Banjara Hills: రూ.కోటి స్థలంపై కన్ను

ABN , First Publish Date - 2023-03-05T01:36:02+05:30 IST

నగరం నడిబొడ్డున ఫిలింనగర్‌కాలనీకి ఆనుకొని ఉన్న బస్తీల్లో ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కొందరు ఆ భూమిని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు.

Banjara Hills: రూ.కోటి స్థలంపై కన్ను
గాజులరామారంలోని ప్రభుత్వ భూమికి రక్షణగా నిర్మిస్తున్న ప్రహరీ

ప్రభుత్వ స్థలం కబ్జా యత్నం

ప్లాట్‌ పట్టా.. దీనిదిగా ప్రచారం

ఫిలింనగర్‌లో నాయకుల పథకం

రెవెన్యూ అధికారులకు బస్తీవాసుల ఫిర్యాదు

బంజారాహిల్స్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నగరం నడిబొడ్డున ఫిలింనగర్‌కాలనీకి ఆనుకొని ఉన్న బస్తీల్లో ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కొందరు ఆ భూమిని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. పార్కులు, శ్మశానాలు ఇలా.. ఏ చిన్న జాగా కనిపించినా గద్దల్లా వాలిపోతున్నారు. ఫిలింనగర్‌ వినాయకనగర్‌ బస్తీలో ఇళ్ల సమూహాల మధ్య రూ.కోటి విలువైన సుమారు 100గజాల స్థలం మిగిలింది. గతంలో రెవెన్యూ అధికారులు ఈ స్థలం ప్రభుత్వానిదిగా గుర్తించి, ప్రజోపయోగ పనుల కోసం కేటాయించారు. బస్తీలో ఓ పార్టీకి చెందిన నాయకుల కన్ను ఈ స్థలంపై పడింది. ఎలాగైనా స్థలాన్ని కబ్జా చేయాలని పథకం వేశారు. ఇదే బస్తీలో ఓ ప్లాట్‌కు సంబంధించిన పట్టాను సంపాదించారు. ఆ పట్టా సదరు ఖాళీ స్థలానికి సంబంధించినదే అని ప్రచారం చేశారు. సదరు నాయకులు అందులో నిర్మాణాలు చేపట్టి అమ్మేయాలని నిర్ణయించారు. శనివారం ఓ కూలీని పురమాయించి స్థలాన్ని చదును చేయిస్తుండగా బస్తీవాసులు అడ్డుకున్నారు. షేక్‌పేట రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని బస్తీవాసులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-05T11:04:29+05:30 IST