Kishan Reddy: కేంద్రమంత్రి పదవికి నేను రాజీనామా చేయలేదు..

ABN , First Publish Date - 2023-07-05T16:19:57+05:30 IST

అనారోగ్యం వల్లే కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నానని, కేంద్రమంత్రి పదవికి తాను రాజీనామా చేయలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. అధిష్టానం ఏ ఆదేశాలిచ్చినా పాటిస్తానని, తనకు అధ్యక్ష పదవి ఇస్తారని అనుకోలేదని అన్నారు.

 Kishan Reddy: కేంద్రమంత్రి పదవికి నేను రాజీనామా చేయలేదు..

న్యూఢిల్లీ: అనారోగ్యం వల్లే కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నానని, కేంద్రమంత్రి పదవికి తాను రాజీనామా చేయలేదని కిషన్‌రెడ్డి (Kishan Reddy) క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం ఏ ఆదేశాలిచ్చినా పాటిస్తానని, తనకు అధ్యక్ష పదవి ఇస్తారని అనుకోలేదని అన్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ (Delhi)లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న (మంగళవారం) తాను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు జేపీ నడ్డా (JP Nadda) ఫోన్ చేసి విషయం చెప్పారన్నారు. గతంలో ఉమ్మడి ఏపీకి 2 సార్లు, తొలి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఒకసారి.. పనిచేశానన్నారు. నాల్గవసారి పార్టీ అధ్యక్షుడిగా తనపై అధిష్టానం బాధ్యతలు అప్పగించిందని చెప్పారు.

ఎంపీగా గెలిచాక హోం శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత రెండేళ్లు కేబినెట్ మంత్రిగా పని చేశానని కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. తాను ఏనాడూ పార్టీని ఏదీ అడగలేదని, కోరలేదని, పార్టీ ఆదేశాలను పాటిస్తూ వస్తున్నానన్నారు. 1980 నుంచి ఒక సైనికుడిలా పనిచేస్తూ వస్తున్నానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) అధికారంలోకి రావాలి అనే లక్ష్యంతో కృషి చేస్తానని, సమిష్టి ప్రణాళిక తయారుచేసుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. మరికాసేపట్లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తున్నానని, ఈరోజు రాత్రి పార్టీ ముఖ్య నేతలను కలిసి మాట్లాడతానని చెప్పారు.

ప్రధాని మోదీ (PM Modi) వరంగల్ (Warangal) పర్యటనకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి ఏర్పాట్లపై పనిచేయాలని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ నాయకత్వం మొత్తాన్ని ఈ ఏర్పాట్లలో సహకరించాలని కోరుతున్నానన్నారు. రైల్ వ్యాగన్ తయారీ కేంద్రంకు ప్రధాని భూమిపూజ చేస్తారని, 150 ఎకరాల స్థలంలో ఈ పరిశ్రమ రానుందన్నారు. రైల్వే ఓవర్ హాలింగ్ యూనిట్ అని తొలుత అనుకున్నామని, కానీ ప్రధాని వ్యాగన్ యూనిట్ పెట్టడానికి ఓకే చెప్పారన్నారు. వరంగల్‌ను రైల్వే తయారీ హబ్‌గా తయారు చేయబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద వర్క్ షాప్, తయారీ యూనిట్ రావడం ఇదే మొదటిసారని అన్నారు. అలాగే మోదీ నూతన జాతీయ రహదారులకు భూమిపూజ చేస్తారని, వరంగల్ ఎయిర్ స్ట్రిప్ ద్వారా నేరుగా హెలికాప్టర్‌లో అక్కడికి వచ్చి, భద్రకాళి దర్శనం చేసుకుంటారన్నారు. రైల్వే యూనిట్‌ను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తారన్నారు. ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే జూలై 9న దక్షిణ భారత రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతల సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-07-05T16:35:08+05:30 IST