Share News

Hyderabad: లోకాయుక్త, ఉప లోకాయుక్తల నియామకం

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:42 AM

తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త, తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌(టీజీహెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌, ఇద్దరు సభ్యులను రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నియమించారు.

Hyderabad: లోకాయుక్త, ఉప లోకాయుక్తల నియామకం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త, తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌(టీజీహెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌, ఇద్దరు సభ్యులను రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నియమించారు. లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా జిల్లా, సెషన్స్‌ రిటైర్డు జడ్జి బీఎస్‌ జగ్జీవన్‌ కుమార్‌ నియమితులయ్యారు. అలాగే, టీజీహెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి డా.జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, టీజీహెచ్‌ఆర్‌సీ జ్యుడీషియల్‌ సభ్యురాలిగా రిటైర్డు సెలక్షన్‌ గ్రేడ్‌ జడ్జి శివాది ప్రవీణ, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా రిటైర్డు ఐఏఎస్‌ డా.బి.కిశోర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. లోకాయుక్తగా జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్‌ జగ్జీవన్‌ కుమార్‌ పదవీ కాలం ఐదేళ్లు ఉంటుంది. లోకాయుక్త పదవిలో ఉన్నంతకాలం జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో పూర్తి స్థాయి అధికారిగా కొనసాగుతారు. ఉప లోకాయుక్త జస్టిస్‌ జగ్జీవన్‌కుమార్‌ హైకోర్టు న్యాయమూర్తి(జడ్జి) హోదాలో కొనసాగుతారు. ఇక, టీజీహెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ డా.జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఈ పదవిలో మూడేళ్ల పాటు లేదా ఆయనకు 70 ఏళ్లు నిండే వరకు.. ఏది ముందు వర్తిస్తే అప్పటివరకు కొనసాగుతారు. టీజీహెచ్‌ఆర్‌సీ జ్యుడీషియల్‌ సభ్యురాలు శివాది ప్రవీణ, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడు డా.బి.కిశోర్‌ తమ పదవుల్లో మూడేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయసు నిండే వరకు.. ఏది ముందు వర్తిస్తే అంతవరకు కొనసాగుతారు.


కమిషన్‌పై మరోసారి సమావేశం

లోకాయుక్త, ఉప లోకాయుక్త, తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌, తెలంగాణ సమాచార హక్కు కమిషన్‌ నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఇటీవల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయా పదవులకు ఎంపిక చేసిన వారి జాబితాను గవర్నర్‌కు పంపగా వాటినే ఆయన ఆమోదించారు. అయితే, సమాచార హక్కు కమిషన్‌కు ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐఎస్‌), రాష్ట్ర సమాచార కమిషనర్ల(ఎ్‌సఐసీ)ను నియమించాల్సి ఉంది. ఈ పదవుల్లో ఎవరిని నియమించాలనే అంశంపై గత సమావేశంలో చర్చలు జరిగాయి. కమిషన్‌కు చీఫ్‌ కమిషనర్‌ కాకుండా మరో 10 మంది రాష్ట్ర కమిషనర్లను నియమించే అవకాశం ఉంది. అయితే, చీఫ్‌ కమిషనర్‌తో పాటు మరో ఐదుగురు కమిషనర్లను నియమించాలన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ప్రధాన కమిషనర్‌గా సీఎంఓలో కార్యదర్శిగా పని చేస్తున్న ఐఎ్‌ఫఎస్‌ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కమిషనర్ల పోస్టుల్లో ఎవరిని నియమించాలనేది ఇంకా తేలలేదు. దీనికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన త్వరలో మరోసారి సమావేశం జరగనుంది.


ఇవి కూడా చదవండి:

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..

దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు

Read Latest and Viral News

Updated Date - Apr 12 , 2025 | 04:42 AM