IND vs ENG: కెప్టెన్‌గా 100వ మ్యాచ్‌కు సిద్ధమైన రోహిత్ శర్మ.. ఇప్పటివరకు ఈ మార్కు అందుకున్న ఆటగాళ్లు వీళ్లే!
ABN, First Publish Date - 2023-10-29T13:08:03+05:30
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లను పూర్తి చేసుకోబోతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా హిట్‌మ్యాన్ ఈ ప్రత్యేక ఘనతను సాధించనున్నాడు.
లక్నో: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లను పూర్తి చేసుకోబోతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా హిట్‌మ్యాన్ ఈ ప్రత్యేక ఘనతను సాధించనున్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు రోహిత్ శర్మ 99 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అత్యధికంగా 51 టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత 39 వన్డే మ్యాచ్‌ల్లో, 9 టెస్టు మ్యాచ్‌ల్లో రోహిత్ నాయకత్వం వహించాడు. మొట్టమొదటి సారిగా 2017లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో టీమిండియా ఏకంగా 73 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. విజయాల శాతంగా 73గా ఉండడం విశేషం. 23 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోగా.. 3 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా రెండు సార్లు ఆసియా కప్ కూడా గెలిచింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకోబుతున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 7వ భారత కెప్టెన్‌గా నిలవనున్నాడు. మొత్తంగా 49వ కెప్టెన్‌గా ఘనత వహించనున్నాడు.
కాగా రోహిత్ కంటే ముందు ఈ ఘనతను ఆరుగురు భారత కెప్టెన్లు సాధించారు. వారిలో మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్, మహ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. ఇక టీమిండియా తరఫున అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని మొదటి స్థానంలో ఉన్నాడు. ధోని 332 మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత మహ్మద్ అజారుద్దీన్ 221 మ్యాచ్‌ల్లో, విరాట్ కోహ్లీ 213 మ్యాచ్‌ల్లో, సౌరవ్ గంగూలీ 196 మ్యాచ్‌ల్లో, కపిల్ దేవ్ 108 మ్యాచ్‌ల్లో, రాహుల్ ద్రావిడ్ 104 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 62 సగటుతో 311 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్‌తో టీమిండియా లక్నో వేదికగా మ్యాచ్ ఆడనుంది. కాగా ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లలో లక్నో మైదానంలో ఇప్పటివరకు వన్డే సెంచరీ చేసింది ఒక్క రోహిత్ శర్మనే కావడం గమనార్హం.
Updated Date - 2023-10-29T13:15:19+05:30 IST