Share News

Hardik : హార్దిక్‌కే ముంబై పగ్గాలు

ABN , Publish Date - Dec 16 , 2023 | 04:01 AM

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పు

 Hardik : హార్దిక్‌కే ముంబై పగ్గాలు

రోహిత్‌ స్థానంలో నియామకం

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం) ముంబై: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పు జరిగింది. ఊహించినట్టుగానే జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను పక్కనబెట్టి హార్దిక్‌ పాండ్యాకు బాధ్యతలు అప్పగించారు. దీంతో వచ్చే ఏడాది లీగ్‌లో అతడి నాయకత్వంలోనే జట్టు బరిలోకి దిగనుంది. గత రెండు సీజన్లలో గుజరాత్‌ టైటాన్స్‌ను ఫైనల్‌కు చేర్చడంతో పాటు ఓసారి విజేతగా నిలిపిన పాండ్యా.. నవంబరులో ట్రేడింగ్‌ ద్వారా తన పాత జట్టులో చేరిన విషయం తెలిసిందే. అప్పుడే ముంబై పగ్గాలు అతడికే అప్పగిస్తారనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ జట్టుకు ఐదు ఐపీఎల్‌ టైటిళ్లను అందించి సక్సె్‌సఫుల్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ నుంచి అంత త్వరగా బాధ్యతలను లాగేసుకుంటారా? అనే సందేహం కూడా వ్యక్తమైంది. కానీ అన్నింటినీ పటాపంచలు చేస్తూ ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం యువ నాయకత్వానికే జై పలికి.. పాండ్యాను తమ కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. ‘మా భవిష్యత్‌ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పు జరిగింది. జట్టుకు ప్రారంభం నుంచి కూడా సచిన్‌, హర్భజన్‌, పాంటింగ్‌, రోహిత్‌ల రూపంలో అద్భుతమైన కెప్టెన్లు లభించారు. ఇక 2013 నుంచి ఇప్పటివరకు కెప్టెన్‌గా విలువైన సేవలందించినందుకు రోహిత్‌కు కృతజ్ఞతలు. మున్ముందు కూడా మైదానంలోనూ, వెలుపలా అతడి సేవలను పొందుతాం’ అని ఫ్రాంచైజీ గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ పెర్ఫార్మెన్స్‌ జయవర్ధనె తెలిపాడు.

పాండ్యా 2015 నుంచి 2021 వరకు ఐపీఎల్‌లో ముంబై తరఫున కీలక ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. అయితే 2022 సీజన్‌కు ముందు జట్టు అతడిని వదిలేసుకోగా.. కొత్త టీమ్‌ గుజరాత్‌ హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. దీంతో అదే ఏడాది గుజరాత్‌ చాంపియన్‌గా నిలువగా.. ఈ ఏడాది రన్నర్‌పగా నిలిచి ఆకట్టుకుంది. మరోవైపు 36 ఏళ్ల రోహిత్‌ శర్మ ఇప్పుడు ముంబై జట్టులో ఎలాంటి పాత్ర పోషిస్తాడనే విషయం తేలాల్సి ఉంది.

బంధం ముగిసినట్టేనా?

ముంబై ఇండియన్స్‌తో రోహిత్‌ శర్మ బంధం రాబోయే సీజన్‌తో ముగియనుందా? 2024 ఐపీఎల్‌కు ముంబై సారథిగా హార్దిక్‌ పాండ్యాను నియమించడంతో ఈ వాదన తెరపైకి వచ్చింది. ముంబైపట్ల తిరుగులేని విధేయత ప్రకటించిన రోహిత్‌ 11 సీజన్లలో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఐదుసార్లు ప్రతిష్ఠాతక ట్రోఫీని తన నాయకత్వంలో అందించాడు. 2025లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో..రోహిత్‌ ముంబై జట్టుతో ఉండే అవకాశాలు ఎంతమాత్రం లేవు. కారణం..ఒక విదేశీ క్రికెటర్‌ సహా నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఆయా జట్లు రిటైన్‌ చేసుకొనేందుకు వీలుండడం. అంటే..హార్దిక్‌, సూర్యకుమార్‌, బుమ్రాను మాత్రమే ముంబై అట్టిపెట్టుకొనే చాన్సుంది. ఐపీఎల్‌లో తాను ముంబైకి తప్ప మరో జట్టుకు ఆడే ప్రసక్తేలేదని గతంలో రోహిత్‌ స్పష్టంజేశాడు. అయితే ఉత్తర భారతానికి చెందిన ఓ ఫ్రాంచైజీ రోహిత్‌కు మెంటార్‌ కమ్‌ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ముంబైకి తప్ప మరో టీమ్‌కు ఆడకూడదన్న తన నిర్ణయాన్ని హిట్‌మ్యాన్‌ మార్చుకుంటాడేమో చూడాలి.

Updated Date - Dec 16 , 2023 | 04:01 AM