Share News

Two PDs : అవినీతి గాథలు వినండహో..!

ABN , Publish Date - Jun 26 , 2024 | 12:10 AM

ఓ ఇద్దరు అధికారులు వైసీపీ పాలనలో చెలరేగిపోయారు. ఇష్టానుసారంగా నిధులు దుర్వినియోగం చేశారు. ఐదేళ్లలో అడిగేవారు లేకపోవడంతో అధికార దుర్వినియోగం, రూ.కోట్లలో నిధుల స్వాహా పర్వం సాగింది. వైసీపీ నేతల అండదండలు, ఉన్నతాధికారుల ఆశీస్సులు ఉండటంతో ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేసి విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ అధికారుల కంటే వైసీపీ కార్యకర్తల్లా పని చేశారనే ఆరోపణులు వెల్లువెత్తాయి. వైసీపీ నేతల సిఫారసులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అవినీతి, అక్రమాల సొమ్ముల్లోనూ వారికి వాటాలు ...

 Two PDs : అవినీతి గాథలు వినండహో..!
Office of Dwama

అధికారమే అండగా చెలరేగిన ఇద్దరు పీడీలు

డీఆర్‌డీఏ, డ్వామాలో రూ.కోట్ల దుర్వినియోగం

వైసీపీ కార్యాలయాలుగా మార్చిన అధికారులు

ఎన్నికల విధులకు ఆ ఇద్దరిని దూరంపెట్టిన ఈసీ

బదిలీనా..వేటా? జోరుగా సాగుతున్న చర్చ

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 25: ఓ ఇద్దరు అధికారులు వైసీపీ పాలనలో చెలరేగిపోయారు. ఇష్టానుసారంగా నిధులు దుర్వినియోగం చేశారు. ఐదేళ్లలో అడిగేవారు లేకపోవడంతో అధికార దుర్వినియోగం, రూ.కోట్లలో నిధుల స్వాహా పర్వం సాగింది. వైసీపీ నేతల అండదండలు, ఉన్నతాధికారుల ఆశీస్సులు ఉండటంతో ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేసి విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ అధికారుల కంటే వైసీపీ కార్యకర్తల్లా పని చేశారనే ఆరోపణులు వెల్లువెత్తాయి. వైసీపీ నేతల సిఫారసులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అవినీతి, అక్రమాల సొమ్ముల్లోనూ వారికి వాటాలు పంచడం గమనార్హం. ఆ ఇద్దరు అధికారులే డీఆర్‌డీఏ-వైకేపీ, డ్వామాలలో పీడీలు. ఇటీవల రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో తమ అవినీతి, అక్రమాల బాగోతం బయటపడుతుందనే భయం వీరిని వెంటాడుతోంది. అందుకే తమ సొంత శాఖలకు వెళ్లిపోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


నిధుల దుర్వినియోగం

వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 సంవత్సరంలో డీఆర్‌డీఏ-వైకేపీ పీడీగా వచ్చిన పీడీ నరసింహారెడ్డి కేవలం ఎంపీడీఓ. అంటే ఆయన స్థాయి ఒక మండల అధికారి. ఒక మండల అధికారిగా వచ్చిన ఆయన జిల్లా స్థాయిలో అధికారపార్టీ నేతల అండదండలతో పాతుకుపో యారు. పీడీగా వచ్చిన కొత్తలో కరోనా సమయంలో ప్రజలకు మాస్కులు పంపిణీ బాధ్యత అప్పగించారు. దీంతో మాస్కుల పంపిణీ ముసుగులో సుమారు రూ.1.5కోట్లు కాజేశారనే ఆరోపణులు వినిపించాయి. ఆ తరువాత 75ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలకు గాను 2022లో జాతీయ జెండాల పేరుతో సుమారు రూ.15లక్షలు తన సొంత ఖజానాలోకి వేసుకున్నారు. ఇక తరువాత వైసీపీ నేతలు చేసిన సిఫారసుల ప్రకారం అర్హతలేని సుమారు 20వేల మందికి పైగా పింఛన జాబితాలోకి ఎక్కించారు. పెరటికోళ్ల పెంపకం పేరుతో సుమా రు రూ.60లక్షలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు నోటు పుస్తకాలు పేరుతో రూ.30లక్షలు స్వాహా చేశారు. ఇక మహిళా మార్టులు ఏర్పాటు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా మహిళల నుంచి రూ.100చొప్పున వసూలు చేశారు. కేవలం నార్పలలో మహిళా మార్టు ఏర్పాటు చేసి సుమారు రూ.30లక్షలు వరకు కాజేశారు. రాప్తాడు నియోజకవర్గంలో అమ్మ పాలడెయిరీ ఏర్పాటుకు అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డితో కలిసి మహిళా సంఘాల నుంచి రూ.1.5కోట్లు వసూలు చేశారు. ప్రశాంతి జిల్లా సమాఖ్య పరిధిలో నడుస్తున్న జనరిక్‌ మందుల షాపు నుంచి తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డికి అత్యంత వీరభక్తుడైన పశుసంవర్థకశాఖకు చెందిన డాక్టర్‌ తులసిరామిరెడ్డిని ఏపీడీ స్థాయికి తీసుకువచ్చి అక్రమంగా వసూళ్లు చేశారు. స్త్రీనిధిలో ఉన్న మహిళల సొమ్మును ప్రభుత్వ కార్యక్రమాలకు రూ.30కోట్ల వరకు వాడేసుకున్నారు. పీడీ అవినీతి, అక్రమాలకు కళ్యాణదుర్గం ఏరియా కోఆర్డినేటర్‌, ఫైనాన్స డీపీఎం, హెచఆర్‌ ఏపీఎంతో పాటు మరికొంతమంది డీపీఎంలు, ఏసీలు, ఏపీఎంలు పూర్తి స్థాయిలో సహకరిస్తూవచ్చారు. ఇక మహిళా యానిమేటర్లతో అసభ్యకరంగా ప్రవర్తించిన అప్పటి విడపనకల్లు ఏపీఎంను వైసీపీ నేతల ఒత్తిళ్ల మేరకు వెనకేసుకువచ్చారు. వైసీపీలో నేతలకు ఎన్నికల్లో ప్రచారం చేసిన ఉద్యోగులకు పని లేకుండా కూర్చోబెట్టి వేతనాలు చెల్లించారు. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ఇక జాబ్‌సెక్షనకు సంబంధించిన కారును తమ ఇంటి సభ్యుల కార్యకలాపాలకు వాడుకోవడం, ఆఫీస్‌ అటెండర్లను తమ ఇంటి పనులకు వాడుకోవడం పుష్కలంగా జరిగిపోయాయి. ఇటీవల ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న


సమయంలో ఉద్యోగుల బదిలీల పేరుతో సుమారు రూ.20లక్షల వరకు వసూళ్లు చేసినట్లు తెలిసింది. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో లోతుగా విచారణ చేపడితే మరిన్ని అవినీతి, అక్రమాలు బయటపడే పరిస్థితులు ఉన్నాయి.

సిఫారసులకే ప్రాధాన్యం

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో డ్వామాలో విచ్చలవిడిగా నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌ జలకళ పథకంలో వేయని బోర్లకు రూ.10కోట్లకు పైగా నిధులు స్వాహా చేశారు. ఉపాధి హామీ పథకంలో బోగస్‌ మస్టర్లతో సుమారు రూ.30కోట్ల వరకు కూలీల బిల్లులను మెక్కేశారు. సామాజిక తనిఖీల పేరుతో ఓపెన ఫోరం ద్వారా, విజిలెన్స విభాగం ద్వారా రూ.5కోట్ల వరకు అధికారులు తమ జేబుల్లోకి వేసుకున్నారు. ఉదాహరణ...ముదిగుబ్బ మండలంలో ఉపాధి హామీ పథకంలో రూ.22 లక్షలు నిధులు దుర్వినియోగమైనప్పటికీ విజిలెన్స అధికారులు క్లీనచిట్‌ ఇచ్చి సిబ్బందిని కొనసాగించారు. బోగస్‌ మస్టర్లలో ఉపాధి హామీ సిబ్బంది, వైసీపీ నేతలు స్వాహా చేసిన నిధులను వాటాలుగా పంచుకోవడం గమనార్హం. ఇక బదిలీల విషయంలో టీఏ, ఈసీ, ఏపీఓ, ఏఈ, ఏపీడీల వరకు ఆయా స్థాయిలలో ముడుపులు పుచ్చుకోవడం పరిపాటిగా మార్చారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో తమకు అనుకూల ఉద్యోగులను బదిలీ చేసినట్లు సమాచారం. అయితే కొత్త అధికారులు ప్రక్షాళన చేయడంపైనే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

దీర్ఘకాలం ఒకే స్థానంలో....

ఆయన డీఆర్‌డీఏ-వైకేపీ పీడీగా 2019 సెప్టెంబరు 9న జిల్లాకు వచ్చారు. అంటే నాలుగు సంవత్సరాల 10 నెలలు కాలం పూర్తి కావస్తోంది. సీనియర్‌ అధికారులను సైతం పక్కనపెట్టి కేవలం వైసీపీ భజన, అప్పటి జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా కావడం, అదే సామాజికవర్గం కావడంతో హౌసింగ్‌ పీడీగా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. అంతేగాక బదిలీ చేయకుండా ఇక్కడే


ఉంచారు. డ్వామా పీడీ 2020 సెప్టెంబరు 14న జిల్లాకు వచ్చారు. అంటే మూడున్నర సంవత్సరాలు (మూడు సంవత్సరాల 10 నెలలు కావస్తోంది). అయినా ఇక్కడ నుంచి కదిలించలేకపోయారు. ఎందు కంటే ఈ ఇద్దరు అధికారులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే... మరీ ముఖ్యంగా అప్పటి జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత ప్రీతిపాత్రులు కావడం, ఆయన సిఫారసుతోనే ఇక్కడ పార్టీకి మైలేజ్‌ పెంచేందుకు పనిచేస్తుండటం గమనార్హం. ఇక ఈ ఇద్దరి అధికారులకు అదే సామాజికవర్గానికి చెందిన ఓ కలెక్టర్‌ పుష్కలంగా సహకారం అందించిన సంగతి తెలిసిందే. ఇక ఆ కలెక్టర్‌పై ఎన్నికల కమిషన బదిలీవేటు వేసింది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి అధికారులను కూడా ఎన్నికల విధులకు దూరం పెట్టింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేస్తారా లేక వారిపై వేటు వేస్తారా అన్న చర్చ ఆయా కార్యాలయాల్లో జరుగుతోంది.

డీఆర్‌డీఏ పీడీగా ఈశ్వరయ్య

వైసీపీ విధేయుడిగా ఆరోపణలున్న డీఆర్‌డీఏ-వైకేపీ పీడీ నరసింహారెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన విషయం తెల్సిందే. దీంతో ఏపీడీగా ఉన్న ఈశ్వరయ్యను పీడీగా నియమించి.. పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పీడీగా పనిచేసిన నరసింహారెడ్డిపై అనేక అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - Jun 26 , 2024 | 12:10 AM