Share News

అన్నదాత భార్య ఆత్మహత్య

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:11 AM

సేద్యపు అప్పులు రైతు భార్యను బలిగొన్నాయి. అప్పులవారు ఇంటిమీదకు రావడంతో అవమాన భారంతో సాకే జయలక్ష్మి(43) పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

అన్నదాత భార్య ఆత్మహత్య
JAYALAKSHMI(FILE)

నిలదీసిన రుణదాతలు

అవమానంతో పురుగు మందు తాగిన జయలక్ష్మి

శింగనమల, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): సేద్యపు అప్పులు రైతు భార్యను బలిగొన్నాయి. అప్పులవారు ఇంటిమీదకు రావడంతో అవమాన భారంతో సాకే జయలక్ష్మి(43) పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాయనవారిపల్లి గ్రామానికి చెందిన సాకే పుల్లయ్య, జయలక్ష్మి దపంతులు వ్యవసాయదారులు. వీరికి పది ఎకరాల పొలం ఉంది. మరికొంత భూమిని కౌలుకు తీసుకుని, దానిమ్మ, ఇతర పంటలను సాగు చేశారు. ఐదేళ్ల నుంచి దిగుబడులు సరిగా రాలేదు. దీనికితోడు బోరుబావులు ఎండిపోయాయి. పంటలను కాపాడుకునేందుకు 15 బోరు బావులను తవ్వించారు. ఈ క్రమంలో పుల్లయ్య ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.25 లక్షల వరకూ అప్పు చేశారు. పంటలు సరిగా పండక పోవడంతో సకాలంలో తీర్చలేకపోయారు. రుణదాతలు శుక్రవారం పుల్లయ్య ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన లేకపోవడంతో భార్య జయలక్ష్మిపై ఒత్తిడి చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు గమనించి, శింగనమల ఆసుప్రతికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందారు. శింగనమల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:11 AM