఓ విషయంలో నాకు చాలా అభ్యంతరం ఉంది. నా కన్నా ముందు మాట్లాడిన వ్యక్తి సభ నుంచి వెళ్లిపోతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. మహిళలంటే ఇష్టపడనివారు, మహిళల పట్ల వ్యతిరేక భావం కలవారు మాత్రమే ఈ విధంగా మహిళా సభ్యులు ఆశీనులయ్యే పార్లమెంటులో ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. హుందాతనంలేని ఇటువంటి ప్రవర్తన మన దేశ పార్లమెంటులో మునుపెన్నడూ కనిపించలేదు’’ అని స్మృతి ఇరానీ ఆరోపించారు.


అంతకుముందు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ మాట్లాడుతూ, అవినీతి, వారసత్వ రాజకీయాలు భారత దేశాన్ని విడిచిపెట్టిపోవాలన్నారు. ‘‘మీరు ఇండియా కాదు’’ అని దుయ్యబట్టారు. ‘‘మీది ఇండియా కాదు, అవినీతికి ప్రతిరూపం’’ అని ప్రతిపక్ష కూటమి పేరును ఉద్దేశించి ఆరోపించారు. మణిపూర్ విడిపోలేదన్నారు. మణిపూర్ భారత దేశంలో అంతర్భాగమన్నారు. దేశంలో ఎంతో మందిని హత్య చేసిన చరిత్రగల కాంగ్రెస్ భారత దేశాన్ని హత్య చేసినట్లు చెప్పడంలో అర్థం లేదన్నారు. దేశంపట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, కాంగ్రెస్ పార్టీకి అటువంటి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మణిపూర్‌ను ఎవరూ విభజించలేరని, ముక్కలు చేయలేని స్పష్టం చేశారు. మణిపూర్ సహా దేశంలో మహిళల కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చేస్తున్న కృషిని వివరించారు.

ఆమె మాట్లాడుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ లోక్ సభ నుంచి వెళ్లిపోయారు.

సభ నుంచి వెళ్లిపోయేటపుడు రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించడంతో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభ కరంద్లజే నేతృత్వంలో మహిళా మంత్రులు, ఎంపీలు రాహుల్ గాంధీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇచ్చి, వెళ్లిపోయారని ఆరోపిస్తూ లోక్ సభ సభాపతి ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. శోభ మాట్లాడుతూ, రాహుల్ సభ నుంచి వెళ్లిపోతూ మహిళా సభ్యులందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారన్నారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రవర్తన అని వ్యాఖ్యానించారు. ఓ సభ్యునికి ఇటువంటి ప్రవర్తన అనౌచిత్యం, అమర్యాదకరం అన్నారు. భారత దేశ పార్లమెంటు చరిత్రలో ఇటువంటి సంఘటన ఎన్నడూ జరగలేదని సీనియర్ సభ్యులు చెప్పారని తెలిపారు. ఇదేం ప్రవర్తన? ఆయన ఏం నాయకుడు? అని ప్రశ్నించారు. మహిళా సభ్యులమంతా కలిసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని, ఆయనపై చర్యల కోసం సీసీటీవీ ఫుటేజ్‌ను కోరామని చెప్పారు.


రాహుల్ ఆలింగనాల చరిత్ర

రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రవర్తించడం కొత్త విషయం కాదు. 2018లో ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఆ తీర్మానంపై చర్చ సమయంలో మోదీని ఆయన కౌగిలించుకున్నారు. ఆ తర్వాత వేరొకరిని చూసి, కన్ను గీటారు. దీనిపై అప్పట్లో మోదీ స్పందిస్తూ, రాహుల్ కళ్లతో చేసిన విన్యాసాలను యావత్తు దేశం చూసిందన్నారు. ఆయనకు ప్రధాన మంత్రి పదవిని చేపట్టాలనే అహంకారం, ఆత్రుత ఉన్నాయన్నారు. ‘‘పీఎం కుర్చీ కోసం ఎందుకంత తొందర’’ అన్నారు.

ఇవి కూడా చదవండి :

Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..

Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..

Updated Date - 2023-08-09T15:03:42+05:30 IST