ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP WIN : సైకిల్‌ సునామీ

ABN, Publish Date - Jun 04 , 2024 | 11:50 PM

సైకిల్‌ కూటమి సునామీలో అనంతలో అధికార పార్టీ గల్లంతైంది. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకీ సాధ్యం కాని తిరుగులేని, చారిత్రక విజయాన్ని టీడీపీ కూటమి సొంతం చేసుకుంది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ ఖాతాలో వేసుకున్నాయి. ఒక దశలో గుంతకల్లు, ధర్మవరం, కదిరి, మడకశిర నియోజకవర్గాలలో ఒకటో రెండో వైసీపీ ఖాతాలోకి వెళుతున్నట్లు కనిపించాయి. కానీ అలాంటి అవకాశాన్ని ఓటర్లు ఏమాత్రం ఇవ్వలేదు. గంపగుత్తగా చంద్రన్నకు కానుకగా ఇచ్చేశారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 12 స్థానాలను టీడీపీ గెలిచింది. 1994లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో ఒక్క తాడిపత్రి మినహా 13 అసెంబ్లీ స్థానాలను టీడీపీ, వామపక్ష కూటమి గెలిచింది. ఈ రికార్డులన్నింటినీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాయి. ...

TDP and Jana Sena fans are buzzing in Ramnagar

ఉమ్మడి జిల్లాలో ఊడ్చేసిన కూటమి

13 స్థానాల్లో టీడీపీ.. ఒకచోట బీజేపీ జయభేరి

ఊహల్లో తేలిన వైసీపీకి చారిత్రక పరాజయం

రాప్తాడులో పరిటాల సునీత రెండోసారి విజయం

ఉరవకొండ సెంటిమెంట్‌ను బద్దలుకొట్టిన కేశవ్‌

దుర్గంలో సత్తా చాటుకున్న మాజీ మంత్రి కాలవ

గుమ్మనూరును అక్కున చేర్చుకున్న గుంతకల్లు

కళ్యాణదుర్గంలో అమిలినేని తిరుగులేని విజయం

శింగనమలలో ఊహించినట్లుగానే శ్రావణి విజయం

తాడిపత్రిలో జేసీ వారసుడు అశ్మిత ఘన విజయం

అనంతలో పసుపు జెండా పాతిన దగ్గుపాటి ప్రసాద్‌

సైకిల్‌ కూటమి సునామీలో అనంతలో అధికార పార్టీ గల్లంతైంది. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకీ సాధ్యం కాని తిరుగులేని, చారిత్రక విజయాన్ని టీడీపీ కూటమి సొంతం చేసుకుంది. మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ ఖాతాలో వేసుకున్నాయి. ఒక దశలో గుంతకల్లు, ధర్మవరం, కదిరి, మడకశిర నియోజకవర్గాలలో ఒకటో రెండో వైసీపీ ఖాతాలోకి వెళుతున్నట్లు కనిపించాయి. కానీ అలాంటి అవకాశాన్ని ఓటర్లు ఏమాత్రం ఇవ్వలేదు. గంపగుత్తగా చంద్రన్నకు కానుకగా ఇచ్చేశారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 12 స్థానాలను టీడీపీ గెలిచింది. 1994లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో ఒక్క తాడిపత్రి మినహా 13 అసెంబ్లీ స్థానాలను టీడీపీ, వామపక్ష కూటమి గెలిచింది. ఈ రికార్డులన్నింటినీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాయి.


అన్నీ సైకిల్‌ ఖాతాలోనే..

- రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత రెండో విజయాన్ని నమోదు చేసుకున్నారు. మెజార్టీ మాత్రం భారీగా సాధించారు. రెండుసార్లూ వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ రెడ్డిని ఓడించారు.

- అనంతపురం అర్బనలో కొత్తగా బరిలో దిగిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ ఘన విజయం సాధించారు. అనూహ్యంగా తెరపైకి వచ్చినా.. తిరుగులేని ఆధిక్యత సాధించారు. అనుభవజ్ఞుడైన అనంత వెంకటరామిరెడ్డిని ఓడించి సత్తా చాటుకున్నారు.

- ఉరవకొండలో పీఏసీ చైర్మన, సిటింగ్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఘన విజయం సాధించారు. ఎప్పుడూ ఉత్కంఠ రేపే ఇక్కడి ఫలితాలు ఈసారి ఏకపక్షంగా సాగాయి. ఉరవకొండలో గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదన్న మూఢ నమ్మకాన్ని నియోజకవర్గ ఓటర్లు బద్ధలుకొట్టి మరీ కేశవ్‌ను గెలిపించడం విశేషం.

- కర్నూలు జిల్లా ఆలూరు నుంచి వలస వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను గుంతకల్లు ఓటర్లు అక్కున చేర్చుకున్నారు. అనూహ్యంగా టీడీపీ టిక్కెట్‌ దక్కించుకున్న ఆయన.. చాలా తక్కువ సమయంలోనే ఇక్కడి ఓటర్లకు చేరువయ్యారు.

- కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కొత్తగా బరిలో దిగిన అమిలినేని సురేంద్రబాబు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకున్నారు. గెలిస్తే తాను ఏం చేస్తానో ప్రజలకు వివరిస్తూ.. ప్రచారంలో దూసుకుపోయిన ఆయనకు ఓటర్లు భారీ మెజార్టీని కానుకగా ఇచ్చారు.

- మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పట్టుబట్టి మరీ రాయదుర్గం టిక్కెట్‌ తెచ్చుకున్నారు. తాను అక్కడి ప్రజలకే సేవచేస్తానని పార్టీ అధినేతను ఒప్పించారు. మరోమారు ఘన విజయం సాధించారు.

- జేసీ ప్రభాకర్‌ రెడ్డి వారసుడిగా గత ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన అశ్మిత రెడ్డి ‘ఒక్క చాన్స’ గాలిలో ఓడిపోయారు. ఐదేళ్లపాటు అనేక ఇబ్బందులు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో తాడిపత్రి ప్రజలు తమ యువనాయకుడికి అండగా నిలిచి.. తొలిసారిగా అసెంబ్లీకి పంపుతున్నారు.


- ‘మీ ఆడబిడ్డను.. ఆదరించండి..’ అంటూ.. కాలికి బలపం కట్టుకుని తిరిగిన బండారు శ్రావణి శ్రీని శింగనమల ప్రజలు ఆశీర్వదించారు. తొలిసారి కాలం కలిసిరాకపోయినా, పార్టీ అధినేత ఆమెకు ఇంకో అవకాశం ఇచ్చారు. శ్రావణికి అన్ని వర్గాలు అండగా నిలిచి.. అసెంబ్లీలోకి దర్జాగా అడుగుపెట్టే అవకాశాన్ని ఇచ్చాయి.

పోటాపోటీగా మెజార్టీలు

అనంతపురం నగరంలోని జేఎనటీయూలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఏ క్షణానా వైసీపీ అభ్యర్థులకు కనీస ఊరట లభించలేదు. రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డిపై 23,329 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతపురం అర్బన అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డిపై 23,023 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపె ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఏకంగా 21,704 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాయదుర్గం నుంచి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మెట్టుగోవిందరెడ్డిపై 41,659 మెజార్టీని సాధించారు. జిల్లాలో ఇదే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. కళ్యాణదుర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ


అభ్యర్థి తలారి రంగయ్యపై 37,734 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాడిపత్రి నుంచి జేసీ అశ్మితరెడ్డి 27,731 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించారు. శింగనమలలో బండారు శ్రావణి శ్రీ వైసీపీ అభ్యర్థి వీరాంజినేయులుపై 8,788 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గుంతకల్లులో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీ అభ్యర్థి వై.వెంకటరామిరెడ్డిపై 6,826 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

కూటమికి 54.32 శాతం ఓట్లు

జిల్లాలో 20.18 లక్షల ఓటర్లు ఉన్నారు. మే 13న నిర్వహించిన పోలింగ్‌లో 16,36,648 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో టీడీపీ అభ్యర్థులకు 8,89,119 ఓట్లు, వైసీపీ అభ్యర్థులకు 6,98,325 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లల్లో 54.32 శాతం ఓట్లు టీడీపీ కూటమికి లభించాయి. వైసీపీ అభ్యర్థులకు 42.66 శాతం ఓట్లు దక్కాయి. మిగిలిన ఓట్లు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు, నోటాకు వెళ్లాయి.

బాబు విజనకు జై కొట్టిన ఓటర్లు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజనకే అనంత ఓటర్లు జై కొట్టారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధిని విస్మరించారు. బటన నొక్కుడుతోనే సరిపెట్టారు. ఈ పరిస్థితుల్లో కూటమి మెనిఫెస్టో అనంత ఓటర్లను ఆకట్టుకుంది. చంద్రబాబు అధికారం చేపడితేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మెజార్టీ ఓటర్లు భావించారు. దీంతో కూటమి అభ్యర్థులు భారీ విజయాలను నమోదు చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఏ గొడవా లేదు..!

ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్‌

అనంతపురం క్రైం, జూన 4: జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ సందర్భంగా హింస చెలరేగడంతో పోలీసులు మునుపెన్నడూ లేనంత భద్రత కల్పించారు. జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాలున్న జేఎన్టీయూ పరిసరాల్లోకి అనుమతి లేనిదే ఏ ఒక్కరూ వెళ్లలేనంత భద్రత ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా డీఐజీ షేముషి, ఎస్పీ గౌతమి శాలి చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్‌కు ముందు జిల్లా వ్యాప్తంగా వందలాది మందిపై రౌడీషీట్లు తెరిచారు. ఘర్షణలకు పాల్పడితే జైలుకు వెళ్లక తప్పదన్న హెచ్చరికలు జారీ చేశారు. వేలాది మందిని బైండోవర్‌ చేశారు. దీనికితోడు ఫలితాలు ఏకపక్షంగా రావడంతో వైసీపీ వర్గీయులు డీలా పడిపోయారు.

మీ సహకారానికి కృతజ్ఞతలు: కలెక్టర్‌

అనంతపురం టౌన, జూన 4: కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. జేఎనటీయూలోని కౌంటింగ్‌ కేంద్రంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నెలరోజులుగా కౌంటింగ్‌ పక్రియలో ఆర్వోలు, నోడల్‌ అధికారులు, ఏఆర్వోలు, సూపర్‌వైజర్లు, పోలీస్‌ అధికారులు ఎంతో శ్రమించారని అన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా అన్ని విధాలా సహకరించారని అన్నారు. అందరి సహకారం వల్లనే కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా ముగిసిందని అన్నారు.

నిశ్శబ్దం.. జయకేతనం..!

ఉదయం.. సాయంత్రం.. నగరంలో భిన్న వాతావరణం

అనంతపురం సిటీ, జూన 4: కౌంటింగ్‌ నేపథ్యంలో నగరంలో పోలీసు యంత్రాంగం మంగళవారం 144 సెక్షన విధించింది. దీంతో ప్రజలందరూ ఫలితాలను వీక్షిస్తూ ఇళ్లలోనే ఉండిపోయారు. దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషనలోనూ పెద్దగా ప్రయాణికులు కనిపించలేదు. ఆటోలు కూడా తిరగలేదు. నిత్యం వాహనాలు, జన సంచారంతో కిటకిటాలాడే బళ్ళారి బైపాస్‌, సప్తగిరి సర్కిల్‌, పాతూరు, సంఘమేశ్వర సర్కిల్‌, రాంనగర్‌, రుద్రంపేట బైపాస్‌.. ఇలా అన్ని ప్రాంతాలు బోసిపోయాయి. కానీ ఉదయం 11 గంటలు దాటాక వాతావరణం పూర్తిగా మారిపోయింది. టీడీపీ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల ఫలితాలు రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. ఎక్కడ చూసినా సందడి కనిపించింది. వైసీపీ వర్గీయులు మాత్రం నగరంలో ఎక్కడా కనిపించలేదు. శాంతిభద్రతల పరంగా ఎలాంటి సమస్య తలెత్తలేదు. దీంతో 144 సెక్షన అమలులో ఉన్నా.. ఆనందాన్ని పంచుకునేందుకు అక్కడక్కడ జనం కలుసుకున్నారు.


హోరెత్తిన నగరం..

టీడీపీ కూటమి ప్రభజనంతో కార్యాకర్తలు, అభిమానులు, నాయకులు, ప్రజలు సాయంత్రం పెద్దఎత్తున నగరంలోకి వచ్చి సందడి చేశారు. జనసేన, టీడీపీ కార్యర్తలు పార్టీ జెండాలతో బైకులపై తిరుగుతూ నినాదాలు చేశారు. మరికొందరు తమ తమ కాలనీల్లో టపాసులు పేల్చి సంబరాలు చేశారు. మహిళలు సైతం చిందులు వేశారు.

అభ్యర్థుల ఇంట సందడే సందడి..

టీడీపీ కూటమికి భారీ విజయం దక్కడంతో నగరంలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల వద్ద సందడి కనిపించింది. పరిటాల సునీత, దగ్గుపాటి ప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌, అమిలినేని సురేంద్రబాబు ఇళ్ల వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. యువకులు బైకులతో హోరెత్తించారు. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. అభ్యర్థులను అభినందించేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు.

వైసీపీలో నైరాశ్యం

పార్టీ జిల్లా కార్యాలయానికి కంచె

అనంతపురం క్రైం, జూన 4: సైకిల్‌ సృష్టించిన సునామీకి వైసీపీ కుదేలైంది. ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటూ రాకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు కిక్కురుమనలేదు. అధికార పార్టీ అభ్యర్థులు ఈ పరిణామాలను ఊహించలేకపోయారు. టీడీపీ ప్రభంజనాన్ని చూసి నాయకులు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. గట్టి పోటీ తప్పదని భావించామని, కానీ ఈ స్థాయిలో ఉంటుందని అనుకోలేదని అంటున్నారు. పోలింగ్‌ కేంద్రం నుంచి మాజీ మంత్రి ఉష శ్రీచరణ్‌ 11 గంటలకే వెళ్లిపోయారు. అనంతపురం నగరంలోని రెండో రోడ్డులో ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయంలో నిశ్శబ్దం రాజ్యమేలింది. కార్యాలయానికి తాళం వేశారు. ఎవరైనా దాడి చేస్తారనే ఉద్దేశంతో పోలీసులకు చెప్పి అక్కడ ఇనుప కంచె వేయించారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 04 , 2024 | 11:50 PM

Advertising
Advertising