MLC Kavitha: ఏ క్షణంలోనైనా కవిత అరెస్టు!
ABN, First Publish Date - 2023-09-25T02:59:25+05:30
ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అరెస్టు కానున్నారా? ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) రంగం సిద్ధం చేస్తోందా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.
ఆమెతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కూ ఉచ్చు బిగిస్తున్న ఈడీ
45 కోట్లు తరలించినట్లు దర్యాప్తు సంస్థల ముందు
అంగీకరించిన కవిత పీఏ అశోక్, ముత్తా గౌతమ్
అప్రూవర్లుగా మారి కీలక సమాచారం ఇచ్చిన
శరత్ చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట, దినేశ్ అరోరా
అరుణ్ రామచంద్ర పిళ్లై చుట్టూ కవిత వ్యవహారాలు
కవితను అరెస్టు చేస్తారని శనివారమే చెప్పిన రేవంత్
‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను ఈడీ విచారణకు పిలిచి..
అరెస్టు చేసి రెండు నెలలు జైలులో పెట్టి.. ఎన్నికల్లో గెలవాలన్న కొత్త డ్రామాకు కేసీఆర్, ప్రధాని మోదీ కలిసి తెరలేపారు.
ఎన్నికల్లో గెలవడానికి కన్నకూతురిని కూడా జైలుకు పంపించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. కవితను అరెస్టు చేస్తే వచ్చే సానుభూతితో ఎన్నికల్లో గెలుస్తామని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ, ఏ తప్పూ చేయకుండా శిక్ష పడితేనే సానుభూతి వస్తుంది. కవితను అరెస్టు చేసినా అదొక పెద్ద డ్రామాగానే తెలంగాణ ప్రజలు భావించాలి’’
- టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam)లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అరెస్టు కానున్నారా? ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) రంగం సిద్ధం చేస్తోందా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. మద్యం కుంభకోణంలో కవితతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) పాత్రపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కీలక సమాచార ం, ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం ఆధారంగా కవిత, కేజ్రీవాల్‌లకు ఈడీ ఉచ్చు బిగిస్తోందని, ఏ క్షణంలోనైనా వారిని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) శనివారం ఢిల్లీలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమెను రెండు నెలలు జైలులో పెట్టి.. ఆ సానుభూతితో ఎన్నికల్లో గెలవాలని సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ(PM Modi) కలిసి కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు.
అయితే రేవంత్ ఆరోపణల మాటెలా ఉన్నా.. కవిత అరెస్టు మాత్రం ఖాయమన్న సంకేతాలైతే వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సౌత్ గ్రూప్ తరఫున అభిషేక్ బోయినపల్లి, కవిత ఢిల్లీ పీఏ అశోక్ కౌశిక్, ముత్తా గౌతమ్ రూ.100 కోట్లు తరలించారని ఈడీకి పక్కా ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సీబీఐ నమోదు చేసిన కేసులో సెక్షన్ 164 కింద అప్రూవర్‌గా వాంగ్మూలం ఇచ్చిన అశోక్ కౌశిక్‌తోపాటు నిందితుడు ముత్తా గౌతమ్.. తామే సుమారు రూ.45 కోట్లు తరలించామని దర్యాప్తు సంస్థల ముందు అంగీకరించినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. నగదు లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని అందించిన కవిత పీఏ అశోక్ కౌశిక్.. తాను అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు డబ్బు మూటలను మోశానని, ఒకచోట నుంచి మరో చోటికి చేరవేశానని ఒప్పుకొన్నారు. కాగా, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద వాంగ్మూలం ఇచ్చిన ముత్తా గౌతమ్.. తాను స్వయంగా రూ.7.1 కోట్లు తరలించానని అంగీకరించారు. తనఇండియా ఎహెడ్ సంస్థను అభిషేక్ బోయినపల్లి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని, ఈ సంస్థలో కవిత తరఫున అభిషేక్ బోయినపల్లి బినామీగా వ్యపవహరించారని ముత్తా గౌతమ్ వెల్లడించారు. తాను కూడా రూ.17 కోట్లు తరలించానని మరో నిందితుడు దినేశ్ అరోరా 164, 50 సెక్షన్ కింద వాంగ్మూలం ఇచ్చారు.
అప్రూవర్‌లుగా మారినవారి వాంగ్మూలంతోనే..
ఈ కేసులో అప్రూవర్‌లుగా మారిన శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట రాఘవ, దినేశ్ అరోరా అనేక కీలక అంశాలను దర్యాప్తు సంస్థలకు వెల్లడించారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి నగదు తరలింపుపై శరత్, మాగుంట శ్రీనివాసులురెడ్డ్డి, రాఘవ దర్యాప్తు సంస్థలకు వివరాలు సమర్పించారు. లిక్కర్ వ్యాపారం గురించి కవితతో మాట్లాడాలని, కలిసి పనిచేయాలని కేజ్రీవాలే తమకు సూచించారని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. మరోవైపు మద్యం కుంభకోణంలో కవితతో సన్నిహిత సంబంఽధాలున్న అరుణ్ రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీనని కనీసం మూడుసార్లు దర్యాప్తు సంస్థల వద్ద చెప్పారు. మద్యం వ్యాపారం గురించి కవితతో కలిసి, ఆమె తరఫున పలు సమావేశాల్లో పాల్గొన్నానని వెల్లడించారు. అరుణ్ రామచంద్ర పిళ్లై జరిపిన నగదు లావాదేవీలు, భూముల కొనుగోళ్లలో కవిత పాత్రపై నిఘా సంస్థలు లోతుగా దర్యాప్తు జరిపాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీల సమాచారం రాబట్టేందుకు కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించింది. కవితకు, శ్రీనివాసులురెడ్డ్డికి తాము బినామీలుగా వ్యవహరించామని అరుణ్ రామచంద్ర పిళ్లై, ప్రేమ్ రాహుల్ ఈడీ ముందు అంగీకరించారు. వీరే కాకుండా.. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద దాదాపు 16 మంది నిందితులు వాంగ్మూలాలు ఇచ్చినట్లు సమాచారం.
వంద కోట్లు చెల్లించి లాభాల్లో వాటా..
ఢిల్లీ మద్యం హోల్‌సేల్ వ్యాపారంలో కమీషన్‌ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడంతోపాటు ఇండో స్పిరిట్‌లో కవిత భాగస్వామిగా ఉన్న సౌత్ గ్రూప్ 65 శాతం వాటా పొందినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారంలో లబ్ధి కోసం రూ.100 కోట్లు చెల్లించి, తిరిగి ఆ వంద కోట్లను రాబట్టుకోవడంతోపాటు లాభాలు పొందేలా కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, శరత్ చంద్రారెడ్డి కుట్రకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. రిటైల్ వ్యాపారంలో నష్టపోయినప్పటికీ హోల్‌సేల్ వ్యాపారంలో శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ.192 కోట్ల మేరకు లాభాలు ఆర్జించారు. ఇందులో అరుణ్ రామచంద్ర పిళ్లైకి రూ.33 కోట్లు, శరత్ చంద్రారెడ్డికి రూ.64.5 కోట్లు లభించాయి. తనకు లభించిన మొత్తంలో శరత్ చంద్రారెడ్డి డమ్మీ సేల్స్ చూపించి రూ.41 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారు. కాగా, కవితకు ఆడిటర్‌గా వ్యవహరించిన బుచ్చిబాబును మాజీ ఆడిటర్‌గా ప్రచారం చేశారని,ఈ విషయంలో కవిత తమను తప్పుదోవ పట్టించినప్పటికీ ఆమె ఆడిటర్‌గానే అతడిని కనీసం 50 సార్లు పిలిచి ప్రశ్నించి సమాచారం రాబట్టామని ఈడీ వర్గాలు తెలిపాయి. సౌత్ గ్రూప్‌లో మెజారిటీ సభ్యులు అప్రూవర్లుగా మారినా.. బుచ్చిబాబు అప్రూవర్‌గా మారలేదని ఈ వర్గాలు తెలిపాయి. ఆయన సీబీఐ కేసులో నిందితుడిగా, ఈడీ కేసులో సాక్షిగా ఉన్నారు.
పెట్టుబడులు పెట్టకుండానే వాటా..!
అరుణ్ రామచంద్ర పిళ్లైకి అందిన రూ.33 కోట్లలో అభిషేక్ బోయినపల్లికి రూ.3.85 కోట్లు, ముత్తాగౌతమ్‌కు రూ.2.60 కోట్లు చెల్లించారు. సౌత్ గ్రూప్‌లో ఉన్న కవిత, శరత్ చంద్రారెడ్డి, సృజన్‌రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్‌లకు పిళ్లై ద్వారా లాభాల వాటాలు అందాయి. లాభాల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డిలకు వాటా అందలేదని, ఇది భాగస్వాముల మధ్య వైరానికి కారణమైందని సమాచారం. అంతేకాకుండా ఇండో స్పిరిట్ కంపెనీలో మాగుంట శ్రీనివాసులురెడ్డి తరఫున బినామీగా ఉన్న ప్రేమ్ రాహుల్‌ను తప్పించేందుకు పిళ్లై ప్రయత్నించినట్లు తెలిసింది. కానీ, దినేశ్ అరోరాకు పార్టనర్‌గా ఉన్న సృజన్‌రెడ్డికి మాత్రం ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే ఆయన సంస్థలకు రూ.10 కోట్ల మేరకు లాభాలను చెల్లించారు. సృజన్ రెడ్డికి లైసెన్స్ దక్కనందుకు బెదిరింపులకు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తులో తేలింది. కాగా, మాగుంట శ్రీనివాసులురెడ్డి జూలై 17న అప్రూవర్‌గా మారగా, ఆ మరునాడే (జూలై 18న) ఆయన కుమారుడు రాఘవకు బెయిల్ లభించడం గమనార్హం. కవిత టీమ్ ద్వారానే తన కుమారుడు రాఘవ ఆప్ నేతలకు రూ.25 కోట్లు సమకూర్చారని మాగుంట తన వాంగ్మూలంలో చెప్పారు. శ్రీనివాసులురెడ్డి, రాఘవలు అప్రూవర్‌గా మారిన తర్వాత ఈడీ కేసులో దినేశ్ అరోరా అప్రూవర్‌గా మారారు. అంతకుముందే ఆయన సీబీఐ కేసులో అప్రూవర్‌గా మారారు. కవిత బంధువైన వి.శీనివాసరావు, ఆమె భర్త అనిల్, స్నేహితులు కిరణ్ లోనావత్, పి.పవన్, బల్మూరి ప్రసాద్ ఇతరులు సమకూర్చిన డబ్బుతోనే కవిత తరఫున ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ రామచంద్ర పిళ్లై పెట్టుబడులు పెట్టారని సమాచారం. కవిత ఆదేశాల మేరకే మద్యం వ్యాపారంలో లాభాల్లో వాటాగా వచ్చిన రూ.33 కోట్లతో వట్టినాగులపల్లి వద్ద పిళ్లై ఆస్తులు కొనుగోలు చేశారు. భూముల కొనుగోలు విషయంలో పిళ్లైకి ఫీనిక్స్ శ్రీహరి సహాయపడ్డారు. ఈ లావాదేవీలపై కూపీ లాగిన ఈడీ అధికారులు.. భూములు అమ్మినవారి నుంచి కూడా పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద వాంగ్మూలాలు తీసుకున్నారు.
కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ఇదీ..
2021 జూన్, ఆగ స్టు మధ్య అభిషేక్ బోయినపల్లి.. అశోక్ కౌశిక్ నంబర్ (9811878055)కు ఫోన్ చేశారు. గ్రీన్ పార్క్‌కు వెళ్లి దినేశ్ అరోరాను కలుసుకోమన్నారు. దినేశ్ అరోరా రెండు బ్యాగుల్లో ఇచ్చిన నోట్ల కట్టలను లోధీ రోడ్‌లోని మౌసమ్ భవన్ గేటు వద్ద తెల్ల పోర్‌ష్చే కారులో ఉన్న వినోద్ చౌహాన్‌కు ఇవ్వమన్నారు. అశోక్ కౌశిక్ అదేవిధంగా చేశారు. గ్రీన్ పార్క్‌లో ఉన్న దినేశ్ అరోరా చిరునామాలను గుర్తించగలనని అశోక్ కౌశిక్ చెప్పారు.
శరత్ చంద్రారెడ్డి స్టేట్ మెంట్
మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నేతలకు ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపుల్లో తన పాత్ర కూడా ఉందని 2023 ఏప్రిల్ 25న శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ‘‘2021 మార్చిలో అరుణ్ పిళ్లై నాతో మాట్లాడారు. విజయ్ నాయర్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా.. కవిత ను సంప్రదించారని తెలిపారు. కవిత ఆప్‌కు కొంత డబ్బు ఇస్తే రానున్న కొత్త ఎక్సైజ్ విధానంలో ఆమెకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోగలమని చెప్పారు. ఈ చర్చల గురించి అరుణ్ చెప్పిన తర్వాత నేను కవితను కలిశాను. తన టీమ్ ఇప్పటికే ఢిల్లీలో విజయ్ నాయర్‌ను సంప్రదిస్తోందని, ఈ వ్యాపారం లాభసాటి అవునో, కాదో నిర్ణయిస్తోందని ఆమె చెప్పారు. ఆమె టీమ్‌లో అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు ఉన్నారు. కేజ్రీవాల్, సిసోడియా తరఫున అన్ని విషయాలు విజయ్ నాయర్ చూస్తున్నారని చెప్పారు. దీంతో నా వ్యాపారాన్ని విస్తరించి కవితతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం మాగుంట శ్రీనివాసులురెడ్డ్డితో కూడా మాట్లాడానని, ఆయన కూడా తమతో కలిసి పనిచేస్తారని కవిత చెప్పారు. కేజ్రీవాల్ టీమ్‌తో మాట్లాడిన తర్వాత రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అందులో నా భాగం కూడా ఇస్తానని, అయితే ప్రస్తుతం డ బ్బులు లేనందువల్ల మద్యం వ్యాపారం ప్రారంభం కాగానే ఇస్తానని చెప్పాను’’ అని శరత్ చంద్రారెడ్డి తన వాంగ్మూలంలో వెల్లడించారు.
శ్రీనివాసులురెడ్డి స్టేట్ మెంట్
2023 జూలై 17న మాగుంట శ్రీనివాసులురెడ్డి సీఆర్‌పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. రూ.100 కోట్ల ముడుపుల్లో తమ వాటా కింద రూ.25 కోట్లను తన కుమారుడు రాఘవ.. బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లికి చెల్లించారు. ఈ విషయం రాఘవ కూడా తన వాంగ్మూలంలో అంగీకరించారు. ‘‘కల్వకుంట్ల కవితతో నన్ను మాట్లాడమని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. లేదా ఆమే నాతో మాట్లాడతారని చెప్పారు. మీరిద్దరూ కలిసి పనిచేయవచ్చన్నారు. అన్ని వివరాలూ కవిత చూసుకుంటారు. ఆమె తన టీమ్‌తో కలిసి మద్యం విధానం గురించి పనిచేస్తున్నారు. కవిత టీమ్‌తో విజయ్ నాయర్ కలిసి పనిచేస్తున్నారు’’ అని మాగుంట ఇదే వాంగ్మూలంలో చెప్పారు.
Updated Date - 2023-09-25T04:04:02+05:30 IST