Revanth vs KTR: రేవంత్ పాదయాత్రతో అలెర్ట్ అయిన బీఆర్ఎస్.. మీటింగులతో కౌంటర్ ఎటాక్ చేస్తోన్న కేటీఆర్..!
ABN, First Publish Date - 2023-03-02T12:38:20+05:30
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. ప్రజాక్షేత్రంలోకి..
రేవంత్‌రెడ్డి పాదయాత్ర.. కారు పార్టీని కలవర పెడుతుందా?.. కాంగ్రెస్ కార్నర్ మీటింగ్స్‌కు.. బీఆర్ఎస్ కౌంటర్ మీటింగ్స్ స్టార్ట్ చేసిందా?.. రేవంత్ ఎక్కడ సభ నిర్వహిస్తే.. అక్కడ కేటీఆర్ వాలిపోతున్నారా?.. భూపాలపల్లి, స్టేషన్‌ఘనపూర్ సభలే అందుకు నిదర్శనమా?.. ఇంతకీ.. రేవంత్ పాదయాత్రతో కారు పార్టీ ఎందుకు కలవరపడుతోంది?.. కేటీఆర్ వరుస సభలు దేనికి సంకేతం?..మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
స్పందన పెరుగుతుండడంతో కారు పార్టీలో కలవరం
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. ప్రజాక్షేత్రంలోకి దూకాయి. పదునైన మాటలు.. ఘాటైన విమర్శలతో సమ్మర్ ఆరంభంలోనే రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. యాత్రల పేరుతో ప్రతిపక్షాలు, అభివృద్ది పనుల పేరిట అధికార పార్టీ పొలిటికల్ గ్రౌండ్‌ను హోరెత్తిస్తున్నాయి. బీజేపీ బూత్ స్థాయిల్లో తెలంగాణ వ్యాప్తంగా 10వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. టీ.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్రతో రోజుకో అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అటు.. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఎప్పటినుంచో పాదయాత్ర చేస్తున్నారు. అయితే.. రేవంత్ పాదయాత్రకు ప్రజల నుంచి రోజురోజుకు స్పందన పెరుగుతుండడం కారు పార్టీని కలవరపెడుతోంది. దాంతో.. రేవంత్ యాత్రను ఇన్నాళ్లు లైట్ తీసుకున్న గులాబీ పార్టీ ఇప్పుడు అలెర్ట్ అయింది.
ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్
రాహుల్‌గాంధీ పాదయాత్ర సందేశాన్ని పల్లెపల్లెకు తీసుకువెళ్లాలని ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాలతో రేవంత్‌రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టారు. రోజుకో నియోజకవర్గం తిరుగుతూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వెళ్లిన ప్రతీ చోట ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై చార్జిషీట్ విడుదల చేస్తూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలు లేవనెత్తుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. పాదయాత్రను రేవంత్ ఎన్నికల ప్రచారయాత్రగా మార్చేశారు. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లోని స్థానికులు, పార్టీ శ్రేణులు ఆయనతో కలిసి నడుస్తున్నాయి. రేవంత్ సభలు కూడా గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. దాంతో.. డ్యామేజ్ కంట్రోల్ కోసం కేటీఆర్ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది.
గ్రాండ్ సక్సెస్ అయిన నియోజకవర్గాల్లో కౌంటర్ సభలు
వాస్తవానికి.. తెలంగాణ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ కొద్దిరోజులుగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ది పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో జిల్లాలను చుట్టేస్తున్నారు. వెళ్లిన ప్రతిచోట బహిరంగ సభలు కూడా నిర్వహిస్తుండడంతో.. బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందే ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్లు అయింది. దానికి తగ్గట్లే.. మంత్రి కేటీఆర్.. ప్రతీరోజు ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇటీవల హుజూరాబాద్ వెళ్లి.. ఏకంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే క్యాండేట్ ఎవరో కూడా క్లారిటీ ఇచ్చారు. అలా.. ఇప్పటికే.. కేటీఆర్ చాలా నియోజకవర్గాలను కవర్ చేశారు. ప్రతిపక్షాలపై, గత పాలకుల వైఫల్యంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఇన్నాళ్లు విపక్షాల యాత్రలతో సంబంధం లేకుండా కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ వెళ్తున్నారు. కానీ.. తాజాగా కేటీఆర్ రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. రేవంత్ యాత్రకు మంచి స్పందన వచ్చిన చోట కార్నర్ మీటింగ్స్.. గ్రాండ్ సక్సెస్ అయిన నియోజకవర్గాల్లో కౌంటర్ సభలు పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని కౌంటర్ ఎటాక్
ఇక.. కొద్దిరోజుల క్రితం రేవంత్‌రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై ఓ రేంజ్‌లో మాటల తూటాలు పేల్చారు. అంతేకాదు.. వెళ్లిన ప్రతిచోట రేవంత్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. అయితే.. రేవంత్ సభ పెట్టిన మరుసటి రోజే.. కేటీఆర్ కూడా భూపాలపల్లి వెళ్లారు. ఒక్క ఛాన్స్ అంటున్న రేవంత్.. గతంలో కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఏం చేసిందో చెప్పాలని కౌంటర్ ఎటాక్ చేశారు. స్టేషన్‌ఘనపూర్‌లోనూ రేవంత్ పాదయాత్ర చేసి స్థానిక ఎమ్మెల్యే రాజయ్యపై చార్జిషీట్ వేశారు. మళ్లీ.. కేటీఆర్ కూడా అదే నియోజకవర్గంలో సభ నిర్వహించి.. రేవంత్ విమర్శలను తిప్పికొట్టి డ్యామేజ్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారని ప్రచారం జరుగుతోంది.
రూ.500లకే గ్యాస్ సిలిండర్, రూ.2లక్షల రైతు రుణమాఫీ
ఇదిలావుంటే... రేవంత్‌రెడ్డి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్లు క్లియర్ కట్‌గా అర్థం అవుతోంది. అందులోనూ.. 80లక్షల ఓట్లు.. 70 సీట్లు టార్గెట్‌గా ఒక్క ఛాన్స్ నినాదంతో జనాల్లోకి వెళుతున్నారు. ఐదు వందలకు గ్యాస్ సిలిండర్, రెండు లక్షల రైతు రుణమాఫీ వంటి హామీలతోపాటు.. రేవంత్ ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే.. ప్రజలు కాంగ్రెస్ వైపు టర్న్ అవకుండా ఫోకస్ డైవర్ట్ ఎత్తుగడలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా.. రేవంత్‌రెడ్డి కార్నర్ సభలు పెట్టిన నియోజకవర్గాల్లోనే.. కేటీఆర్ పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తూ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
మొత్తంగా.. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు విశేష స్పందన వస్తుండడంతో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం అలెర్ట్ అయింది. రేవంత్‌కు పోటీగా ఆయన సభలు పెట్టిన చోటే పబ్లిక్ మీటింగులు నిర్వహిస్తూ.. కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.
Updated Date - 2023-03-02T13:13:20+05:30 IST