Sarfaraz Khan: అయ్యో.. సర్ఫరాజ్ ఖాన్.. టీమిండియాకు ఎంపిక చేయలేదని బెంగ పెట్టుకున్నావా?
ABN , First Publish Date - 2023-07-13T18:07:20+05:30 IST
గత రంజీ సీజన్ వరకు అదరగొట్టే ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం మాత్రం దులీప్ ట్రోఫీలో ఘోరంగా విఫలమవుతున్నాడు. దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్, ఫైనల్‌లో కలిపి ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ కనీసం 10 పరుగులు కూడా చేయలేకపోయాడు.
గత రంజీ సీజన్ వరకు అదరగొట్టే ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం మాత్రం దులీప్ ట్రోఫీలో ఘోరంగా విఫలమవుతున్నాడు. దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్, ఫైనల్‌లో కలిపి ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ కనీసం 10 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఇందులో ఏకంగా 2 సార్లు డకౌట్ కూడా అయ్యాడు. సెమీ ఫైనల్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 12 బంతులాడిన సర్ఫరాజ్ ఖాన్ ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరిచినప్పటికీ 30 బంతులు ఆడి 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తాజాగా ఫైనల్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో కూడా సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ అయ్యాడు. 4 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండానే విధ్వత్ కావేరప్ప బౌలింగ్‌లో లెగ్ బైస్ రూపంలో ఔటయ్యాడు. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 3 ఇన్నింగ్స్‌లో కలిపి సర్ఫరాజ్ ఖాన్ 6 పరుగులే చేశాడు.
కాగా రంజీల్లో వరుసగా 3 సీజన్లపాటు దుమ్ములేపిన సర్ఫరాజ్ ఖాన్ ఒక్కసారిగా దారుణంగా విఫలమవుతుండడం గమనార్హం. గత రంజీ సీజన్‌లో సైతం 25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ 92 సగటుతో చెలరేగాడు. ఈ క్రమంలోనే భారత జట్టులో అతనికి చోటు ఖాయమనుకున్నారంతా.. కానీ అనూహ్యంగా వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కలేదు. దీంతో సెలెక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ గత ఐపీఎల్ నుంచి సర్ఫరాజ్ ఖాన్ రాణించలేకపోతున్నాడు. గత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 4 మ్యాచ్‌ల్లో 53 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా దులీప్ ట్రోఫీలోనూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్‌ను వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేయకపోవడమే మంచిదైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం టీమిండియాకు ఎంపిక చేయలేదని సర్పరాజ్ ఖాన్ బెంగ పెట్టుకున్నాడని, అందుకే ఇలా దారుణంగా విఫలమవుతున్నాడని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు.