Amaravati : వైసీపీ వాళ్లకు ఇచ్చేద్దాం!
ABN, Publish Date - Aug 19 , 2024 | 04:06 AM
వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన ఉపాధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కూటమి సర్కారులోని కొంత మంది అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. హడావుడిగా బిల్లుల చెల్లింపునకు ఫైళ్లు సిద్ధం చేశారు.
పెండింగ్ బిల్లులపై అనుకూల అధికారుల హడావుడి
‘ఉపాధి’లో 100 కోట్లు చెల్లించేందుకు సిద్ధం
మరో రూ.234 కోట్ల కోసం ప్రతిపాదనలు
ఎన్నికలయ్యాక హడావుడిగా ఆ బిల్లుల అప్‌లోడ్
అప్పట్లో పూర్తిగా సహకరించిన అధికారులు
ఇప్పుడు సొమ్ము చెల్లింపులకూ కదిలిన ఫైళ్లు
పంచాయతీరాజ్, గ్రామీణ శాఖల్లో నాడు వైసీపీతో అంటకాగిన అధికారుల పనేనా!
గతంలో టీడీపీ కార్యకర్తలకు నానా తిప్పలు
కోర్టులకు వెళ్లినా బిల్లులివ్వని జగన్ సర్కారు
ఇప్పటికీ 21 శాతం బిల్లులు పెండింగులోనే
వాటిని వదిలేసి.. వైసీపీ వారికి అధికారుల మేళ్లు
తమకూ ఇవ్వాలంటున్న దేశం కార్యకర్తలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన ఉపాధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కూటమి సర్కారులోని కొంత మంది అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. హడావుడిగా బిల్లుల చెల్లింపునకు ఫైళ్లు సిద్ధం చేశారు. కానీ, గతంలో వైసీపీ సర్కారు.. 2014-19 మధ్య టీడీపీ కార్యకర్తలు చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా నానా తిప్పలు పెట్టిన విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయినట్టుంది. కోర్టుకు వెళ్లినా కనికరించకపోగా ఇప్పటికీ 21 శాతం మేరకు సొమ్ములు చెల్లించాల్సి ఉంది. దీంతో టీడీపీ కార్యకర్తలు తమకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు.
సరిగ్గా ఐదేళ్ల కిందట టీడీపీ అధికారం కోల్పోయి, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. 2014-19 మధ్య ఉపాధి హామీ పనులు చేసిన వారికి పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించకుండా నిలిపేశారు. అంతేకాదు అప్పటికే ప్రారంభమైన పనులను కూడా రద్దు చేశారు. అప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోర్టులకు వెళ్లిన వారికి సైతం సొమ్ములు చెల్లించేందుకు రెండేళ్లు పట్టింది. రెండేళ్ల తర్వాత కూడా 21 శాతం బిల్లులు పెండింగ్‌లో పెట్టారు.
అయితే, తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో చేసిన పనికి పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తోంది. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వరాదన్న నిబంధనలు పెట్టలేదు.
పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు అమలు చేస్తున్నారో? లేక కమిషనరేట్‌లో గతంలో పనిచేసిన అధికారులే ఉండటంతో వారికి బిల్లులు చెల్లించాలన్న అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో తెలియదు గాని ఎట్టకేలకు ఉపాధి బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ సర్కార్‌లో కార్యకర్తలు చేపట్టిన సచివాలయ, ఆర్బీకే భవనాల నిర్మాణంతో పాటు ఉపాధి నిధులతో చేపట్టిన పలు పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు సమాయిత్తం అయ్యారు.
గ్రామీణాభివృద్ధిశాఖ వద్ద కేవలం రూ.150 కోట్లే ఉండటంతో మరో రూ.200 కోట్లు ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తం రూ.334 కోట్ల పెండింగ్ ఉపాధి బిల్లులు చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలుత అందుబాటులో ఉన్న రూ.100 కోట్లు చెల్లించేందుకు అధికారులు ఇప్పటికే ఫైళ్లు సిద్ధం చేస్తున్నారు.
అధికారుల ప్రత్యేక శ్రద్ధ
వైసీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించేందుకు కొంత మంది అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో భారీ స్థాయిలో పనులేమీ జరగలేదు.
పనిచేసిన కొంత మంది కాంట్రాక్టర్లకు ఎన్నికలకు ముందు హడావుడిగా బిల్లులు చెల్లించిన అప్పటి సీఎం జగన్.. ఎన్నికల్లో వారి సేవలను వాడుకున్నారు. అయితే, ఎన్నికలకు ముందుగానే బిల్లులు సమర్పించినప్పటికీ ఇంకా రూ.334 కోట్ల మేరకు బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయో తెలియాల్సి ఉంది.
అయితే, ఎన్నికల తర్వాత కౌంటింగ్‌కు ముందు పలు పనులకు సంబంధించి హడావుడిగా బిల్లులు పెట్టినట్లు సమాచారం. ఆయా పనులు పూర్తికాకుండానే కొంత మంది బిల్లులు అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి కమిషనరేట్‌లోని కొంత మంది అధికారులు సహకరించారన్న వాదన వినిపిస్తోంది.
అప్పుడు-ఇప్పుడు: గతంలో టీడీపీ కార్యకర్తలు, అప్పట్లో సర్పంచ్‌లు చేసిన ఉపాధి పనులకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా చుక్కలు చూపించింది. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అచ్చంగా వైసీపీ కార్యకర్తలు చేపట్టిన ఉపాధి పనులకు బిల్లులు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అప్పట్లో టీడీపీ కార్యకర్తలు, సర్పంచ్‌లు చేపట్టిన సిమెంట్ రోడ్లకు బిల్లులివ్వకుండా ఆపేయడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో బిల్లులు ఇవ్వాలని కోర్టు ఆదేశించినా వైసీపీ ప్రభుత్వం రెండేళ్లపాటు బిల్లులు చెల్లించలేదు. దీంతో వారంతా హైకోర్టులో ధిక్కరణ వ్యాజ్యాలు వేశారు.
మరోవైపు బిల్లుల చెల్లింపును మరింత జాప్యం చేసేందుకు ఆయా పనులపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టారు. అప్పటికే ఆ పనులు పూర్తయి మూడేళ్లవుతున్నా.. మళ్లీ విజిలెన్స్ తనిఖీలు చేపట్టి అటు ఇంజనీర్లను, ఇటు కాంట్రాక్టర్లను బెంబేలెత్తేలా చేశారు. దీంతో కొంత మంది మాజీ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు బిల్లులు రాక, వడ్డీల భారం పెరిగిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అప్పట్లో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులు ఇప్పుడు వైపీపీ కార్యకర్తలకు బిల్లులు చెల్లించడంలో అత్యుత్సాహం చూపిస్తున్నారు.
బిల్లులు ఎలాగైనా చెల్లించాల్సిందేనని, అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్లో వైసీపీ కార్యకర్తలకు హడావుడిగా అంత మేర బిల్లులు ఎందుకు చెల్లించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్లాంటేషన్‌కు సంబంధించి రైతులకు చెల్లించాల్సినవి కొన్ని తొలి ప్రాధాన్యంగా చెల్లించవచ్చని.. కానీ సచివాలయ భవనాలు, ఇతర రోడ్లుకు సంబంధించిన బిల్లులు అంత అత్యవసరంగా చెల్లించే అవసరం లేకపోయినా ఆ బిల్లులు చెల్లించేందుకు కొంత మంది అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం.
నాటి బిల్లులకు మోక్షమేదీ?
ఎన్నికల తర్వాత ఆదరాబాదరాగా బిల్లులు పెట్టి అప్‌లోడ్ చేసిన వైసీపీ కార్యకర్తలకు చెల్లించేందుకు ఉత్సాహం చూపిస్తున్న అధికారులు.. గత టీడీపీ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన 21 శాతం సొమ్ములను ఇచ్చేందుకు ప్రయత్నించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
అప్పట్లో టీడీపీ కార్యకర్తలు చేసిన పనులకు 21 శాతం బిల్లులివ్వకుండా ఆపేశారు. ఆయా పనులపై విజిలెన్స్ తనిఖీ చేయిస్తున్నామని, పూర్తయిన తర్వాత మిగిలిన 21 శాతం సొమ్ము చెల్లిస్తామని అధికారులు కోర్టుకు తెలిపారు.
అయితే.. విజిలెన్స్ విచారణ పూర్తయినా బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చాక కూడా సదరు బిల్లులను చెల్లించాలన్న ఆలోచన కమిషనరేట్ అధికారుల్లో కనిపించడం లేదు. గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌కుమార్‌ను ఎన్నికలకు ముందు నియమించారు. అయితే, కూటమి ప్రభుత్వంలోనూ ఆయననే కొనసాగిస్తున్నారు. కమిషనర్‌గా కేరళ నుంచి వచ్చిన కృష్ణ తేజ నియమితులయ్యారు.
కమిషనరేట్‌లో మిగతా అధికారులందరూ గతంలో పనిచేసిన వారే. ఈ పనులకు సంబంధించి ఏం జరిగిందో వాస్తవాలు కమిషనరేట్‌లో కొద్ది మందికే తెలుసు. గత ఐదేళ్లలో అక్కడ వైసీపీ నేతలకు అంటకాగిన అధికారులే ఎక్కువ మంది ఉన్నారు.
కొంత మంది అప్పట్లో వైసీపీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన శాఖల్లో రాజకీయ జోక్యం ఉండదని చెప్పడంతో వారు సంతోషపడిపోయారు. తమ సీటు పదిలంగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే బిల్లుల చెల్లింపుల్లో ఉన్నతాధికారులను మభ్యపెట్టి వైసీపీ కార్యకర్తలకు చెల్లించేందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు.
Updated Date - Aug 19 , 2024 | 04:06 AM