TS Politics : పొంగులేటి, జూపల్లి అడుగులు ఎటువైపు.. ఇద్దరి దారి ఒకటేనా.. వేర్వేరా.. టచ్‌లోకి వెళ్లిందెవరు..!
ABN, First Publish Date - 2023-04-10T18:03:43+05:30
బీఆర్ఎస్ (BRS) నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావుల (Jupally Krishna Rao) గురించే తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) చర్చ నడుస్తోంది..
బీఆర్ఎస్ (BRS) నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావుల (Jupally Krishna Rao) గురించే తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) చర్చ నడుస్తోంది. సస్పెన్షన్ తర్వాత ఇద్దరూ ఏం చేయబోతున్నారు..? ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో చేరుతారా..? లేకుంటే.. వేర్వేరుగా చెరొక పార్టీలో చేరుతారా..? ఇప్పటికే అటు కాంగ్రెస్ (Congress).. ఇటు బీజేపీ (BJP) పెద్దలు ఇద్దరికీ టచ్‌లోకి వెళ్లారా..? పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరుతారా లేకుంటే కాంగ్రెస్‌లో చేరుతారా..? ఇవన్నీ కాదని కొత్త పార్టీ పెడతారా..? ఇప్పుడిదే ప్రాంతీయ పార్టీలు మొదలుకుని జాతీయ పార్టీల వరకూ నేతలు తెగ చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరికీ ఎవరెవరు టచ్‌లోకి వెళ్లారు..? ఇద్దరి క్యాడర్ ఏమని డిమాండ్ చేస్తోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం.
పొంగులేటి అడుగులు ఎటువైపో..!
పొంగులేటి, జూపల్లి ఇద్దరూ.. ఇద్దరే.. ఆర్థికంగానూ, రాజకీయంగానూ మహా మహులే. పొంగులేటి రాజకీయంగా అనుభవం తక్కువే అయినప్పటికీ ఖమ్మం జిల్లాను (Khammam) మొత్తం శాసించే పరిస్థితి. అసలు తెలంగాణలో లేని వైసీపీ (YSRCP) తరఫున తాను ఎంపీగా గెలవడంతో పాటు మరో ముగ్గురు శాసనసభ్యులను గెలిపించిన రేంజ్ పొంగులేటిది. అసలు పొంగులేటి గెలుస్తారని కానీ.. ఆయనతో పాటు ముగ్గుర్ని గెలిపించుకుని వస్తారని.. అది కూడా పచ్చి సమైక్యవాదం వినిపించిన వైసీపీ తరఫున గెలిపించుకుని వస్తారని.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కూడా బహుశా కలలో కూడా ఊహించి ఉండరేమో. ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆయన 2018 ఎన్నికల్లో ఎంపీ కాదు కదా కనీసం ప్రాధాన్యత ఉండే పదవి కూడా దక్కలేదు. సమయం వచ్చినప్పుడు తనకు తగ్గట్లుగా గులాబీ బాస్ పదవి ఇస్తారని ఇన్నిరోజులుగా వేచి చూసిన ఆయన తీవ్ర అసంతృప్తికి లోనై చివరికి రెబల్‌గా మారిపోయారు. అప్పట్నుంచీ కేసీఆర్‌పై నేరుగా విమర్శలు వర్షం కురిపించడం.. అది కాస్త సవాళ్లు చేసే స్థాయికి వెళ్లింది. జిల్లాలో తనకు పట్టున్న నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం, ఫలానా పార్టీ అని చెప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా 2023 ఎన్నికల్లో (2023 Elections) ఖమ్మం జిల్లా ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని శపథం చేశారు. అయితే ఈయన్ను బీజేపీలో చేర్చాలని రాష్ట్ర కమలనాథులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పొంగులేటికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) టచ్‌లోకి వెళ్లారు. చాలా రోజులుగా ఈయన కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలకు టచ్‌లో ఉన్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఎదురుచూపులు..!
ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత పొంగులేటిని బీజేపీ పెద్దలు తెగ వెంటాడుతున్నారట. అటు బీజేపీ పెద్దలు టచ్‌లోకి రాగా.. పొంగులేటి అభిమానులు, కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి తెస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టచ్‌లోకి వెళ్లగా డైరెక్టుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే రంగంలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila) కూడా పొంగులేటిని పార్టీలోకి చేర్చుకోవడానికి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల, విజయమ్మతో (YS Vijayamma) విడివిడిగా భేటీ కూడా అయ్యారు. అప్పట్లోనే వైఎస్సార్టీపీలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. మాటిచ్చారు.. ఆయన తమ కుటుంబ సభ్యుడు కచ్చితంగా పార్టీలోకి వస్తారని విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు కూడా. సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకూ భవిష్యత్ కార్యాచరణపై పొంగులేటి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే ఈ ఒక్కరి కోసం ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు సైతం క్యూ కడుతున్నాయంటే రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
జూపల్లి దారెటు..!?
రాజకీయాల్లో పండిపోయిన జూపల్లి కాంగ్రెస్ హయాంలో, నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్‌లో కీలకంగానే వ్యవహరించారు. కాంగ్రెస్‌లో చాలా కీలక పదవులు అనుభవించిన జూపల్లి వైఎస్సార్ (YSR), కిరణ్ రెడ్డి (Kiran Kumar Reddy) హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం టైమ్‌లో కేసీఆర్ (KCR) పిలుపుమేరకు నాటి టీఆర్ఎస్‌లో చేరిన జూపల్లికి 2014లో మంత్రి పదవి కూడా దక్కింది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో జూపల్లిపై కాంగ్రెస్ తరఫున పోటీచేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి (Bhiram Harshvardhan Reddy) 12,546 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన కొన్నిరోజులకే కాంగ్రెస్‌కు టాటా చెప్పేసి కారెక్కేశారు. అప్పట్నుంచీ జూపల్లి అసంతృప్తికి లోనయ్యారు. నాటి నుంచి నిన్న, మొన్నటి వరకూ జూపల్లి-బీరం మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఆ మధ్య పార్టీ మారతారని టాక్ నడవగా మంత్రి కేటీఆరే (Minister KTR) స్వయంగా జూపల్లి ఇంటికెళ్లడంతో అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. అయితే సడన్‌గా ఖమ్మం జిల్లా (Khammam) కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రత్యక్షమవ్వడం, కేసీఆర్ సర్కార్‌పై (KCR Govt) విమర్శలు గుప్పించడంతో గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారు.
జూపల్లి ఏమనుకుంటున్నారు.. కేడర్ ఏమంటోంది..!?
అయితే.. గత కొన్నిరోజులుగా కాంగ్రెస్ పెద్దలకు జూపల్లి టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌కు ప్రస్తుతానికి అక్కడ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎవరూ లేరు. పైగా కాంగ్రెస్ హయాంలో.. టీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారని అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే కాంగ్రెస్‌లో చేరాలని ఆయన కూడా భావిస్తున్నారట. ఈయన్ను కాంగ్రెస్‌లో చేరమనే అభిమానులు, అనుచరులు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ తరఫున గెలిచిన వ్యక్తి బీఆర్ఎస్‌లో చేరడం.. ఆయన పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తిగా ఉండటం.. తన సొంత కేడర్‌తో పాటు ఆ కేడర్ కూడా తనతో కలిసి అడుగులేయడానికి సిద్ధంగానే ఉందని భావిస్తున్నారట. అందుకే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్సే కరెక్టే అని.. తన మూలాలు కూడా కాంగ్రెస్‌వే కాబట్టి ఇదే బెస్ట్ అని ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఒకప్పుడు ఈయనతో పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన సహచర నేతలు మాత్రం ఇప్పుడు బీజేపీలో చేరారు. డీకే అరుణ లాంటి సీనియర్ నేతలు ఇప్పుడు బీజేపీలో ఉండటంతో కాషాయ కండువా కప్పుకోవాలని అడుగుతున్నారట. ‘ బీజేపీలోకి రండన్నా .. కలిసి పనిచేద్దాం’ అని జూపల్లితో నేరుగానే డీకే అరుణ (DK Aruna) మాట్లాడారు. రెండు పార్టీల నుంచి పిలుపు రావడంతో ఆయన ఏ కండువా కప్పుకోవాలో తెలియక ఆలోచనలో పడ్డారట. రెండు మూడ్రోజుల్లో కీలక నిర్ణయమే తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ప్రకటించబోతున్నారట.
మొత్తానికి చూస్తే.. ఇద్దరి కోసం జాతీయ పార్టీలు మాత్రం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయ్. ఇద్దరూ వేర్వేరు పార్టీలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయ్. ఇక బీజేపీ అయితే ఇద్దరికీ కాషాయ కండువా కప్పాలని విశ్వప్రయత్నాలే చేస్తోంది. ఈ ఇద్దరి గురించి బీజేపీ జాతీయ నాయకత్వానికి సమాచారం వెళ్లగా.. చేరికపై స్పష్టత ఇస్తే నేరుగా ఢిల్లీకి తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వానికి కీలక ఆదేశాలు కూడా వచ్చేశాయ్. పిలుపు అయితే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చింది.. మరి ఈ ఇద్దరి మనసులో ఏముందో.. ఏ పార్టీలో చేరతారో అని అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.
*****************************
ఇవి కూడా చదవండి..
*****************************
Kiran Reddy : కిరణ్ రెడ్డిని ఒప్పించి దగ్గరుండి బీజేపీలో చేర్చింది.. కథ మొత్తం నడిపింది ఈయనే..!
*****************************
Kiran Reddy : ఢిల్లీలో బిజిబిజీగా కిరణ్ రెడ్డి.. కీలక పదవి ఇవ్వబోతున్నారా.. పోటీ ఎక్కడ్నుంచో..!?
*****************************
Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?
*****************************
Updated Date - 2023-04-10T18:16:20+05:30 IST