Rahul Gandhi: నఫ్రత్‌కి బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోలెంగే..
ABN , First Publish Date - 2023-11-25T15:22:07+05:30 IST
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై దుమ్మెత్తిపోశారు. బీజేపీ -బీఆర్ఎస్ - ఎంఐఎం ఒక్కటే అని.. ఆ మూడు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇది దొరలకు... ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు.

ఆదిలాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై దుమ్మెత్తిపోశారు. బీజేపీ - బీఆర్ఎస్ - ఎంఐఎం ఒక్కటే అని.. ఆ మూడు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇది దొరలకు... ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందన్నారు. తెలంగాణా ఉద్యమ ఆకాంక్షలకు విరుధ్ధంగా కేసీఆర్పా (CM KCR) లన ఉందని విమర్శించారు. ప్రజలు కన్న కలలు నెరవేరటంలేదని.. అమరుల ఆశయాలు నెరవేరట్లేదన్నారు. వందలాదిమంది ఆత్మ బలిదానాలతో తెలంగాణా ఏర్పడిందని.. ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రాన్నిచ్చిందని చెప్పుకొచ్చారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణా 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు.
కేసీఆర్ దోచుకున్న ధనాన్ని ప్రజలకు చేరుస్తా..
కాంగ్రెస్ 6 గ్యారంటీలు కేవలం హామీలు కావని.. ప్రభత్వం ఏర్పడ్డాక మొదటి మంత్రిమండలి సమావేశంలోనే వీటిని చట్టాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు, రైతులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. మహిళల్లేకుండా సమాజాన్ని ఊహించలేమన్నారు. నేడు రూ.1200/- గా ఉన్న గ్యాస్ సిలెండర్ కాంగ్రేస్ సర్కార్ ఏర్పడగానే రూ.500/- కే సిలెండర్ ఇస్తామన్నారు. మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అని అన్నారు. వివాహితలకు రూ.2500/-, వృధ్ధులకు రూ.4000/- ప్రతినెల పించను అందజేస్తామన్నారు. తెలంగాణాలో రైతు ఆత్మహత్యలను చూడటానికి తాము సిధ్ధంగా లేమని అన్నారు. రైతులు భయంగా జీవించటం తాము ఇష్టపడట్లేదని తెలిపారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ.15000/-, రైతు కూలీలకు సంవత్సరానిక రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలే, కాలానుగుణంగా కొంత మొత్తం పెంచామని తెలిపారు. తెలంగాణా కోసం అమరులైన ప్రతి ఒక్కరి కుటుంబాలకు 250 గజాల ఇంటిస్థలాలు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. యువ వికాసం కింద, విద్యా భరోసా కింద రూ.5 లక్షల సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. చేయూత కింద వృధ్ధులందరికి, వితంతువు, వికలాంగులకు నెలకు 4వేలు అందజేస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు చికిత్స ఖర్చులు చేస్తామన్నారు. ఇవి కేవలం పథకాలు కావని.. మొదటి మంత్రిమండలి లోనే చట్టాలుగా మారుస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ నాటి నుంచి దొరల తెలంగాణా పోయి ప్రజల తెలంగాణాగా మారనుందని వెల్లడించారు. ప్రజల దగ్గర నుంచి కేసీఆర్ దోచుకున్న ధనాన్ని ప్రజలకు చేరుస్తామని తెలిపారు.
నేనే మోదీతో పోరాడుతా...
‘‘మోదీ మిత్రులు కేసీఆర్, ఓవైసీ అని.. మోదీ హయాంలోని ప్రతీ బిల్లుకు కేసీఆర్ మద్దతు తెలిపారు. నేనే నరేంద్ర మోదీతో పోరాడుతా.. నేను నా పోరాటాన్ని ఆపను, మోదీ ఆలోచనా విధానం మారనంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నాపై అక్రమంగా 24 కేసులు నమోదు చేయించారు. నా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసి, నా అధికారిక నివాసగృహాన్ని వెనక్కు తీసుకున్నారు. కేసీఆర్‌పై కేసులేమైనా పెట్టారా, ఆయన అధికారగృహం తీస్కున్నారా.. నాకు దేశ ప్రజలందరూ కుటుంబీకులే.. దేశంలోని ప్రతీ ఇల్లూ నాదే. కేసీఆర్‌కు సీఎం పదవి అవసరం. కేసీఆర్ కుర్చీ రిమోట్ మోదీ చేతిలో ఉంటుంది. కొన్ని నెలల క్రితం కింద బీజేపీ వారు గాల్లో ఎగిరేవారు. కాంగ్రెస్ 4 నెలల్లోనే బీజేపీ గాలి తీసేసింది. మోదీ మరో మిత్రుడు ఓవైసీ. అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర ఇలా ఎక్కడైనా బీజేపీతో కాంగ్రెస్ కలబడితే అక్కడ ఎంఐఎం అడ్డొస్తుంది. ఇక్కడ పోటీ కేవలం కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మధ్యనే, బీఆర్‌ఎస్‌కు వారి మిత్రులు బీజేపీ, ఎంఐఎంలు తెరవెనుక సహకరిస్తారు. తెలంగాణాలో ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడనుంది. నఫ్రత్‌కి బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోలెంగే’’ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి