World cup: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థిని 100 లోపే చుట్టేసిన టీమిండియా.. ఆ ప్రపంచ రికార్డు సమం
ABN, First Publish Date - 2023-11-06T12:42:35+05:30
సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా దుమ్ములేపుతోంది. అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ అందరి కంటే ముందుగానే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
కోల్‌కతా: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా దుమ్ములేపుతోంది. అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ అందరి కంటే ముందుగానే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆడిన 8 మ్యాచ్‌ల్లో గెలిచిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అదరగొడుతున్న రోహిత్ సేన ప్రత్యర్థులను సునాయసంగా చిత్తు చేస్తూ టోర్నీలో దూసుకుపోతుంది. ముఖ్యంగా మన బౌలర్లు దుమ్ములేపుతున్నారు. ఆరంభం నుంచే వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెడుతున్నారు. కలిసికట్టుగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను కనీస పరుగులు కూడా చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. టీమిండియా ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో అయితే ప్రత్యర్థులను కనీసం 100 పరుగులు కూడా చేయనివ్వలేదు. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో, నవంబర్ 2న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మన బౌలర్లు విశ్వరూపం చూపించారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు మన బౌలర్ల ధాటికి కనీసం మూడంకెల స్కోర్ కూడా చేయలేకపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ రెండు మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ సాధించిన వ్యక్తిగత స్కోర్‌ను కూడా ఆయా జట్లు అందుకోలేకపోయాయి.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాను మన బౌలర్లు కేవలం 83 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్ల ధాటికి సఫారీలు 27.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగారు. దీంతో టీమిండియా 243 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. సౌతాఫ్రికా వన్డే చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 101 పరుగులు చేయగా.. సౌతాప్రికా జట్టు మొత్తం కలిసి 83 పరుగులే చేసింది. అంటే కోహ్లీ కంటే 18 పరుగులు తక్కువే చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 2న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు నిప్పులు కక్కారు. లంకేయులను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా జట్టు కేవలం 19.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగల్గింది. దీంతో ఏకంగా 302 పరుగుల తేడాతో భారత జట్టు ఘనవిజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 88 పరుగులు చేశాడు. కానీ లంక జట్టు మొత్తం కలిసి కూడా కోహ్లీ చేసినన్నీ పరుగులు చేయలేకపోయింది. కోహ్లీ కన్నా 33 పరుగులు తక్కువగా చేసింది.
ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచ రికార్డును సమం చేసింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను 100 పరుగుల లోపే ఆలౌట్ చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో శ్రీలంక రికార్డును సమం చేసింది. 2007 ప్రపంచకప్‌లో శ్రీలంక కూడా ప్రత్యర్థులను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 100 పరుగుల లోపే ఆలౌట్ చేసింది. కాగా ఆసియా కప్ ఫైనల్‌లో కూడా శ్రీలంకను భారత జట్టు 50 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ప్రపంచకప్‌లో అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మన బౌలర్లు సత్తా చాటారు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 129 పరుగులకే ఆలౌట్ చేశారు. అలాగే అంతకుముందు ఆస్ట్రేలియాను 199 పరుగులకు, పాకిస్థాన్‌ను 191 పరుగులే టీమిండియా ఆలౌట్ చేసింది.
Updated Date - 2023-11-06T12:42:43+05:30 IST