ponguleti, Bhatti: రాసిపెట్టుకోండి.. పదికి పది కాంగ్రెస్ గెలుచుకోబోతోంది..
ABN , First Publish Date - 2023-09-12T12:47:55+05:30 IST
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిజిల్లాలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతోందని, బీఆర్‌ఎస్ మంత్రులు చెప్పేవన్నీ
ముదిగొండ(ఖమ్మం): వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిజిల్లాలో పదికి పది స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతోందని, బీఆర్‌ఎస్ మంత్రులు చెప్పేవన్నీ నీతులట, కాంగ్రెస్ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలటని టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(Ponguleti Srinivasa Reddy, CLP leader Mallu Bhatti Vikramarka) పేర్కొన్నారు. ముదిగొండ మండలం వెంకటాపురంలో సోమవారం రాత్రి జరిగిన కాంగ్రెస్‌లో చేరికల సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడారు తొలుత పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఏంచేయాలో సోనియాగాంధీ 17న హైదరాబాద్‌లో జరుగనున్న సభలో ప్రకటిస్తారన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిని కలుపుకొని పోతూ వచ్చే ఎన్నికల్లో మధిరలోనే కాకుండా ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. బీఆర్‌ఎస్, సీపీఎం, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేవారిని స్వాగతిస్తామని, వారికి ఏకష్టం రాకుండా కాపాడుకుంటామన్నారు. ప్రాజెక్టుల గేట్లకు రంగులేసి, కాల్వల్లో పిచ్చిచెత్త తొలగించి అభివృద్ధి చేశామని చెబుతున్న కల్వకుంట్ల కుటుంబ సంస్కృతి ఏంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీ అంశాన్ని తవ్వి అవినీతిపరుల అంతు చూస్తుందని హెచ్చరించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పదిసీట్లను కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంటుందని బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పలువురు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తితో ఉన్నారన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు రాజకీయ పునరీకీకరణ జరుగుతోందన్నారు. మంత్రిగా మాటలు చెపుతున్న పువ్వాడ అజయ్ తొలుత గెలిచింది కూడా కాంగ్రెస్ నుంచేనని, ఆనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించింది కూడా వైఎస్సార్ అభిమానులేనన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్(BRS) పార్టీ అడ్రస్ గల్లంతుకావడం ఖాయమన్నారు. అంతకుముందు ముదిగొండ నుంచి వెంకటాపురం వరకు జరిగిన ర్యాలీలో పొంగులేటి, భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన వారికి వారు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, టీపీసీసీ సభ్యుడు రాయల నాగేశ్వరరావు, డాక్టర్ కోట రాంబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్‌బాబు, మాజీ ఎంపీ మందరపు నాగేశ్వరరావు, కందిమళ్ల వీరబాబు, పసుపులేటి దేవేంద్రం, దేవరపల్లి అనంత్‌రెడ్డి, రాఘవరెడ్డి, వాకదాని కన్నయ్య, జూలకంటి సంజీవరెడ్డి, బిచ్చాల బిక్షం, మండల మహిళా అధ్యక్షురాలు గుడిపూడి ఝాన్సీ పాల్గొన్నారు.