Share News

Permit Rooms AP: మళ్లీ పర్మిట్‌ రూమ్‌లు

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:15 AM

పర్మిట్‌ రూమ్‌ల రద్దుతో ప్రభుత్వం రూ.175 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. బహిరంగ మద్యపానం పెరగడంతో మళ్లీ వాటిని పునరుద్ధరించే యోచనలో ఎక్సైజ్‌ శాఖ ఉంది

Permit Rooms AP: మళ్లీ పర్మిట్‌ రూమ్‌లు

  • ఎక్సైజ్‌ శాఖ పునరాలోచన

  • ‘పర్మిట్‌’ లేక రూ.175 కోట్ల నష్టం

  • షాపుల వద్దే ఎక్కువగా తాగుడు

  • బహిరంగ మద్యపానంతో ఇబ్బందులు

  • వైసీపీ హయాం నుంచే ఈ జాడ్యం

  • పర్మిట్‌ రూమ్‌లతో పరిష్కారమనే యోచన

క నిర్ణయం తీసుకునే ముందు... పర్యవసానాలు ఆలోచించాలి! ఆదాయం మాత్రమే కాదు... దాని వల్ల తలెత్తే పరిణామాలూ పరిశీలించాలి. ఇలా ముందూ వెనుకా చూడకుండా తీసుకున్న ఒక నిర్ణయం సర్కారు ఆదాయాన్ని పోగొట్టడమే కాదు, బహిరంగ ప్రదేశాల్లో తాగుడుకూ కారణమైంది. ఆ నిర్ణయమే... పర్మిట్‌ రూమ్‌ల రద్దు! మద్యం షాపులకు అనుబంధంగా నిలబడి మాత్రమే తాగేందుకు వీలుగా ఏర్పాటుచేసే పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వొద్దని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. అయితే... దాని వల్ల తలెత్తే ఇబ్బందులను వివరించడంలో ఎక్సైజ్‌ అధికారులు విఫలమయ్యారు. పర్మిట్‌ రూమ్‌ల రద్దు నిర్ణయం వల్ల ప్రభుత్వం రూ.175 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఆదాయం సంగతి పక్కనపెడితే... పర్మిట్‌ రూమ్‌ లేకపోయినా సరే మందుబాబులు సీసాలు కొనుక్కుని షాపుల దగ్గరే తాగుతున్నారు. దీంతో మళ్లీ పర్మిట్‌ రూమ్‌లు పెట్టాలని ఎక్సైజ్‌ శాఖ ఆలోచన చేస్తోంది. తాజాగా తిరుపతిలో జరిగిన ఎక్సైజ్‌ సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వడమే మంచిదని, దానివల్ల బహిరంగ ప్రదేశాల్లో తాగుడు గోల పోతుందని ఎక్కువ మంది అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో దీనిపై ఓ కమిటీ వేయాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది.


ఆదాయం ఇలా నష్టం..

సాధారణంగా మద్యం షాపుల వద్ద మందు కొనుక్కునేవారు అక్కడే తాగుతుంటారు. అయితే వారు షాపు ముందు, రోడ్లపై తాగకుండా ఎక్సైజ్‌ శాఖ పర్మిట్‌ రూమ్‌లకు అనుమతిస్తుంది. షాపు లైసెన్సీ అక్కడే ఒక చిన్న రూమ్‌ ఏర్పాటుచేసి తాగేందుకు అవకాశం కల్పిస్తారు. అందుకోసం లైసెన్సీ ఏడాదికి రూ.5లక్షలు ఎక్సైజ్‌ శాఖకు చెల్లించాలి. గతేడాది అక్టోబరులో 3,396 షాపులకు లైసెన్స్‌లు జారీచేశారు. ఆ తర్వాత గీత కులాలవారికి 340 షాపులు ఇచ్చారు. మొత్తంగా 3,500 షాపుల లైసెన్సీలు రూ.5లక్షల చొప్పున చెల్లించినా రూ.175 కోట్ల ఆదాయం వచ్చేది. గతంలో మద్యం షాపుల వద్ద పర్మిట్‌ రూమ్‌లకు అవకాశం ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. షాపుల వద్ద తాగుడు తగ్గిస్తామని ఆ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, ఎక్సైజ్‌ శాఖ అదే బాటలో నడిచింది. పర్మిట్‌ రూమ్‌లకు అవకాశం ఇస్తే మద్యం షాపులు మినీ బార్లుగా మారతాయని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అయితే పర్మిట్‌ రూమ్‌లకు అవకాశం ఇవ్వకపోతే కొత్త ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఉపసంఘానికి సరైన రీతిలో వివరించలేదు. ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని యథావిధిగా అమలుచేశారు. ఫలితంగా భారీ నష్టం వచ్చింది.


అయినా ఫలితం ఎక్కడ?

అంత ఆదాయం కోల్పోయినా ప్రయోజనం మాత్రం శూన్యమే. నిజానికి, గత వైసీపీ ప్రభుత్వంలోనే ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. షాపుల వద్ద తాగేందుకు అనుమతివ్వకపోవడంతో రోడ్లపై విచ్చలవిడిగా తాగుతూ మందుబాబులు సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవారు. అయినా కూటమి ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ అదే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. చాలా చోట్ల మందుబాబులు రోడ్లపైనే మందు తాగుతున్నారు. అలాగే అనుమతి లేకపోయినా షాపుల లైసెన్సీలు అక్కడే తాగేందుకు అవకాశం కల్పిస్తున్నారు. తరచూ దీనిపై ఫిర్యాదులు రావడంతో ఎక్సైజ్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నా, పెద్దగా ప్రయోజనం కనిపించట్లేదు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 12 , 2025 | 04:15 AM