Amaravati : మధుసూదనరెడ్డి అక్రమాలకు అంతే లేదు!
ABN, Publish Date - Aug 20 , 2024 | 04:41 AM
రాష్ట్ర ఫైబర్‌నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎ్‌సఎ్‌ఫఎల్)లో మాజీ ఎండీ ఎం.మధుసూదనరెడ్డి అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తులు, కొంతమంది సిబ్బందితో కలసి ఆర్థిక అక్రమాలకు పాల్పడినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఫైబర్‌నెట్ మాజీ ఎండీపై సస్పెన్షన్ వేటు
దర్యాప్తు సీఐడీకి.. సీఎస్ ఉత్తర్వులు.. అమరావతి వీడొద్దని ఆదేశం
ప్రైవేటు వ్యక్తులు, సిబ్బందితో కలసి తీవ్ర ఆర్థిక అవకతవకలు
సహకరించిన గత, ప్రస్తుత ఉద్యోగులపైనా విచారణ
సస్పెన్షన్‌పై ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఫైబర్‌నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎ్‌సఎ్‌ఫఎల్)లో మాజీ ఎండీ ఎం.మధుసూదనరెడ్డి అంతులేని అక్రమాలకు పాల్పడ్డారని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తులు, కొంతమంది సిబ్బందితో కలసి ఆర్థిక అక్రమాలకు పాల్పడినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మధుసూదనరెడ్డిపై ప్రభుత్వం వేటు వేస్తున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఈ నెల 17వ తేదీనే (శనివారం) కథనం ప్రచురించింది. మధుసూదనరెడ్డి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపడతామని.. ఆయనకు సహకరించిన గత, ప్రస్తుత ఉద్యోగులూ విచారణ ఎదుర్కొంటారని సీఎస్ స్పష్టం చేశారు. 2008 ఐఆర్‌ఏఎస్ బ్యాచ్‌కు చెందిన మధుసూదనరెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. కొంతకాలం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా పనిచేశారు. ఆ సమయంలోనూ ఆయనపై నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి.
ఆ తర్వాత ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీగా నియమితులయ్యారు. ఇక అక్కడ పలు అక్రమాలకు.. ఆర్థికంగా నీతిబాహ్యమైన యాజమాన్య విధానాలకూ పాల్పడ్డారని.. ఇవి కార్పొరేషన్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయంటూ వివిధ సంఘాలు, సమూహాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని సీఎస్ తన ఉత్తర్వులో తెలిపారు. వాటిపై చేపట్టిన ప్రాథమిక విచారణలో.. ఆయన ఆర్థిక అక్రమాలకు సాక్ష్యాధారాలు లభించాయని వెల్లడించారు.
‘ప్రైవేటు వ్యక్తులు, పలువురు ఎస్‌ఎ్‌ఫఎల్ పూర్వ, ప్రస్తుత ఉద్యోగులతో కలసి మధుసూదనరెడ్డి సమాచారాన్ని తారుమారు చేసి ప్రభుత్వానికి అందజేస్తూ.. అక్రమాలు బయటకు రాకుండా సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం చేశారు. ఫైబర్‌నెట్ అక్రమాల్లో ఆయన ప్రమేయం ప్రత్యక్షంగా ఉందని కూడా తేలింది.
ఈ వ్యవహారంపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అందువల్ల మధుసూదనరెడ్డిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’ అని ప్రకటించారు. ఆయన కొందరు ఫైబర్‌నెట్ ఉద్యోగులతో కలసి అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని.. ఎండీగా పలువురు ప్రైవేటు వ్యక్తులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని.. వీరు అక్రమాలు బయటకు రాకుండా సాక్ష్యాలు చెరిపేశారని.. ఫైళ్లు మాయం చేశారని సీఎస్ పేర్కొన్నారు.
ఫైళ్లు, సాక్ష్యాల ధ్వంస రచన మధుసూదనరెడ్డి ప్రమేయంతోనే జరిగినట్లు గుర్తించామని.. మాజీ, ప్రస్తుత ఉద్యోగులపైనా సమగ్ర విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర సర్వీసు నిబంధనలు సబ్ రూల్(1)లోని 20ని అనుసరించి.. సబ్‌రూల్ 10 మేరకు మధుసూదనరెడ్డిని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సస్పెన్షన్ సమయంలో ముందస్తు అనుమతి లేకుంరాజధాని అమరావతిని విడిచి వెళ్లేందుకు వీల్లేదన్నారు.
మధుసూదనరెడ్డి డిప్యుటేషన్ పొడిగించండి..
ఫైబర్‌నెట్ ఎండీగా మధుసూదనరెడ్డి పాల్పడిన అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకోసం ఆయన రాష్ట్రంలోనే ఉండాలి. ఈ నెల 22వ తేదీతో ఆయన డిప్యుటేషన్ కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో డిప్యుటేషన్ కాలపరిమితిని మరో ఆరునెలలు పొడిగించాలంటూ కేంద్ర సిబ్బంది-శిక్షణ శాఖ (డీవోపీటీ)కి రాష్ట్రప్రభుత్వం లేఖ రాసింది. సహేతుక కారణాలతో డిప్యుటేషన్ పొడిగించాలంటూ రాష్ట్రం కోరితే.. కేంద్రం సహజంగానే ఆమోదిస్తుంది. కేంద్రం ఆమోదం లభించేలోగా.. సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని ప్రభుత్వం నిశ్చయించింది.
నాలుగేళ్లు చెలరేగిపోయారు!
మధుసూదనరెడ్డి ఫైబర్‌నెట్ సంస్థను సొంతజాగీరుగా చేసుకుని నాలుగేళ్లపాటు చెలరేగిపోయారు. గత సీఎం జగన్ 2020 మే 19న ఆయన్ను ఏరికోరి ఫైబర్‌నెట్ ఎండీగా నియమించారు. ఆయన ఫైబర్‌నెట్ కార్యాలయాన్ని బంధువులు, సన్నిహితులతో నింపేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సిఫారసు చేసిన వారందరికీ అర్హత లేకున్నా ఉద్యోగాలిచ్చారు. మధుసూదనరెడ్డి రాక ముందు నెలనెలా రూ.17 కోట్ల రాబడి వచ్చేది. అప్పట్లో కనెక్షన్‌కు నెలవారీ రూ.199 వసూలు చేశారు. మధుసూదనరెడ్డి అడుగుపెట్టాక.. రూ.599కు పెంచారు.
అయినా నెలసరి ఆదాయం 12 కోట్లు మాత్రమే వచ్చేది. ఆయనకు ముందు 9,70,000 కనెక్షన్లు ఉండేవి. గత నాలుగేళ్లలో ఏడున్నర లక్షలకు పడిపోయాయి. అందులోనూ.. నాలుగు లక్షలకే లెక్కలు చూపించారు.
మిగిలిన కనెక్షన్లను అధికారిక లెక్కల్లో చూపకుండా.. వసూలు చేసుకున్న డబ్బు జేబులో వేసుకున్నారు. మధుసూదనరెడ్డి బాధ్యతలు చేపట్టక ముందు ఫైబర్‌నెట్‌లో కోర్ స్టాఫ్ 120 మంది మాత్రమే ఉండేవారు. వారి జీతభత్యాల కోసం నెలకు రూ.40 లక్షల దాకా ఖర్చయ్యేది. కానీ ప్రస్తుతం 1,350 మంది ఉద్యోగులు ఉన్నారు. వారికి జీతభత్యాల కింద రూ.4.20 కోట్ల మేర చెల్లిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది వైసీపీ కార్యకర్తలేననే విమర్శలు ఉన్నాయి.
Updated Date - Aug 20 , 2024 | 04:42 AM