Manuguru: నాడు ఓనర్లు.. నేడు లారీ డ్రైవర్లు

ABN , First Publish Date - 2023-09-30T13:36:06+05:30 IST

సింగరేణి సంస్థతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఐఖ్యతకు మారుపేరుగా.. చెలామణిలో ఉండి అత్యంత శక్తివంతమైనదిగా

Manuguru: నాడు ఓనర్లు.. నేడు లారీ డ్రైవర్లు

- బొగ్గు లోడింగ్‌ లేక వాహన యజమానుల ఇక్కట్లు

- ఫైనాన్స్‌ చెల్లించలేక పలువురి ఆత్మహత్య

- బొగ్గు లోడింగ్‌ పెంచకుంటే కష్టమేనంటున్న అసోసియేషన్‌..

- సింగరేణి యాజమాన్యమే ఆదుకోవాలని వినతి

మణుగూరు టౌన్‌(భద్రాద్రి కొత్తగూడెం): సింగరేణి సంస్థతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఐఖ్యతకు మారుపేరుగా.. చెలామణిలో ఉండి అత్యంత శక్తివంతమైనదిగా పేరొందిన మణుగూరు లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(Manuguru Lorry Owners Welfare Association) నేడు పలు ఇబ్బందులతో కూనారిల్లుతోంది. బొగ్గు లోడింగ్‌లు లేక లారీ ఓనర్లు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్నారు. లారీ రవాణా రంగం బాగుందని, గత సింగరేణి యాజమాన్యాలు చేసిన సహకారంతో ఎంతోమంది ఫైనాన్స్‌ ద్వారా లారీ కొనుగోలు చేసి ఈ బొగ్గు రవాణాలోకి అడుగుపెట్టారు. కొంతకాలం మూడు పువ్వులు.. ఆరుకాయలుగా కొనసాగిన బొగ్గు రావాణా ఫీల్డ్‌ కొద్ది కొద్దిగా చితికలపడుతూ.. నేడు కోలుకోలేని పరిస్థితికి దిగిజారిపోయిందని పలువురు అసోసియేషన్‌ కమిటీ సభ్యులు, లారీ ఓనర్లు వాపోతున్నారు.

వడ్డీల చెల్లింపులకు అప్పులు

మణుగూరు ఏరియాలో బీటీపీఎస్‌ ఏర్పడిన తర్వాత 12 టైర్ల లారీల పరిస్థితి మరి అధ్వానంగా మారిందని లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి పస్తులు సైతం ఉండాల్సి వస్తోందని, ఫైనాన్స్‌ చెల్లించేందుకు వడ్డీల మీద వడ్డీలకు అప్పు తెచ్చి మరీ ఈఎంఐ చెల్లించాల్సి వస్తోందని చెపుతూ వారి బాధలను వ్యక్తపరుస్తున్నారు. లారీలకు లోడింగ్‌ లేకపోవడంతో.. ఫైనాన్స్‌లు కట్టలేక.. ఇంట్లోవారిని పస్తులు ఉంచలేక ఆంజనేయులు, పుల్లారావులతోపాటు మరి కొందరు లారీ ఓనర్లు ఆత్మహత్యలు చేసుకోగా.. మరి కిందరు ఈ రంగాన్నే వదిలి వేరే గ్రామాలకు వెళ్లి పోయారు అసోసియేషన్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు 20 లారీలకే లోడింగ్‌..

మణుగూరు ఏరియాలోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌లో సుమారు 700 వందలకు పైగా లారీలు ఉండగా.. నేడు వాటి సంఖ్య 370కి పడిపోయింది. ఏరియా సింగరేణి యాజమాన్యం దాదాపు రోజుకు సుమారుగా 400నుంచి 600 టన్నుల బొగ్గు మాత్రమే లారీల లోడింగ్‌కు కేటాయిస్తుండడంతో రోజు సరాసరిగా 12 టైర్ల లారీల(బాడీ బండ్లు)కు పది, మరో 10 టిప్పర్‌ లారీలకు మాత్రమే లోడింగ్‌ దొరుకుతోందని లారీ ఓనర్లు వాపోతున్నారు. దీంతో పాటు వర్షం వస్తే లోడింగ్‌ ఉండదని, కనీసం ప్రతీ నెలలో 4 రోజుల నుంచి 7 రోజుల వరకు అసలు లోడింగే దొరకడం లేదని అసోసియేషన్‌ సభ్యులు వాపోతున్నారు.

వ్యాగన్లకే ప్రాధాన్యం..

బొగ్గు రవాణా రంగానికి ఏరియా సింగరేని యాజమాన్యం ఇచ్చిన సహకారంతో లారీలు కొనుగోలు చేసిన యజమానులు నేడు అదే లారీలకు డ్రైవర్లుగా మారపోయారు. గత కొన్నేళ్లుగా బొగ్గు రవాణా రంగంలో సింగరేణి యాజమాన్యం కేవలం వ్యాగన్లకే ప్రాముఖ్యతనిస్తూ లారీ ఓనర్లు విస్మరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఒకప్పుడు 700లకు పైగా ఉన్న లారీ ఓనర్లు నేడు సగానికి సగం పడిపోయారంటే పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సింగరేణి సంస్థపై ఆధారపడి జీవిస్తోన్న లారీ ఓనర్లు, క్లీనర్‌లు, బొగ్గు ముఠా గుమస్తాలు, కోల్‌ ట్రాన్స్‌పోర్టర్‌లు, ట్రాన్స్‌పోర్టు గుమాస్తాలు లోడింగ్‌ సమస్యతో ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఏరియా యాజమాన్యం స్పందించి లారీలకు బొగ్గు లోడింగ్‌ను పెంచి ఇన్నాళ్లుగా సింగరేణిపై ఆధారపడిన వేల కుటుంబాలను ఆదుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.

లోడింగ్‌ పెంచుతామన్నారు

- వీవీ రవి, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌ లారీలకు బొగ్గు లోడింగ్‌ను పెంచుతామని హామీ ఇచ్చారని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీ రవి అన్నారు. శుక్రవారం బొగ్గు లోడింగ్‌ సంబంధించి ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడారు. ఏరియాలోని కేపీయుజీ గని (పంచ్‌ ఎంట్రీ)నుంచి వెలికి తీసిన జీ-6 బొగ్గును లారీల లోడింగ్‌కు ఇచ్చేవారని, ప్రస్తుతం బీటీపీఎస్‌ ఆ బొగ్గును రవాణా చేస్తుండడంతో పరిస్థితి విషమించిందన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే ఉన్న కొంతమంది ఓనర్లు లారీలు అమ్ముకునే పరిస్థితి ఉందంటూ జీఎం సమస్యలు వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. రోజుకు 700 నుంచి వెయ్యి టన్నుల మేరకు బొగ్గు లోడింగ్‌ను ఇస్తామని హామినిచ్చినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు లోడింగ్‌ పెరిగితే కొంతమంది ఓనర్లకు ఊరట లభిస్తుందని తెలిపారు.

Updated Date - 2023-09-30T13:36:06+05:30 IST