HYD: అంబర్‌పేట బీజేపీలో అయోమయం.. అభ్యర్థి ఎంపికలో తీవ్ర జాప్యం.. అంతుచిక్కని కిషన్‌రెడ్డి ఆంతర్యం
ABN , First Publish Date - 2023-10-31T08:57:07+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి(BJP state president G Kishan Reddy) సొంత నియోజకవర్గం అంబర్‌పేట
- టికెట్ కోసం విక్రమ్‌గౌడ్, ఆలె భాస్కర్ ప్రయత్నాలు
రాంనగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి(BJP state president G Kishan Reddy) సొంత నియోజకవర్గం అంబర్‌పేట అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో బీజేపీ నేతల్లో అయోమయం నెలకొంది. అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతుండటం పట్ల ఆశావహులు, నాయకులు అయోమయంలో ఉన్నారు. జి.కిషన్‌రెడ్డి మనుసులో ఏముందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ లు అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచారంతో దూసుకుపోతున్నారు. కానీ బీజేపీ అభ్యర్థి ఎంపికలో ఆలస్యం చేస్తుండడంతో టికెట్ ఆశిస్తున్న వారిలో టెన్షన్ మొదలయింది. అంబర్‌పేట నుంచి తాను పోటీచేయడం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేయడంతో టికెట్ రేసులో మాజీమంత్రి సి కృష్ణయాదవ్, బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు, ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ వనం రమేష్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కె.గీతామూర్తి ఉన్నారు. వీరితో పాటు నల్లకుంట కార్పొరేటర్ వై అమృత, కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమాదేవి భర్త కన్నె రమేష్ యాదవ్ సైతం టికెట్లు ఆశిస్తున్నారు. మరికొందరు కార్పొరేటర్లు సైతం టికెట్లు ఆశిస్తున్నారు. ఈనెల 3వ తేదీ నుంచి నా మినేషన్ల ప్రక్రియ ప్రారం భమవుతున్న నేపధ్యంలో అభ్యర్థి ఎంపికలో జాప్యం చేయడం సరికాదని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ప్రచారాలు, సమావేశాలు బూత్ కమిటీలు, ఇతరత్రా కార్యక్రమాలకు సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థిని వెంటనే ప్రకటించాలని పలువురు పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే అభ్యర్థి ఎంపికపై సర్వే చేయించి ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయా అనే అంశంపై కిషన్‌రెడ్డి దృష్టి పెట్టారని, అందుకే అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం జరుగుతుందని ఆయన అనుచరులు చెప్పు కుంటున్నారు. అయితే ఈ సీటు ఓసీ సామాజికి వర్గానికి చెందిన డాక్టర్ గౌతమ్‌రావుకు అవకాశం కల్పిస్తారా లేక బీసీ సామాజికవర్గాలకు చెందిన మాజీ మంత్రి కృష్ణయాదవ్, మాజీ కార్పొరేటర్ వనం రమేష్‌లకు టికెట్ కేటాయిస్తారా అనే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- పరిశీలనలో విక్రమ్‌గౌడ్, ఆలె భాస్కర్
కిషన్‌రెడ్డి అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీ చేయననడంతో ఈసీటు కోసం మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్, దివంగత నేత ఆలె నరేంద్ర తనయుడు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్(Ale Bhaskar) పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గోషామహల్ నుంచి విక్రమ్‌గౌడ్ టికెట్ ఆశించారు. చివరి క్షణంలో రాజాసింగ్‌కు టికెట్ కేటాయించడంతో విక్రమ్‌గౌడ్‌కు అశకాశం లేకుండా పోయింది. దీంతో అంబర్‌పేటలో గౌడ కులస్థులు ఓట్లు ఎక్కువగా ఉన్నందున టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. గతంలో తన తండ్రి ఆలె నరేంద్ర పాత హిమాయత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచినందున ఇక్కడ తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలిసింది. టికెట్ విషయంలో తనకు సీటు కేటాయించాలనే అంశంపై ఆలె భాస్కర్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.