‘టెన్’షన్ పడొద్దు!
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:34 AM
తూర్పుగోదావరి జిల్లాలో 134 పరీక్షా కేంద్రాలలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.

25,723 మంది విద్యార్థులు
134 కేంద్రాలు ఏర్పాటు
రాజమహేంద్రవరం/సిటీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లాలో 134 పరీక్షా కేంద్రాలలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.ఈ మేరకు ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి మార్చి 31 లేదా ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో పది పరీక్షలకు 25,723 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.రెగ్యులర్ విద్యార్థులు 24,763 మందికి బాలురు 12791 మంది, బాలికలు 11972 మంది, ప్రైవేటు విద్యార్థులు 960 మంది అందులో బాలురు 591 మంది, బాలికలు 369 మంది ఉన్నారని తెలిపారు. ఈ పరీక్షలు నిర్వహణకు 1100 మంది ఇన్విజిలేటర్లు నియమించినట్టు తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పీరీక్షా కేంద్రాల కు సమీపంలో జీరాక్స్ సెంటర్లు ఉంటే వాటిని మూసివేయించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఇద్దరు ఏఎన్‌ఎంలతో మెడికల్ క్యాం ప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షాకేంద్రాలలో విద్యార్దుల సంఖ్య అధారంగా పోలీసు భద్రత ,ప్రిస్కింగ్ కోసం మహిళ పోలీసు సిబ్బందిని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా వుండేలా విద్యుత్ శాఖ అఽధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలు వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసివుండాలన్నారు. పరీక్షా కేంద్రాలు వుండే పరిధిని బట్టి పంచాయితి, మునిసిపాలిటి శాఖల అధికారులు కేంద్రాల్లో తాగునీరు. శానిటేషన్ కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో జవాబు పత్రాలను స్పీడ్ పోస్టు ద్వారా పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేశామన్నా రు. జిల్ల్లా రవాణాశాఖ ద్వారా ప్రశ్నా జవాబు పత్రాల రవాణా చేసేందుకు అవసరమైన క్లోస్డ్ వాహనాలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంచాలని, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి ముందస్తుగా ఇండెంట్ పెట్టారని చెప్పారు. ప్రశాంతంగా పది పరీక్షలు జరిగేందుకు శాఖల మద్య సమన్వయం ఉండాలని ఆదేశించారు.
సమస్య ఉంటే డయల్ 72074 34999
పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై కలెక్టర్ ప్రశాంతి ఇప్పటికే పలు మార్లు సమీక్షలు చేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించ డంపై సూచనలు చేశారు. తాగునీరు, అత్యవసర మందులు పరీక్ష కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు. కంట్రోరూ మ్‌లను ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్, పోలీస్ బందో బ స్తు ఉంటుంది.ఇక ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి మార్కు లతో ఉత్తీర్ణులు కావడమే విద్యార్థుల వంతు. విద్యార్థులకు, పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తక్షణమే పరిష్క రించడానికి 7207434999 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.జిల్లాలో కడియపులంక,నల్లజర్ల మండలం పోతవరం, రాజుపాలెం,ధవళేశ్వరం జడ్పీ, కొవ్వూరు ప్రభుత్వ, భూప తిపా లెం ఏపీ రెసిడెన్షియల్ హైస్కూల్స్‌ని సమస్యాత్మక కేంద్రా లుగా గుర్తించి అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్దా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. వదంతులను వ్యాప్తి చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయా జిల్లాల ఎస్పీ లు ఇప్పటికే హెచ్చరించారు.హాల్ టికెట్లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టారు.వాటిని ప్రింట్ తీసుకొని నేరుగా పరీక్షకు హాజరుకావొచ్చు. కట్టుదిట్టంగా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ టైమ్ టేబుల్
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. 17న ప్రథమ భాష, 19న ద్వితీయ భాష, 21న ఆంగ్లం, 24న లెక్కలు, 26న భౌతిక శాస్త్రం, 28న బయాలజీ, 31న సాంఘిక శాస్త్రం.