వరదరాజస్వామి ఆలయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2023-02-26T23:54:32+05:30 IST
మర్కుక్ మండలంలోని వరదరాజ్ పూర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పురాతన వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎంవో కార్యాలయ అధికారి భూపాల్‌రెడ్డి సూచించారు.

సీఎంవో కార్యాలయ అధికారి భూపాల్‌రెడ్డి ఆదేశం
ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయికి సూచన
జగదేవ్‌పూర్, ఫిబ్రవరి 26 : మర్కుక్ మండలంలోని వరదరాజ్ పూర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పురాతన వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎంవో కార్యాలయ అధికారి భూపాల్‌రెడ్డి సూచించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి ఆలయ పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ఆలయంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం మొత్తం కలియతిరిగారు. గర్భగుడి లోపల విగ్రహాల చుట్టుపక్కల సరిపడినంత స్థలం ఉండేలా చూసుకోవాలన్నారు. గర్భగుడిపైన నిర్మించే గోపురంపైకి ఎక్కి పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న రాళ్లను తొలగించాలన్నారు. గర్భగుడి గోపురం ఎత్తు ధ్వజస్తంభం కంటే ఎక్కువ ఉండేలా చూడాలని సూచించారు. పనులు నత్తనడకన సాగుతున్నందున అసహనం వ్యక్తంచేశారు. ఆలయ నిర్మాణ ఏజెన్సీ అధికారి దాస రవీందర్, ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నమూనాను చూపిస్తూ పనుల గురించి వివరించారు. గర్భగుడి బయట చుట్టూ ఉన్న మండపం పూర్తిస్థాయిలో శిథిలం అయినందున తొలగించాలని, కాని ప్రహరి మాత్రం మరమ్మతులు చేయాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా అత్యంత నాణ్యమైన పద్ధతిలో ఆలయ వాస్తులో ఎటువంటి దోషాలు రాకుండా త్వరగా పూర్తి చేయాలని నిర్మాణ ఏజెన్సీని ఆదేశించారు. ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ త్వరగా పూర్తి చేయించాలని ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయికి సూచించారు. వరదరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు సమయం దగ్గర పడుతున్నందున ఒక్కో పనికి ఒక్కో టీం చొప్పున కూలీలను తెప్పించి పని చేయించాలన్నారు. అన్ని పనులు పూర్తి చేశాక లోపల ఎలాంటి రాళ్లు, రప్పలు ఇతర సామగ్రి ఉండకుండా శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అలాగే ఆలయ మాన్యం భూమి 128 ఎకరాలు వరదరాజస్వామి వారి పేరు మీదనే గ్రామకంఠం, ధరణిలో ఉండగా భూమి ఎవరు కబ్జా చేయకుండా చూడాలని అదికారులను హెచ్చరించారు. అనంతరం గ్రామంలో రూ.2 కోట్ల 50లక్షలతో నిర్మిస్తున్న కమాన్, హనుమాన్, పెద్దమ్మ ఆలయం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ పొలిమేరల్లో కమాన్‌ను నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. కమాన్ నుంచి పెద్ద వాహనాలు సైతం వెళ్లేలా నిర్మించాలని సూచించారు. వారి వెంట ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బసంత్‌నాయక్, ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీఈ బాలప్రసాద్, సర్పంచ్, ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.