Singareni : ‘సింగరేణి’ ఎన్నికలకు మార్గం సుగమం
ABN , First Publish Date - 2023-03-03T04:23:44+05:30 IST
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది. ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) డి.శ్రీనివాసులును నియమిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ
ఎన్నికల రిటర్నింగ్ అధికారి నియామకం
13న కార్మిక సంఘాలతో సమావేశం
ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం
ఇల్లెందు,పెద్దపల్లి/గోదావరిఖని, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది. ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) డి.శ్రీనివాసులును నియమిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13న ఎన్నికల రిటర్నింగ్ అధికారి సింగరేణి కాలరీస్ యాజమాన్యం, కార్మికసంఘాల ప్రతినిధులతో ఎన్నికల రోడ్ మ్యాప్ రూపకల్పన కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొనాలని యాజమాన్యంతోపాటు సింగరేణి కాలరీ్‌సలో కార్యకలాపాలు సాగిస్తూ రిజిస్టర్ అయిన 33 కార్మిక సంఘాలకు రిటర్నింగ్ అధికారి లేఖలు రాశారు. ఒక్కో కార్మిక సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. ఆ రోజు కార్మిక సంఘాల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్ గురించి చర్చించి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుర్తింపు సంఘం కాలపరిమితి రెండేళ్లు ఉంచాలా, నాలుగేళ్లకు పెంచాలా అనే విషయంపై చర్చించే అవకాశాలున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోపు ఎన్నికలు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణిలో చివరగా 2017 అక్టోబరు 5న కార్మికసంఘాల ఎన్నికలు జరిగాయి. గుర్తింపు సంఘంగా గెలుపొందిన బీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కాలపరిమితి 2019 అక్టోబరు 4తో ముగిసింది.
కొవిడ్ తదితర కారణాలతో మూడేళ్లు దాటినా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేస్తుండటంతో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సింగరేణిలో మూడు నెలల్లో కార్మికసంఘాల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2022 డిసెంబరు 5న హైదరాబాద్‌లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) ఎన్నికల రోడ్ మ్యాప్ రూపకల్పనకు కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యం, కార్మికశాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికలు మార్చి 31 తర్వాతే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడంతో కార్మికశాఖ ఎన్నికల ప్రక్రియ చేపట్టలేదు. కాగా మార్చి 31తో 2022-23 ఆర్థిక సంవత్సర ఉత్పత్తి కాలపరిమితి ముగియనుండటంతో కార్మిక శాఖ సింగరేణి కార్మికసంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.