సాలరీ ప్లీజ్..
ABN , Publish Date - Dec 21 , 2023 | 01:01 AM
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ)లు అన్నింటా కీలకంగా దశాబ్దాల కాలంగా సేవలు అందించారు.

- వీఆర్‌ఏ క్రమబద్ధీకరణ అయోమయం
- ఐదు నెలలుగా జీతాలు లేక ఉద్యోగుల వెతలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ)లు అన్నింటా కీలకంగా దశాబ్దాల కాలంగా సేవలు అందించారు. తమకు పదోన్నతులు కల్పించాలని చాలీచాలనీ వేతనాలతో పనిగంటలు లేక వెల్లదీస్తున్నామని అందోళన బాట పట్టిన క్రమంలో ప్రభుత్వం దిగివచ్చినా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. గత ప్రభుత్వం వీఆర్‌ఏ వ్యవస్థను తొలగించి వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తున్నామని గొప్పగా ప్రకటించి ఆగస్టులో హడావుడిగా వీఆర్‌ఏలను వివిధ శాఖల్లో నియమించారు. కానీ గడిచిన ఐదు నెలల కాలంలో ఉద్యోగోన్నతి పొందిన వారి వేతనాలు మాత్రం అందడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 474 మంది వీఆర్‌ఏలు ఉండగా వారిలో 372 మందిని విద్యార్హతలను బట్టి వివిధ శాఖల్లో స్కేల్ పోస్టుల్లో నియమించారు. ఇదే సమయంలో 61 ఏళ్లు పైబడిన వీఆర్‌ఏలు దాదాపు జిల్లాలో వంద మంది ఉన్నారు. వీరి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించినా అమల్లోకి రాలేదు. వీఆర్‌ఏలు ఉద్యోగ భద్రత కోసం గత సంవత్సరం దాదాపు 80 రోజుల పాటు సమ్మెలు, దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. చివరకు కుటుంబం గడవని స్థితిలో వీఆర్‌ఏలు పస్తులతోనే ఇబ్బందులు పడ్డారు.
- వేతనాలు లేక ఇబ్బందులు...
జిల్లాలో వీఆర్‌ఏలు గతంలో తహసీల్దార్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రూ 10,500 చొప్పున వేతనాలు వస్తుండేవి. విద్యార్హతలను బట్టి వివిధ శాఖల్లోకి పదోన్నతులతో పంపించారు. జూనియర్ అసిస్టెంట్‌కు రూ 24,280, రికార్డు అసిస్టెంట్‌కు రూ 22,150, సబార్డినేట్‌లకు రూ 18 వేల వరకు వేతనాలు చెల్లించే విధంగా నిర్ణయించారు. వేతనాలకు సంబధించిన ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో ఐదు నెలలుగా వీఆర్‌ఏల పదోన్నతుల ఉద్యోగులకు వేతనాలు అందక జీవనాన్ని భారంగా గడపాల్సిన పరిస్థితి నెలకొంది. పోస్టులు లేకపోయినా లెక్కకు మించి నియామకాలు చేపట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
వేతనాలు లేక అవస్థలు పడుతున్నాం...
- మల్లారం అర్జున్ పూర్వ వీఆర్‌ఏ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఐదు నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్నాం, వీఆర్‌ఏ నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా ఆఫీస్ సబార్డినేట్‌లుగా క్రమబద్ధీకరణతో ఆనంద పడ్డాం. ఇప్పటి వరకు ఉద్యోగ గుర్తింపు కార్డులు లేవు. వేతనాలు అందడం లేదు.
కుటుంబ పోషణ భారం...
- కొంపల్లి రాజేందర్, జూనియర్ అసిస్టెంట్
వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారడంతో ఆవేదనే మిగిలింది. కొత్త ప్రభుత్వమైనా వీఆర్‌ఏల నుంచి పదోన్నతి పొందిన వారి సమస్యలను పరిష్కరించాలి.