MLC Kavita: కవిత బినామీలమే
ABN , First Publish Date - 2023-03-08T01:50:56+05:30 IST
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా పేర్కొంటున్న హైదరాబాద్ మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది.
ఆమె ప్రయోజనాల కోసమే మద్యం వ్యాపారంలోకి..
విచారణలో అరుణ్ పిళ్లై, ప్రేమ్‌రాహుల్ వెల్లడి: ఈడీ
ఇండోస్పిరిట్స్‌లో పిళ్లై, ప్రేమ్‌కు 32.5% చొప్పున వాటా
ఢిల్లీ కోర్టుకు తెలిపిన ఈడీ.. కేసులో పిళ్లైది కీలకపాత్ర
కవిత, మాగుంటకు బినామీలుగా పిళ్లై, ప్రేమ్ పెట్టుబడులు
సౌత్‌గ్రూప్, ఆప్ అగ్రనేతల మధ్య స్పష్టమైన అవగాహన
17 పేజీల రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు
పిళ్లై అరెస్టు.. 7 రోజుల కస్టడీ.. బుచ్చిబాబుకు నోటీసులు
కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తున్న దర్యాప్తు సంస్థలు!
న్యూఢిల్లీ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా పేర్కొంటున్న హైదరాబాద్ మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఆయన రిమాండ్ రిపోర్టులో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించింది. పిళ్లై, ప్రేమ్‌రాహుల్‌లు కవితకు బినామీలని స్పష్టం చేసింది. పిళ్లైని రెండు రోజులపాటు విచారించిన తర్వాత సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. మంగళవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. తాము ఎమ్మెల్సీ కవిత ప్రయోజనాలను కాపాడేందుకే వ్యాపారంలో చేరామని అరుణ్ పిళ్లై, ప్రేమ్‌రాహుల్ తమ విచారణలో అంగీకరించారని తెలిపింది. కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం మేరకు భాగస్వామిగా ఉన్నారని వెల్లడించింది. కుంభకోణంలో పిళ్లైదే కీలకపాత్ర అని.. తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. స్పందించిన న్యాయస్థానం.. ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. మరోవైపు ఇదే కేసులో తిహాడ్ జైలులో ఉన్న మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు మంగళవారం విచారించగా.. కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును మరోసారి విచారణకు హాజరు కావల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ఏజెన్సీలను ప్రయోగిస్తున్నారంటూ కేసీఆర్ సహా విపక్ష నేతలు లేఖ రాసిన 24 గంటల్లోనే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకోవడం గమనార్హం.
కవిత కోసమే..
అరుణ్ రామచంద్ర పిళ్లైని మంగళవారం ప్రత్యేక కోర్టులో ప్రవేశపెడుతూ ఈడీ సమర్పించిన 17 పేజీల రిమాండ్ రిపోర్డులో అనేక కీలక అంశాలను వెల్లడించింది. పిళ్లై మద్యం ఉత్పత్తిదారులు, హోల్‌సేల్ వ్యాపారులు, పలు రిటైల్ జోన్ల మధ్య కార్టెల్ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారని తెలిపింది. అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్‌చంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితరులు సౌత్ గ్రూప్‌లో ఉన్నారని ఈడీ స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్‌కు అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. కవిత ప్రయోజనాల కోసమే పిళ్లై ఇండో స్పిరిట్స్‌లో 32.5% మేరకు భాగస్వామిగా ఉన్నారని వెల్లడించింది. ప్రేమ్‌రాహుల్‌కు కూడా 32.5% వాటా ఉందని తెలిపింది. ఇండోస్పిరిట్స్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్‌కు 35% వాటా ఉన్నట్లు వివరించింది. సౌత్ గ్రూప్‌కు ఆప్ అగ్ర నేతలకు మధ్య స్పష్టమైన రాజకీయ అవగాహన ఉందని ఈడీ తెలిపింది. అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్ ఇద్దరూ కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి తరఫున బినామీలుగా పెట్టుబడులు పెట్టారని వెల్లడించింది. అభిషేక్, బుచ్చిబాబుతో కలిసి పిళ్లై ఢిల్లీలో 30% మద్యం వ్యాపారాన్ని నియంత్రించారని పేర్కొంది. పిళ్లై ఇండో స్పిరిట్స్‌లో రూ.3.40 కోట్లు అధికారికంగా పెట్టుబడులు పెట్టగా.. కవిత ఆదేశాల మేరకు అందులో రూ.కోటి తిరిగి ఆయనకు చెల్లించారని తెలిపింది. సౌత్‌గ్రూ్‌ప, ఆప్, విజయ్ నాయర్లకు ముడుపులు ఇచ్చినందుకే ఇండో స్పిరిట్స్‌ను పెర్నాడ్ రికార్డ్‌లో హోల్‌సేలర్‌గా నియమించారని వివరించింది.
9 రిటైల్ జోన్లను నియంత్రించిన కార్టెల్ ఏర్పాటులో పిళ్లై కీలక పాత్ర పోషించారని, సౌత్ గ్రూప్ చెల్లించిన ముడుపులను వ్యాపార కార్యకలాపాల పేరుతో తిరిగి పొందేందుకే ఈ కార్టెల్ ఏర్పడిందని తెలిపింది. ఈ కార్టెల్ ఏర్పాటులో భాగంగా ఆయన పలు సమావేశాలు నిర్వహించారని కూడా వివరించింది. ఈ సమావేశాల్లో అభిషేక్, బుచ్చిబాబు, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, శరత్‌చంద్రారెడ్డి పాల్గొన్నారని తెలిపింది. 2021 జూన్‌లో సమీర్ మహేంద్రును కలుసుకునేందుకు శరత్‌రెడ్డికి చెందిన చార్టర్డ్ విమానంలో అభిషేక్, బుచ్చిబాబు తదితరులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చారని వెల్లడించింది. 2021 సెప్టెంబరులో పెర్నార్డ్ రికార్డ్ ఏర్పాటు చేసిన విందులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, పిళ్లై, బుచ్చిబాబు, శరత్‌రెడ్డి పాల్గొని ఇండో స్పిరిట్స్‌లో పెట్టుబడులు, రిటైల్ జోన్ల గురించి చర్చించారని తెలిపింది. హైదరబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో విజయ్ నాయర్, పిళ్లై, అభిషేక్, దినేష్ అరోరా తదితరులు కలుసుకున్నారని, ఆ తర్వాతే రూ.31 కోట్లు హైదారాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ అయ్యాయని పేర్కొంది. మొత్తం ఎక్సైజ్ విధానాన్ని ఎల్1 హోల్ సేలర్‌కు 12% లాభాలు సమకూర్చేందుకు, అందులో 6% ఆప్‌కు ముడుపులుగా మళ్లించేదుకు రూపొందించారని ఈడీ నిర్ధారించింది. కాగా, తనను మనీలాండరింగ్ చట్టం కింద అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ శరత్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.
420 కోట్లలో సగం ఆప్‌కు..
ఢిల్లీలో ఏటా మద్యం వ్యాపారం రూ.4-5 వేల కోట్ల మధ్య జరిగితే అందులో రూ.3500 కోట్లు ఎల్1 హోల్‌సేలర్లకే లభిస్తుందని ఈడీ తెలిపింది. ఇందులో 12 శాతం అంటే రూ.420 కోట్లు లాభాలు కాగా.. అందులో సగం రూ.210 కోట్లు ఆప్‌కు ముడుపులుగా చెల్లించాలని నిర్ణయించినట్లు వివరించింది. ఆప్ తరఫున రంగంలోకి దిగిన విజయ్ నాయర్‌కు సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చిందని వెల్లడించింది. ఆ సొమ్మును ఎలా తిరిగి పొందాలనే విషయంపై 2022 ఏప్రిల్‌లో పిళ్లై తదితరులు ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో విజయ్ నాయర్‌తో సమావేశం అయ్యారని పేర్కొంది. పిళ్లై ఆదేశాల మేరకే ఇండో స్పిరిట్స్ 3 సంస్థలకు రూ.4.35 కోట్ల మేరకు క్రెడిట్ నోట్లు జారీ చేసిందని, తర్వాత దర్యాప్తును దారి మళ్లించేందుకు వాటిని రివర్స్ చేసినట్లు పుస్తకాల్లో నమోదు చేశారని వెల్లడించింది. మద్యం కుంభకోణంలో పిళ్లై మొదటి నుంచి భాగస్వామిగా ఉన్నారని, కొత్త ఎక్సైజ్ విధానం ద్వారా లభించే వ్యాపార అవకాశాలను చర్చించేందుకు, భాగస్వామ్యం ఏర్పర్చుకునేందుకు ఆయన విజయ్ నాయర్, సమీర్ మహేంద్రుతో సంబంధాలు పెట్టుకున్నారని తెలిపింది. రాష్ట్ర కేబినెట్‌లో చర్చించకముందే మంత్రుల బృందం నివేదికలో కొన్ని భాగాలు బుచ్చిబాబు, పిళ్లై వద్ద ఉన్నాయని పేర్కొంది. మొత్తం ముసాయిదా రూపకల్పనలో పిళ్లై పాత్ర ఉందని ఈడీ నిర్ధారించింది. రూ.100 కోట్లు ఆప్ నేతలకు చెల్లించి.. రూ.296.2 కోట్లు ఆర్జించారని, ఆ సొమ్ముతో పిళ్లై స్థిర, చరాస్తులను కొనుగోలు చేశారని వివరించింది.