ఉచిత బియ్యం ఐదు కిలోలే

ABN , First Publish Date - 2023-01-12T00:44:40+05:30 IST

సంక్రాతి పండుగకు రేషన్‌ బియ్యం పంపిణీ ఉంటుందా? లేదా? అనే సందిగ్ధం వీడింది.

ఉచిత బియ్యం ఐదు కిలోలే

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సంక్రాతి పండుగకు రేషన్‌ బియ్యం పంపిణీ ఉంటుందా? లేదా? అనే సందిగ్ధం వీడింది. రాష్ట్ర కోటాపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా కేంద్రం ప్రకటించిన ఒకరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీని రేషన్‌ డీలర్లు బుధవారం ప్రారంభించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తూ వచ్చేది. కొవిడ్‌ ఆపత్కాలంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఒకరికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని అందించగా దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 కిలోల చొప్పున బియ్యం కలిపి పది కిలోలు పంపిణీ చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 5 కిలోల ఉచిత బియ్యాన్ని మరో సంవత్సర కాలం పొడిగించింది. 7వ తేదీ నుంచి బియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించినా కొత్త సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని పంపిణీని నిలిపివేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే బియ్యం వాటా కూడా తేలకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందారు. తాజాగా గతంలో పేదలకు అందించే ఆరు కిలోల్లో కిలో బియ్యం కోత పడింది. దీనిపై స్పష్టత లేకపోయినా ప్రస్తుతం ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించారు. గత నెల డిసెంబరు వరకు పది కిలోల ఉచిత బియ్యాన్ని అందుకున్న పేద బలహీనవర్గాలు తిరిగి పది కిలోలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

27.99 లక్షల కిలోల బియ్యం కేటాయింపు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 344 రేషన్‌ దుకాణాల్లో 1,74,115 రేషన్‌ కార్డులు ఉన్నాయి. 4,99,914 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేసేందుకు 27.99 లక్షల కిలోల బియ్యం కేటాయించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న కార్డుల్లో ఆహార భద్రత కార్డులు 1,60,401 ఉండగా లబ్ధిదారులు 4,65,027 మంది ఉన్నారు. 13,503 అంత్యోదయ కార్డులు ఉండగా 34,673 మంది లబ్ధిదారులు ఉన్నారు. 211 అన్నపూర్ణ కార్డులు ఉండగా 214 మంది లబ్ధిదారులు ఉన్నారు. కొవిడ్‌ సమయంలో బడుగు, బలహీన వర్గాలను ఆదుకునే దిఽశగా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని ప్రకటించింది. దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచితంగానే బియ్యాన్ని అందించింది. 2020 సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు లబ్ధిదారుడికి 12 కిలోల చొప్పున, జూలై నుంచి నవంబరు వరకు ప్రతీ లబ్ధిదారుడికి పది కిలోల చొప్పున ఉచిత బియ్యం సరఫరా చేశారు. మళ్లీ 2021లో జూన్‌ నుంచి 2022 జూలై వరకు పది కిలోల చొప్పున, ఆగస్టు, సెప్టెంబరులో 15 కిలోల చొప్పున పంపిణీ చేశారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు ఉచిత బియ్యం సరఫరా చేయడానికి 27,99,850 కిలోల బియ్యాన్ని కేటాయించారు. మండలాల వారీగా బోయినపల్లిలో 32,922 మంది లబ్ధిదారులు ఉండగా 1,80,220 కిలోల బియ్యం, చందుర్తి 29,969 మంది లబ్ధిదారులు ఉండగా 1,58,155 కిలోలు, గంభీరావుపేట 41,107 మంది లబ్ధిదారులకు 2,19,980 కిలోలు, ఇల్లంతకుంట 42, 813 మంది లబ్ధిదారులకు 2,30,015 కిలోలు, కోనరావుపేట 40,334 మంది లబ్ధిదారులకు 2,17,055 కిలోలు, ముస్తాబాద్‌లో 42,141 లబ్ధిదారులకు 2,27,015 కిలోలు, రుద్రంగి 14,750 లబ్ధిదారులకు 78,245 కిలోలు, సిరిసిల్లలో 79,861 మంది లబ్ధిదారులకు 5,36,985 కిలోలు, తంగళ్లపల్లి 40,488 లబ్ధిదారులకు 2,30,035 కిలోలు, వీర్నపల్లి 12,866 లబ్ధిదారులకు 68,435 కిలోలు, వేములవాడ 57,284 లబ్ధిదారులు ఉండగా 3,05,795 కిలోలు, వేములవాడ రూరల్‌లో 20,892 లబ్ధిదారులు ఉండగా 1,10,690 కిలోలు, ఎల్లారెడ్డిపేట 44,487 లబ్ధిదారులు ఉండగా 2,37,225 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.

కొత్త షాపుల జాడలేదు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గిరిజన తండాలు, గ్రామ పంచాయతీలుగా మారాయి. చిన్న అనుబంధ గ్రామాలు, పంచాయతీలుగా మార్చినా ప్రజాపంపిణీ వ్యవస్థలో రేషన్‌ బియ్యం అందించడానికి వీలుగా కొత్తగా దుకాణాలు మాత్రం ఏర్పాటు చేయడం లేదు. కొత్త జీపీల ఆధారంగా రేషన్‌ షాపులు నెలకొల్పాలని డిమాండ్‌ ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రేషన్‌ సరుకులు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు.

రాయితీపై సరుకులు అందించాలి

గతంలో రేషన్‌ దుకాణాల ద్వారా పప్పులు, చక్కెర, గోధుమలు, ఇతర సరుకులు రాయితీపై అందించేవారు. ప్రస్తుతం కేవలం బియ్యం సరఫరాకే పరిమితం అయ్యారు. ఽనిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ప్రభుత్వమే రాయితీపై వంట నూనె, పప్పులు, గోధుమలు, ఇతర నిత్యావసర సరుకులు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - 2023-01-12T00:44:45+05:30 IST