Puneeth Rajkumar: హద్దుల్లేని అభిమానం.. వరి పొలంలో ‘పునీత్’ బొమ్మ
ABN , First Publish Date - 2023-10-15T09:47:59+05:30 IST
ప్రముఖ కన్నడ సినీ నటుడు దివంగత పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar) భావ చిత్రాన్ని ఏకంగా వరిపైరు నడుమ ఆవిష్కరించి అభిమానాన్ని చాటుకున్నాడు
- భావచిత్రం కోసం రెండు ఎకరాలు కేటాయించిన రైతు
బళ్లారి(బెంగళూరు): ప్రముఖ కన్నడ సినీ నటుడు దివంగత పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar) భావ చిత్రాన్ని ఏకంగా వరిపైరు నడుమ ఆవిష్కరించి అభిమానాన్ని చాటుకున్నాడు ఓ రైతు. రాయచూరు జిల్లా పరిధిలోని ఢోణి బసవణ్ణ క్యాంప్‌నకు చెందిన రైతు కర్లి సత్యనారాయణకు ఆరు ఎకరాల పొలం ఉంది. అందులో రెండు ఎకరాల్లో పునీత్ రాజ్‌కుమార్ భావచిత్రం మాదిరిగా వరిపైరు పండించి త్వరలో జరిగే రెండో వర్ధంతిని అభిమానంతో ఆచరించడానికి సిద్ధమయ్యాడు. చిన్నప్పటి నుంచి పునీత్ అభిమానిగా ఉన్న సత్యనారాయణ గుజరాత్ నుంచి తీసుకొచ్చిన గోల్డెన్ రోజ్ మొక్కలతో పాటు వరిపైరు నడుమ సోనామసూరి పైరు 100 కిలోల వరి విత్తనాలను ఉపయోగించాడు. పైనుంచి చూస్తే పునీత్ భావచిత్రం స్పష్టంగా కనిపిస్తుండడం రైతు కళానైపుణ్యానికి అద్దం పడుతోంది. ప్రస్తుతం వరి పైరుకు మూడునెలల వయసు ఉంది. జూలై 17న వరినాట్లు వేసిన ఆ రైతు తన అభిమాన నటుడి భావచిత్రం కోసం రూ. 3లక్షలు ఖర్చు చేశాడు. యూటూబ్ ద్వారా తెలుసుకున్న రైతు డ్రోన్ కెమెరా ఉపయోగించి పై నుంచి పైరును వీక్షించి అవసరమైన చోట కత్తిరింపులు చేసి పునీత్ చిత్రం కనిపించేలా చేశారు. కాలువ నీరు రాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసి పంటను కాపాడుకుని పునీత్‌పై అభిమానం చాటుకున్నాడు. 140 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు, ఒక్కొక్క కన్ను 10 అడుగులు ఉండేలా మొత్తం 400 చదరపు అడుగులు ఉండే రూపొందించారు. కింది భాగంలో కర్ణాటక రత్న అనే పదాన్ని పొందుపరిచాడు.