Crime: పోలీసుల ముందు నిల్చున్న ఇతడు అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ.. అతడి ఇంట్లో వెతికితే ఏం బయటపడ్డాయో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-10-18T14:01:09+05:30 IST
రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్‌గఢ్ పరిధిలోని ఓ ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు అక్కడ బయటపడిన వాటిని చూసి అవాక్కయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్‌గఢ్ పరిధిలోని ఓ ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు అక్కడ బయటపడిన వాటిని చూసి అవాక్కయ్యారు. పోలీసులకు ఆ ఇంటి నిండా స్టీల్ బాక్సులే కనిపించాయి. దాంతో అనుమానం వచ్చి వాటిని ఓపెన్ చూసిన పోలీసులు నిర్ఘాంతపోయారు. అనంతరం ఇంటి యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తోర్‌గఢ్ జిల్లా మండాఫీయా పోలీస్ స్టేషన్ పరిధిలోని కోషిథల్ గ్రామం. ఈ విలేజ్‌లోనే భైరులాల్ జాట్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే, అతడి ఇంట్లో భారీ మొత్తంలో స్టీల్ బాక్సులు ఉండడం చూసిన గ్రామస్థులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు భైరులాల్ ఇంట్లో తనిఖీ చేశారు.
ఆ సమయంలో ఇంటి నిండా ఉన్న స్టీల్ బాక్సులను బయటకు తీశారు. అనంతరం వాటిని ఒక్కొక్కటిగా తెరిచి చూశారు. వాటిలో భారీ మొత్తంలో నల్లమందు (Opium), డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు ఉండడం చూసి అవాక్కయ్యారు. వాటిలో 73 కిలోల 700 గ్రాముల నల్లమందు, 3కిలోలకు పైగా వెండి, 54 గ్రాముల వరకు బంగారం, రూ.5.08లక్షల నగదు బయటపడ్డాయి. దాంతో భైరులాల్ జాట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు అతని వద్ద అంత భారీ మొత్తంలో నల్లమందు ఎలా వచ్చిందని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, భైరులాల్ ఇంట్లో దొరికిన నల్లమందు,వెండి, బంగారం విలువ రూ. 4కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఓటర్లకు పంచిపెట్టేందుకు ఇలా భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు, నగలు, నగదు ఒకచోట దాచిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలాఉంటే.. గడిచిన నెల రోజులుగా నిర్వహిస్తున్న తనిఖీలలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.75కోట్ల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.