Share News

World cup: 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన డికాక్

ABN , First Publish Date - 2023-10-24T19:30:58+05:30 IST

48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డికాక్ విశ్వరూపం చూపించాడు.

World cup: 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన డికాక్

వాంఖడే: 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డికాక్ విశ్వరూపం చూపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోసిన డికాక్ భారీ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో కేవలం 140 బంతుల్లోనే 15 ఫోర్లు, 7 సిక్సులతో 174 పరుగులు చేశాడు. దీంతో వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన వికెట్ కీపర్‌గా ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 2007 ప్రపంచకప్ ఫైనల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగులు చేసిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ రికార్డును బద్దలుకొట్టాడు. అలాగే ఈ మ్యాచ్‌లో డికాక్ మరిన్ని రికార్డులను చేరుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో డికాక్‌కు ఇది మూడో సెంచరీ. దీంతో ఒక ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే అన్ని ప్రపంచకప్‌లలో కలిపి కూడా డికాక్‌కు ఇది మూడో సెంచరీనే. గతంలో 2015, 2019 ప్రపంచకప్‌లలో కూడా ఆడినప్పటికీ ఒక సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. అయినప్పటికీ అన్ని ప్రపంచకప్‌లలో సౌతాఫ్రికా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో 4 సెంచరీలతో ఏబీ డివిలియర్స్ మొదటి స్థానంలో ఉన్నాడు.


అలాగే వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో 4 సెంచరీలు చేసిన శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే వన్డే క్రికెట్‌లో 150+ స్కోర్ చేయడం డికాక్‌కు ఇది మూడో సారి. దీంతో వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు 150+ స్కోర్లు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే క్వింటన్ డికాక్(174) విశ్వరూపానికి తోడు క్వాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్(90), కెప్టెన్ మాక్రమ్ హాఫ్ సెంచరీతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 382/5 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 383 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా ప్రపంచకప్ చరిత్రలో 350+ స్కోర్ సాధించడం సౌతాఫ్రికాకు ఇది 8వ సారి. దీంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యధికసార్లు 350+ స్కోర్ సాధించిన జట్టుగా సౌతాఫ్రికా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 7 సార్లు ఈ మార్కు అందుకున్న ఆస్ట్రేలియా రికార్డును సౌతాఫ్రికా బ్రేక్ చేసింది.

Updated Date - 2023-10-24T19:30:58+05:30 IST