Jagan Media Twist: రాసేది తప్పులు ఆపై ఏడ్పులు
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:08 AM
ఒకే హత్యపై జగన్ మీడియా రెండు సంచికల్లో రెండు రకాల కథనాలు ప్రచురించింది. కుటుంబ కక్షలపై జరిగిన హత్యను టీడీపీపై బురదచల్లే ప్రయత్నం చేసింది

జగన్ రోత పత్రిక వింత వైఖరి
కుటుంబ కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు
సొంత అల్లుడు, బంధువుల చేతిలో వ్యక్తి మృతి
తెలంగాణ సంచికలో ఇవే వివరాలతో వార్త
ఏపీ ఎడిషన్‌లో ‘టీడీపీ గూండాల’ పనే అని రచ్చ
సమర్థించుకునేందుకు ‘పచ్చ’ అంటూ పిచ్చి రాతలు
టీడీపీ ఫిర్యాదుతో జగన్ పత్రికపై కేసు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఒకే హత్య... ఒకే పత్రిక... ఒకే యాజమాన్యం! తెలంగాణ సంచికలో ‘పాత కక్షల కారణంగా జరిగిన హత్య’ అని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ సంచికలో మాత్రం ‘టీడీపీ గూండాలు చేసిన రాజకీయ హత్య’ అని అచ్చోసింది! దీనిపై టీడీపీ కేసు పెట్టడంతో... జగన్ మీడియాకు ‘పత్రికా స్వేచ్ఛ’ గుర్తుకొచ్చింది! ఇదీ జగన్ రోత పత్రిక తీరు! చేసింది తప్పు కాబట్టి.. లెంపలేసుకోవాలి! లేదా.. మౌనంగా ఉండాలి. కాకుంటే.. టీడీపీపైనా, ప్రభుత్వంపైనా అక్కసు వెళ్లగక్కాలి. కానీ రోత పత్రిక శుక్రవారం తనకు గిట్టని పత్రికలపై ‘పచ్చ మీడియా’ అంటూ పిచ్చి రాతలు రాసింది. ప్రాంతానికో రకంగా వార్తలు రాసింది ‘పచ్చ’ పత్రికలే అని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు గుర్తు చేస్తున్నారంటూ డొల్ల వాదనలు చేసింది. దీనికి ఉదాహరణగా... ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వేర్వేరుగా ప్రకటనలు జారీ చేసిందని ‘గుర్తు చేసింది’! అది... తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వ్యాపార ప్రకటన! పార్టీ ప్రకటనకు, పత్రికలు ప్రచురించే వార్తలకు సంబంధం ఏమిటి? ఆ మాత్రం తెలియకుండానే జగన్ పత్రిక నడుపుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ పోలీసులు నిజం చెప్పరా?
ఈనెల మొదటివారంలో పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపారు. అతను వైసీపీ కార్యకర్త! కిడ్నాప్ జరిగింది తెలంగాణ పరిధిలో! దీంతో అక్కడి పోలీసులు దర్యాప్తు చేశారు. దీనిపై తెలంగాణ సంచికలో ‘‘సాగర్‌లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య... భూ వివాదాల కారణంగా అంతమొందించిన అల్లుడు’ అంటూ జగన్ పత్రిక వార్త ప్రచురించింది. ‘‘హరిశ్చంద్ర, ఆయన సొంత అల్లుడు బెజవాడ బ్రహ్మం మధ్య కొంత కాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది. గత ఏడాది డిసెంబరు 16న వీరు గొడవ పడ్డారు. గొడవలు వద్దని వారించిన బ్రహ్మం అన్న (చిన్నమ్మ కొడుకు) బెజవాడ రమేశ్, అక్కలు మంగమ్మ, పోచమ్మలపై హరిశ్చంద్ర గొడ్డలితో దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన రమేశ్ కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి హరిశ్చంద్రపై బ్రహ్మం కక్ష పెంచుకున్నాడు. అతడిని మట్టు పెట్టే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. దీంతో... హరిశ్చంద్ర తన సొంతూరిలో వ్యవసాయం వదిలిపెట్టి నల్లగొండ జిల్లా కనగల్‌లో తన బంధువుల వద్ద తలదాచుకుంటున్నాడు. ఈనెల 2వ తేదీన పింఛనుకోసం స్వగ్రామానికి బయలుదేరిన హరిశ్చంద్రను బ్రహ్మం తన బంధువులతో కలిసి కిడ్నాప్ చేశాడు. పోలీసులు బ్రహ్మంతోపాటు ఇతరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హరిశ్చంద్రను తమ గ్రామంలో ఆయన పొలంలోనే హత్య చేసినట్లు వారు అంగీకరించారు’’ అని జగన్ పత్రిక తెలంగాణ సంచికలో ప్రచురించింది. కానీ... ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌కు వచ్చేసరికి ‘‘పొరుగు రాష్ట్రంలో దాక్కున్నా ప్రాణం తీశారు. టీడీపీ గూండాలు ఘోరానికి పాల్పడ్డారు. వైసీపీ నేత హరిశ్చంద్రను హత్య చేశారు’’ అని రాజకీయ రంగు పులిమారు.
సమర్థించుకునేందుకు తంటాలు..
అడ్డగోలు రాతలు రాసిన జగన్ పత్రికను సమర్థించేందుకు వైసీపీ నేతలు అంతే అడ్డగోలు వాదనలు చేశారు. ‘‘తెలంగాణలోని పాత్రికేయులకు పూర్తి సమాచారం లేకపోవచ్చు. కానీ... పల్నాడు పాత్రికేయులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తి సమాచారం ఇచ్చారు’’ అని పేర్కొన్నారు. ‘పూర్తి సమాచారం ఇచ్చారు’ అని చెబుతున్న వార్తలో... హరిశ్చంద్రను చంపింది సొంత అల్లుడు అని లేదు. కనీసం... అతని పేరు కూడా రాయలేదు. వారి మధ్య భూతగాదాలు ఉన్నాయని, గతంలో వారిపై హరిశ్చంద్ర గొడ్డలితో దాడి చేసి ఊరి వదిలి వెళ్లిపోయాడని ఎక్కడా చెప్పలేదు. తెలంగాణ సంచికలో మాత్రం ఈ వివరాలన్నీ ఉన్నాయి. కేసు నమోదైంది అక్కడే కావడంతో... ఇది అధికారిక సమాచారం అని భావించక తప్పదు. ఇదే ఏపీలో జరిగి ఉంటే... ‘పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు’ అని ఆరోపించే అవకాశముండేది. తెలంగాణ పోలీసులకు ఆ అవసరం ఏముంటుంది? వ్యక్తిగత, కుటుంబ కక్షలతో జరిగిన హత్యను తమకు అంటగట్టడంతో టీడీపీ తీవ్రంగా స్పందించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై చర్యలు తీసుకోవడంతో జగన్ పత్రిక గగ్గోలు పెడుతోంది!
గతం మరిచిపోయారా...
పోలీసులు తమపై కేసు పెట్టారని ఆక్రోశిస్తున్న జగన్ మీడియా... అంతకుముందు ఐదేళ్లు ఏం జరిగిందో మరిచిపోయినట్లుంది. ‘ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీశారు’ అంటూ ‘ఆంధ్రజ్యోతి’తోపాటు తనకు గిట్టని మీడియాపై జగన్ సర్కారు పదులకొద్దీ కేసులు పెట్టింది. అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి కడప జైలు వద్ద మరో అధికారిని తన కారులో తీసుకెళ్లారని ఉన్న విషయం ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసు పెట్టించింది. ఇక... సోషల్ మీడియా పోస్టులపై పెట్టిన కేసులకు లెక్కేలేదు. ఇప్పుడు... ఒక అడ్డగోలు వార్త రాసి, అడ్డంగా దొరికిపోయి... దీనిపై కేసు పెట్టగానే ‘పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు’ అంటూ వాపోవడం జగన్ మీడియాకే చెల్లింది.
For AndhraPradesh News And Telugu News