Harish Rao: ఇదేం ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Apr 12 , 2025 | 09:15 AM
Harish Rao: రైతు సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని హరీష్‌రావు కోరారు.

సిద్దిపేట జిల్లా: రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో సరైన సమయంలో రైతుబంధు, రైతు భీమా ఇచ్చామని గుర్తుచేశారు. ఇవాళ(శనివారం) నంగూనూర్ మండలం రాజగోపాల్ పేటలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం చనిపోయిన రైతులకు రైతు భీమా ఇచ్చిందని, కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని చెప్పారు. వానకాలం పంటలకు ఉచిత విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేక పచ్చి రొట్టె విత్తనాలను ఇవ్వడం లేదని అన్నారు. కౌలు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వడగళ్ల వర్షంతో నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని హరీష్‌రావు కోరారు.
పంటల భీమా ఇస్తామని ఇంతవరకు రైతులకు పంటల భీమా ఇవ్వలేదని హరీష్‌రావు అన్నారు. గత యాసంగి పంట నష్టం 1350 ఎకరాలని ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భీమా పథకం మూడు నెలల నుంచి ఇవ్వడం లేదని అన్నారు. చనిపోయిన అన్నదాతల కుటుంబాలు రైతు భీమా కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోతున్నాయని చెప్పారు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భీమా ప్రీమియం కట్ట లేదా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ పార్టీకి పేరు వస్తోందని రైతుబంధు పథకాన్ని పూర్తిగా ఇవ్వడం లేదని హరీష్‌రావు మండిపడ్డారు.
రైతుబంధు పథకాన్ని వెంటనే రైతులు అందరికీ అమలు చేయాలని హరీష్‌రావు కోరారు. కేసీఆర్ హయాంలో చాలా విత్తనాలు సబ్సిడీలో ఇచ్చామని గుర్తుచేశారు. వానకాలంలో పచ్చి రొట్టె విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టాలని అన్నారు. కౌలు రైతుల కోసం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్దపెద్ద మాటలు మాట్లాడారని.. ఇప్పుడు వారి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. కౌలు రైతులకు పంట నష్టం ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు రెండు రకాల నష్టం జరుగుతోందని.. రైతు బంధు రావడం లేదు.. పంటల భీమా కూడా రావడం లేదని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పంటల భీమా చేస్తామని అసెంబ్లీలో బడ్జెట్ నిధులు కేటాయించి మొండి చేయి చూపిందని హరీష్‌రావు మండిపడ్డారు. భీమా చేసి ఉంటే రైతులకు మేలు జరిగేదని అన్నారు. పంటల భీమా చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం తప్పు అని విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఏ రైతును అడిగిన 60శాతం రుణమాఫీ పూర్తి కాలేదని అంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. అందరికీ రుణమాఫీ కాలేదనీ తాను అసెంబ్లీలో అడిగితే భట్టి విక్రమార్క వందశాతం పూర్తి అయిందని అన్నారని చెప్పారు. తాను వందశాతం రుణమాఫీ అయితే ముక్కు నెలకు రాస్తానని భట్టి నియోజకవర్గం మధిరలో రైతులను అడుగుదామా అని హరీష్‌రావు ప్రశ్నించారు.
సిద్ధిపేట జిల్లాలోనే 12వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని హరీష్‌రావు అన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి చేయకుంటే రేవంత్ రెడ్డికి పాపం తగులుతుందని విమర్శించారు. ఇప్పటికైనా సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నకోడూరు మండలంలో సుమారు 5300 మంది రైతులకు రుణమాఫీ అయిందని.. మిగతా 7352మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. ఒకవంతు రుణమాఫీ చేశారు.. రెండు వంతులు ఎగ్గొట్టారని విమర్శలు చేశారు. రైతులు చనిపోయి నెల రోజులు అయిన భీమా రావడం లేదని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో వందల ఎకరాల్లో రేవంత్ రెడ్డి చెట్లు నరికారని విమర్శించారు. రేవంత్ నిర్ణయం వల్ల అధికారులు బలవుతున్నారని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News