Bhadrachalam: నా అడ్డాలో మీ పెత్తనం ఏంటి? నాకు తెలియకుండా లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు..
ABN , First Publish Date - 2023-08-25T12:33:09+05:30 IST
‘చేతివృత్తుల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయం ఏంటని, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా అధికారపక్షం మాటే చెల్లుబాటు కావాలా?
- ప్రభుత్వ విప్ రేగాపై పొదెం వీరయ్య ఆగ్రహం
- కాంతారావు చేతిలో మైకు లాక్కున్న ఎమ్మెల్యే
- భద్రాచలంలో రసాభాసగా ‘బీసీ’ సాయం చెక్కుల పంపిణీ
భద్రాచలం: ‘చేతివృత్తుల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయం ఏంటని, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా అధికారపక్షం మాటే చెల్లుబాటు కావాలా?’ అని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య(MLA Podem Veeraiah).. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు(Rega Kantha Rao)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గురువారం వెనుకబడిన తరగతులలోని చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాగ్వాదంతో ఈ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి విచ్చేసిన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తన ప్రమేయం లేకుండానే తన నియోజకవర్గంలోని లబ్ధిదారుల ఎంపిక చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్థి పథకాల గురించి వివరిస్తుండగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆగ్రహించి రేగా చేతిలోని మైకును లాక్కున్నారు. తన నియోజకవర్గ కార్యక్రమంలో రేగా మాట్లాడటమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దాంతో రేగా కాంతారావు మాట్లాడుతూ తాను రాష్ట్ర ప్రభుత్వ విప్‌నని, రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనైనా పాల్గొనే అధికారం తనకు చట్టబద్దంగా సంక్రమించిందని గుర్తు చేశారు. తాను ఎంతసేపైనా మాట్లాడతానన్నారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగింది.
ఈ సమయంలో వేదికపైన ఉన్న ఎమ్మెల్సీ తాతా మధు(MLC Tatha Madhu), అధికారులు రేగా, పొదెంలకు సర్దిచెప్పారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య(Bhadrachalam MLA Podem Veeraiah) మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతిపాదనలతోనే బీసీ లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని, కానీ భద్రాచలం నియోజకవర్గంలో మాత్రం తనకు గురువారం ఉదయం వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది ప్రభుత్వ వేదిక అని, అధికార పార్టీ చేపట్టే కార్యక్రమాల గురించి తనకు చెప్పుకునే అర్హత ఉందని విప్ రేగా కాంతారావు మళ్లీ మైకు తన చేతుల్లోకి తీసుకొని మాట్లాడారు. దాంతో మళ్లీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో ఎవరు గొడవ చేస్తే వారిని స్టేషన్‌కు తరలించాలని విప్ రేగాకాంతారావు పోలీసు అధికారులను ఆదేశించారు. దాంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను ఆ ప్రాంగణం నుంచి బయటకు తరలించడంతో సభ సజావుగా సాగింది. ఇదిలా ఉండగా మొత్తం 900మంది చేతివృత్తుల వారు అర్హులు కాగా గురువారం 170 మందికి రూ.లక్ష చొప్పున సహాయం అందించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీవో మంగీలాల్, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఇతర అధికారులు పాల్గొన్నారు.