World Cup: భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ పిచ్ రిపోర్టు, రెండు జట్ల హెడ్ టూ హెడ్ రికార్డులు ఇదిగో!
ABN, First Publish Date - 2023-11-05T11:23:40+05:30
వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సౌతాఫ్రికాతో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
కోల్‌కతా: వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సౌతాఫ్రికాతో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. పాయింట్స్ టేబుల్‌లో టాప్ 2 జట్ల మధ్య పోటీ కావడంతో మ్యాచ్ ఆసక్తిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు అన్ని విభాగాల్లో అదరగొడుతున్నాయి. పైగా ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీస్ బెర్త్ కూడా ఖరారు చేసుకున్నాయి. దీంతో ఇక రెండు జట్లు దృష్టి పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో నిలవడంపైనే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే లీగ్ దశను టాప్ ప్లేసుతో ముగించే అవకాశాలున్నాయి. ఈ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా అందరి కంటే ముందుగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే ఓడి 6 గెలిచిన సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉంది. అయితే నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పైనే అందరి చూపు ఉంది.
రెండు జట్ల మధ్య గత హెడ్ టూ హెడ్ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే భారత్, సౌతాఫ్రికా జట్లు వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు 90 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా సౌతాఫ్రికా 50, భారత్ 37 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్లు 5 సార్లు తలపడ్డాయి. భారత్ 2 మ్యాచ్‌ల్లో, సౌతాఫ్రికా 3 మ్యాచ్‌ల్లో గెలిచాయి. రెండు జట్ల మధ్య జరిగిన చివరి 2 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత జట్టే గెలిచింది. అయితే 2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పటికీ లీగ్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది.
ఇక మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్టు విషయానికొస్తే.. ఇక్కడ పరుగుల వరద పారుతోంది. అయితే మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లకు పిచ్‌నుంచి మద్దతు లభించవచ్చు. ఈ వేదికపై జరిగిన గత 10 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్ల సగటు స్కోరు 284. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయానికి 70 శాతం అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉండవచ్చు. ఈ వేదికపై దక్షిణాఫ్రికా 2011లో, భారత్ ఈ ఏడాది జనవరిలో తమ చివరి మ్యాచ్‌ల్ని ఆడాయి. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ తన వ్యక్తిగత అత్యుత్తమ స్కోర్ 264 పరుగులు చేసింది ఇక్కడే కావడం గమనార్హం. ఇక మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండే అవకావాలు లేవు. దీంతో పూర్తి ఆట జరగనుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయాస్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, షమి, బుమ్రా, కుల్దీప్, సిరాజ్
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), డికాక్, డ్యుసెన్, మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, కొట్జీ, కేశవ్ మహరాజ్, రబాడ, ఎన్‌గిడి
Updated Date - 2023-11-05T12:24:02+05:30 IST