AP News: రాజధాని నిర్మాణంలో కీలక పరిణామం..
ABN , Publish Date - Dec 12 , 2024 | 05:34 PM
ఏపీ రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. దీంతో నిలిచిపోయిన పనులన్నీ ముందుకు సాగనున్నాయి. తాజా కబురుతో అధికారుల్లో కొత్త ఉత్సాహం కనపడుతోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. మనీలాలో ఏ సియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏ డి బి)తో నిన్న జరిగిన సమావేశం విజయవంతమైంది. రాజధాని నిర్మాణానికి ఏకంగా రూ. 8000 వేల కోట్ల సాయాన్ని అందజేసేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకుల ఆమోద ముద్ర వేయగానే నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది.
అమరావతి నిర్మాణానికి రుణ సాయం ఒప్పందానికి ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏ డి బి) ఆమోదముద్ర వేసింది. అమరావతి నిర్మాణానికి ఏడిబి నుండి 8000 కోట్ల సాయం చేయనుంది. మరోవైపు ఈనెల 17న వరల్డ్ బ్యాంక్ బోర్డు మీటింగ్ నిర్వహించనున్నారు. 17న జరిగే బోర్డు మీటింగ్ లో అమరావతి సాయం ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు సైతం ఆమోద ముద్ర వేయనుంది. ఇప్పటికే నిర్మాణానికి రుణ సాయంపై ఒప్పందం రూపకల్పన చేశారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు అనంతరం ఈ ఒప్పందానికి తుది రూపుదిద్దారు. ఇందులో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ అధికారులు, ప్రపంచబ్యాంకు, ఆసియా అభిద్రుద్ధి బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపంచ బ్యాంకు బోర్డు ఓకే అన్న అనంతరం ఒప్పంద పత్రంపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ అధికారులు, ప్రపంచబ్యాంకు, ఆసియా అభిద్రుద్ధి బ్యాంకు ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. అనంతరం నిధులు విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. రుణ రూపేణ అందనున్న మొత్తం 16 వేల కోట్ల నిధులు కానుండగా అందులో ఏడిబి ద్వారా రూ. 8వేల కోట్ల సాయం అందనుంది. మొత్తం రూ. 16 వేల కోట్లలో చెరో 8 వేల కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివద్ధి బ్యాంకు అందజేయనుంది. నిధులు అందనున్న నేపథ్యంలో పనులకు సంబంధించి ఇప్పటికే కింది స్థాయిలో పూర్తి ప్రణాళిక సి ఆర్ డి ఏ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వివిధ పనులకు టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది.