Amaravati : ‘రోడ్డు’ ఎక్కుతున్న ఉపాధి!
ABN, Publish Date - Aug 09 , 2024 | 05:44 AM
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గత ఐదేళ్లూ ఉపాధి హామీ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో కేంద్ర అధికారుల వద్ద మన అధికారులు తలవంచుకోవాల్సిన పరిస్థితి!
పథకానికి పూర్వ వైభవం దిశగా అడుగులు
ఐదేళ్లూ అడ్డదారులూ.. అడ్డగోలు పనులే
కేంద్రం ముందు తలదించుకున్న వైనం
దొంగ మస్టర్లతో అప్రతిష్ఠ..
రోడ్డు పనులు చేసిన ఇంజనీర్లకు వేధింపులు
కూటమి సర్కారు రాకతో మళ్లీ మహర్దశ
3 నెలల జీతం బకాయి 2,300 కోట్ల విడుదల
ఇంజనీర్లపై విజిలెన్స్ కేసుల రద్దు యోచన
పేదలకు వ్యక్తిగత ఆస్తుల కల్పనకు చర్యలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గత ఐదేళ్లూ ఉపాధి హామీ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో కేంద్ర అధికారుల వద్ద మన అధికారులు తలవంచుకోవాల్సిన పరిస్థితి! దొంగ మస్టర్లు వేసి లేబర్ కాంపోనెంట్ పెంచేందుకు చేసిన ప్రయత్నం బయటపడటంతో నిధుల విడుదలలో కేంద్రం అప్పట్లో విపరీతమైన తాత్సారం చేసేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమైంది. ఒకప్పుడు దేశంలోనే ఉత్తమంగా ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో
అమలైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులను తెచ్చుకునేందుకు కనిపిస్తున్న ఆశాదీపంలా ఈ పథకమే కనిపిస్తోంది. ఏటా రూ.10 వేల కోట్లకు పైగా రాష్ట్రానికి కేంద్ర వనరులు తీసుకొచ్చే అవకాశముంది. గతంలో చంద్రబాబు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా గ్రామీణప్రాంతాల్లో మెటీరియల్ నిధులతో శాశ్వత నిర్మాణాలు చేపట్టగలిగారు.
సిమెంట్‌రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో పార్కులు, రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకం, రైతులకు ఉచితంగా ఉద్యానవన పంటల ప్రోత్సాహం, కాలువులు, చెరువుల్లో పూడికతీత పనులు, చెక్‌డ్యాంలు, ఊటకుంటలు తదితర భూగర్భ జలాల పరిరక్షణ పనులతో పాటు వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు చెందిన వందల సంఖ్యలో పనులు నాడు చేపట్టారు.
వైసీపీ వచ్చిన తర్వాత అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా అది మిగిలిపోయింది. కొన్నిచోట్ల గ్రామ సచివాలయ భవనాలు తలపెట్టగా, అవి అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఉపాధి నిధులు సద్వినియోగం కాలేదు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ శాఖను పవన్ కల్యాణ్‌కు అప్పగించింది. మరోవైపు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం రాష్ట్రానికి బాగా కలిసివచ్చింది.
అధికారంలోకి రాగానే నిధుల విడుదల
ఉపాధి హామీ పథకం కూలీలు గత మూడు నెలలుగా వేతనాల బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంతో దీనిపై పవన్ కల్యాణ్ సంప్రదించి, పెండింగ్‌లో ఉన్న కూలీల వేతనాలు రూ.2300 కోట్ల నిధులను రాష్ట్రానికి అందేలా చూశారు. అవి బుధవారం విడుదలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఉపాధి పథకం ద్వారా విడుదల చేసే మెటీరియల్ నిధులను ప్రధానంగా సిమెంట్ రోడ్లకు వినియోగించుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. కూలీల వేతనాల పనులు 60 శాతం చేస్తే దానికి అనుగుణంగా మెటీరియల్ నిధులు 40శాతం కేంద్రం విడుదల చేస్తుంది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కూలీల ద్వారా సుమారు రూ.5180 కోట్ల విలువైన వేతనాల రూపంలో పనులు చేపట్టారు. దానికి అనుగుణంగా సుమారు రూ.2 వేల కోట్లకు పైగా మెటీరియల్ నిధులను కేంద్రం విడుదల చేయనుంది. వాటికి అదనంగా మరికొన్ని నిధులు రాబట్టి సిమెంట్ రోడ్లు నిర్మించాలని భావిస్తోంది. గత ఐదేళ్లలో పాడైన రోడ్లను పునర్నిర్మించాలని, అందుకు ఉపాధి హామీ మెటీరియల్ నిధులు వాడుకోవాలని కూటమి సర్కారు యోచిస్తోంది.
విజిలెన్స్ వేధింపులకు స్వస్తి
గత ప్రభుత్వం అంతకుముందు టీడీపీ హయాంలో వేసిన సిమెంట్‌రోడ్లపై పగబట్టింది. అప్పట్లో సిమెంట్‌రోడ్లు పనులు చేపట్టిన ఇంజనీర్లపై కక్షతో విజిలెన్స్ విచారణ చేయించింది. కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది.
ఈ ఇంజనీర్లపై ఉన్న విజిలెన్స్ కేసులను పునఃసమీక్షించాలని కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. గత ప్రభుత్వం పెట్టిన తప్పుడు విజిలెన్స్ కేసులను తొలగిస్తే తప్ప ప్రభుత్వంపై నమ్మకంతో మళ్లీ సిమెంట్‌రోడ్లు నిర్మించే పరిస్థితి ఉండదని చెబుతున్నారు.
కన్వర్జెన్స్ పనులపై దృష్టి...
పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత ఆస్తులను అభివృద్ధి చేసేందుకు ఉపాధి నిధులను వినియోగించాలని భావించినట్లు తెలిసింది. అందులోభాగంగా అన్ని జిల్లాల్లో మినీ గోకులాలు నిర్మించాలంటూ ఇప్పటికే పశుసంవర్థక శాఖ ఆదేశాలు ఇచ్చింది.
ఉపాధి పథకంలో గతంలో ఏ పనులు చేపట్టి ప్రజల మన్ననలు పొందారో ఆ పనులన్నీ మళ్లీ ప్రారంభించనున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఈ పథకం రాష్ట్రంలో అమలవుతున్న తీరును అధ్యయనం చేస్తున్నారు.
ఏ విధంగా చేస్తే పథకాన్ని సద్వినియోగమై ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనేది అధికారులతో చర్చిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ పథకంలో పనిచేసే ఉద్యోగులతో చర్చించి వారి ఇబ్బందులపై ఆరా తీశారు.
Updated Date - Aug 09 , 2024 | 05:44 AM