Viral Video: ఇలాంటి పెళ్లి మునుపెన్నడూ చూసుండరు.. వైరల్ అవుతున్న వీడియో!
ABN , First Publish Date - 2023-08-03T12:37:07+05:30 IST
ఫిలిప్పీన్స్‌ను డోక్సరీ తుఫాను (Typhoon Doksuri) అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.
Viral Video: ఫిలిప్పీన్స్‌ను డోక్సరీ తుఫాను (Typhoon Doksuri) అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. దాంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అయితే, ఆ వరద నీటిలోనే ఓ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ఇప్పుడీ పెళ్లి తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మేయి, పాలో పాడిల్లాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లోవాళ్లకు కూడా తమ ప్రేమ (Love) విషయం చెప్పి, పెళ్లికి ఒప్పించారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహ వేడుకను గ్రాండ్‌గా చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే, వారి ఆశలపై డోక్సరీ తుఫాను నీళ్లు చల్లింది. తుఫాను కారణంగా వరదలు పోటెత్తడంతో ఏం చేయాలో తెలియలేదు. దాంతో పరిస్థితులు చక్కబడేవరకు పెళ్లిని వాయిదా వేసుకుందామనుకున్నారు ఇరు కుటుంబాల పెద్దలు. కానీ, వధువు మాత్రం అనుకున్న సమయానికే పెళ్లి జరగాలని పట్టుబట్టింది. దాంతో చేసేదేమిలేక వారి కుటుంబ సభ్యులు వరద నీటిలోనే ఈ ప్రేమ జంట పెళ్లి జరిపించారు. దాదాపు అడుగు మేర నీటిలో వధువు నడుచుకొని వస్తుంటే బంధువులు ఆమెకు స్వాగతం పలికారు. ఆ అడుగు మేర నీటిలో భర్తతో కలిసి ఏడడుగులు వేసిందా వధువు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.