Rajanikath row: సిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీకాంత్ కారణమా? సడెన్‌గా తెరపైకి చివరిలేఖ ఇదేనంటూ వైరల్... అందులో ఏముందంటే..

ABN , First Publish Date - 2023-05-02T12:30:20+05:30 IST

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ‘టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ’ (TDP chandra babu) అంటూ తలైవర్‌ రజనీకాంత్‌ (thalaivar rajanikath) ప్రశంసించడంపై వైసీపీ (YCP) అనైతిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి...

Rajanikath row: సిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీకాంత్ కారణమా? సడెన్‌గా తెరపైకి చివరిలేఖ ఇదేనంటూ వైరల్... అందులో ఏముందంటే..

సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి.. బస్సు కండక్టర్ స్థాయి నుంచి నటుడిగా ఎదిగి.. ఆ తర్వాత సూపర్‌స్టార్‌గా అంచెలంచెలుగా శిఖరమంతా కీర్తిని సంపాదించి.. భారత్ ఎల్లలు దాటి అశేష అభిమానగణాన్ని పోగేసుకుని.. సమాజంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే రజనీ కాంత్ (Rajanikanth) ఒక పక్క.... అధికారం చూసుకుని కళ్లు నెత్తికెక్కి.. రాజకీయ స్వప్రయోజనాలకై ఏ స్థాయికైనా నిస్సిగ్గుగా దిగజారి.. సొంత కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికీ వెనుకాడని నైజమున్న బ్యాచ్ ఒకపక్క.... ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ‘టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ’ (TDP chandra babu) అంటూ తలైవర్‌ రజనీకాంత్‌ (thalaivar rajanikath) ప్రశంసించడంపై వైసీపీ (YCP) అనైతిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

రజనీ మాట్లాడి రోజులు గడుస్తున్నా అక్కసు వెళ్లగక్కడం ఇంకా ఆగలేదు. మంత్రుల స్థాయి నుంచి మంత్రి పదవి ఊడిపోయిన వ్యక్తులు, ఆఖరికి జనాల్లో ఆదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలు సైతం ఆయనపై ఇప్పటికే నోరుపారేసుకున్నారు. తలైవర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. వైసీపీ నేతలకు పెద్దగా పరిజ్ఞానం లేదులే అనుకోవచ్చు. కానీ రజనీ వ్యక్తిత్వాన్ని దగ్గర చూసిన నటి, ప్రస్తుత మంత్రి ఆర్‌కే రోజా సైతం రజనీకాంత్‌ను కించపరిచేలా మాట్లాడడం ఒకింత విస్మయం కలిగించింది. రాష్ట్రానికి వచ్చిన అతిథిపై ఈ విధంగా విరుచుకుపడడమేంటి? ఇదేం పోకడ? అనే పెద్ద చర్చ కూడా జరిగింది. అయితే వైసీపీ నేతలు రజనీపై చేసిన బహిరంగ ఆరోపణలు అందరికీ పైకి కనిపిస్తున్నా... అంతకుమించి అనేలా సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తోంది వైసీపీ. ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ సూపర్‌స్టార్ వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అత్యంత దారుణంగా దిగజారి ప్రవర్తిస్తున్నారు ఆ పార్టీ సోషల్ మీడియా వర్కర్లు.

సిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీతో ముడి..!

వైసీపీ ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రశంసిస్తే మాత్రం రజనీకాంత్‌పై ఈ స్థాయిలో దాడి చేయాలా?.. అనేంతలా వైసీపీ సోషల్ మీడియా హద్దులుదాటి ప్రవర్తిస్తోంది. సూపర్‌స్టార్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా దారుణాతి దారుణమైన పోస్టులకు తెగబడుతోంది. ఈ అరాచకాన్ని ఏ స్థాయిలో కొనసాగిస్తున్నారో తెలియజేసే పోస్ట్ ఒకటి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. దివంగత నటి సిల్క్‌స్మిత ఆత్మహత్యకు రజనీకాంతే (Silk Smitha - Rajani kanth) కారణమని అర్థం వచ్చేలా ఒక లేఖను వైరల్‌గా మార్చారు. సిల్క్‌స్మిత రాసిన చివరి లేఖ ఇదేనంటూ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. రజనీపై వైసీపీ దాడి మొదలయ్యాకే ఈ లేఖ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకాలం ఎప్పుడూలేని ఈ లేఖను పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు.

ఇంతకీ ఆ లేఖలో ఏముంది?..

‘‘ దేవుడా నా 7వ సంవత్స‌రం నుంచి పొట్టకూటి కోసం క‌ష్ట‌ప‌డ్డాను. న‌మ్మినవారే న‌న్ను మోసం చేశారు. నా వారంటూ ఎవ‌రూ లేరు. బాబు త‌ప్ప నాపై ఎవరూ ప్రేమ చూప‌లేదు. బాబు త‌ప్ప అందరూ నా క‌ష్టం తిన్న‌వారే. నా సొమ్ము తిన్న‌వారే నాకు మ‌న‌శ్శాంతి లేకుండా చేశారు. అంద‌రికీ మంచే చేశాను కానీ నాకు చెడు జ‌రిగింది. నా ఆస్తిలో ఉన్న‌దంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశ‌ల‌న్నీ ఒక‌రిమీదే పెట్టుకున్నా…అత‌ను నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. రాము, రాధాకృష్ణన్‌ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ వారు నాకు వారు చేసింది చాలా దారణం. నాకు ఒక‌డు 5 సంవ్స‌రాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వ‌డం లేదు. నా రెక్క‌ల క‌ష్టం తిన‌ని వాడు లేడు బాబు త‌ప్ప‌. ఇది రాయ‌డానికి నేను ఎంత న‌ర‌కం అనుభ‌వించానో మాట‌ల్లో చెప్ప‌లేను’’ అని లేఖలో ఉందని ప్రచారం చేస్తున్నారు. సిల్క్ స్మిత చనిపోయినప్పుడు కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదని, దీనికి రజనీకాంతే కారణం అని అర్థం వచ్చేలా నిందలుమోపే ప్రయత్నం చేస్తున్నారు.

Untitled-5.jpg

భగ్గుమన్న తలైవర్ ఫ్యాన్స్..

తమ అభిమాన ఆరాధ్యదైవాన్ని అత్యంత దారుణంగా కించపరుస్తూ దాడులకు తెగబడుతున్న వైసీపీపై సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. వ్యక్తిత్వహనన ప్రయత్నాలకు వేదికైన అదే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై తగిన బుద్ధి చెబుతున్నారు. స్మిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీయే కారణమని అర్థం వచ్చేలా పెడుతున్న పోస్టులను ఖండిస్తున్నారు. రజనీకాంత్ క్యారక్టర్ గురించి తెలుసుకోవాలని కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ‘32 సీబీఐ కేసులు ఉన్న జగన్‌మోహన్‌ రెడ్డితో 32 దేశాల్లో అభిమానులను కలిగివున్న రజనీకాంత్‌కు పోలికేంటి’’ అంటూ తగిన సమాధానం చెబుతున్నారు. ‘పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్ వస్తుంది’ అంటూ పంచులు పేలుస్తున్నారు.

మరోవైపు గతంలో ఓ సినీ ఈవెంట్‌లో రోజా మాట్లాడుతుండగా.. వేదిక వద్దకు రజనీకాంత్ విచ్చేసిన సందర్భంలో స్టేడియం ఎంతలా దద్దరిల్లిపోయిందో సాక్ష్యంగా ఒక వీడియోను కూడా వైరల్ చేశారు. ఇంత జరుగుతున్నా మౌనంగా ఉన్న రజనీకాంత్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయమని, వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ‘వైఎస్‌ జగన్ రజనీకి క్షమాపణలు చెప్పాలి’, ‘వైసీపీ రజనీకి క్షమాపణలు చెప్పాలి’, ‘తెలుగు పీపుల్‌ స్టాండ్‌ విత్ రజనీ’ అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌గా మారిందంటే తలైవర్ ఫ్యాన్స్ ఎంతగా రగిలిపోతున్నారో అర్థమవుతోంది. ఏదెలా ఉన్నా రజనీకాంత్‌పై వైసీపీ ఈ స్థాయి దాడి చేయడం అనవసర రాద్ధాంతమని, వైసీపీకి ఒరిగేదేమీలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఈ ఎపిసోడ్‌కు ఇకనైనా ముగింపు పడుతుందో లేదో చూడాలి మరి.

Updated Date - 2023-05-02T14:01:35+05:30 IST