World Cup: వరల్డ్ కప్‌నకు రోహిత్‌ను ఎంపిక చేయొద్దని ధోనినే చెప్పాడు.. మాజీ సెలెక్టర్ సంచలన కామెంట్స్
ABN, First Publish Date - 2023-08-22T15:45:24+05:30
మహేంద్రసింగ్ ధోని కోరిక మేరకే 2011 వన్డే ప్రపంచకప్‌నకు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదని టీమిండియా మాజీ సెలెక్టర్ రాజా వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మహేంద్రసింగ్ ధోని కోరిక మేరకే 2011 వన్డే ప్రపంచకప్‌నకు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదని టీమిండియా మాజీ సెలెక్టర్ రాజా వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాటి ప్రపంచకప్‌నకు టీమిండియాను ఎంపిక చేసినప్పుడు 14 మంది ఎంపిక సజావుగా సాగిపోయిందని, 15వ ఆటగాడిగా రోహిత్ శర్మను ఎంపిక చేయాలనుకున్నామని ఆయన తెలిపాడు. కానీ నాడు టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని అందుకు ఒప్పుకోలేదని చెప్పాడు. రోహిత్ స్థానంలో లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లాను ఎంపిక చేయాలని సూచించాడని తెలిపాడు. ధోని నిర్ణయంతో నాటి జట్టు హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కూడా మాట మార్చినట్టు రాజా వెంకట్ చెప్పుకొచ్చాడు. 2008 నుంచి 2012 మధ్య టీమిండియా సెలెక్టర్‌గా ఉన్న రాజా వెంకట్ ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు బయటపెట్టాడు.
‘‘2011 ప్రపంచకప్‌నకు జట్టును ఎంపిక చేసే సమయంలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఆ సమయంలో నేను యశ్‌పాల్ శర్మ కూడా అక్కడే ఉన్నాం. మిగిలిన ముగ్గురు సెలెక్టర్లు శ్రీకాంత్, భావే, హిర్వాణి చెన్నైలో ఉన్నారు. 2011 ప్రపంచకప్‌నకు టీమిండియాను ఎంపిక చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్, కెప్టెన్ ధోని కలిసి 2 గంటలపాటు చర్చించాం. ప్రపంచకప్‌నకు 15 మంది సభ్యులు అవసరం కాగా మొదటి 14 మంది ఎంపిక సజావుగా సాగిపోయింది. 15వ ఆటగాడిగా మేము రోహిత్ శర్మను సూచించాం. కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కూడా అందుకు ఒప్పుకున్నాడు. కానీ ధోని ఒక్కడే మాతో ఏకీభవించలేదు. రోహిత్ శర్మకు బదులు లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా కావాలని పట్టుబట్టాడు. దీంతో గ్యారీ కిర్‌స్టన్ కూడా మాట మార్చేశాడు. అవును అదే బెటర్ ఛాయిస్ అన్నాడు. అప్పటికీ మేము రోహిత్ శర్మ ఆల్‌రౌండర్‌గా కూడా ఉపయోగపడతాడని నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. కానీ ధోని అంగీకరించకపోవడంతో రోహిత్ శర్మకు జట్టులో చోటు దక్కలేదు. రోహిత్‌ను ఎంపిక చేయనందుకు మేము కూడా చాలా బాధపడ్డాం. కానీ కెప్టెన్, కోచ్ ఒకే మాటపై ఉండడంతో ఏమి చేయలేకపోయాం. మొత్తంగా ధోని ఆలోచనలకు అనుగుణంగా 2011 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేశాం. ఆ టోర్నీలో టీమిండియా గెలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే రోహిత్ శర్మను ఎంపిక చేయనందుకు పెద్ద రచ్చ జరిగేది’’ అని రాజా వెంకట్ చెప్పాడు.
కాగా 2007 టీ20 ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ ఆ ట్రోఫి టీమిండియా గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో ఫైనల్ పోరులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటి నుంచి జట్టులో కొనసాగుతూ వచ్చాడు. కానీ అనూహ్యంగా 2011 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. దీంతో తాను చాలా బాధపడ్డానని రోహిత్ శర్మ కూడా పలుమార్లు చెప్పాడు. కాగా ఆ ప్రపంచకప్‌లో రోహిత్ స్థానంలో జట్టులోకి ఎంపిక చేసిన పీయూష్ చావ్లా 3 మ్యాచ్‌లు ఆడి 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఏది ఏమైనా ఆ తర్వాత టీమిండియాలో స్టార్ ఆటగాడిగా మారిన రోహిత్ శర్మ నేడు కెప్టెన్‌గా ఉన్నాడు. ధోని ప్రోత్సాహంతోనే ఓపెనర్‌గా మారి అదరగొడుతున్నాడు. కెప్టెన్‌గా ఈ సారి ఎలాగైనా టీమిండియాకు ప్రపంచకప్ అందించాలని పట్టుదలగా ఉన్నాడు.
Updated Date - 2023-08-22T15:45:24+05:30 IST