Singanamala Hospital : పొద్దున వస్తేనే వైద్యం...!
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:13 AM
శింగనమల మండలకేంద్రంలోని కమ్యూనిటీ ఆస్పత్రిలో వైద్యులు సక్రమంగా ఉండకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 30 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ఉదయం పూట మాత్రమే డాక్టర్లు ఉంటున్నారు. మధ్యాహ్నం దాటిందంటే నర్సులే దిక్కు. ఇక రాత్రి సమయంలో ఏ రోగమని వచ్చినా అనంతపురం వెళ్లండి అని అక్కడు న్న...
మధ్యాహ్నం దాటితే అందుబాటులో ఉండని వైద్యులు
రాత్రి పూట ఏ సమస్య వచ్చినా జిల్లాకేంద్రానికి రెఫర్
అరకొర మందులు ఇస్తున్న నర్సులు
శింగనమల కమ్యూనిటీ ఆస్పత్రి పనితీరుపై విమర్శలు
శింగనమల మండలకేంద్రంలోని కమ్యూనిటీ ఆస్పత్రిలో వైద్యులు సక్రమంగా ఉండకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 30 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ఉదయం పూట మాత్రమే డాక్టర్లు ఉంటున్నారు. మధ్యాహ్నం దాటిందంటే నర్సులే దిక్కు. ఇక రాత్రి సమయంలో ఏ రోగమని వచ్చినా అనంతపురం వెళ్లండి అని అక్కడు న్న సిబ్బంది ఉచిత సలహా ఇస్తారు. ఇది పేరుకే 24 గంటల ఆస్పత్రి అని, వైద్యులు ఉండకపోతే ఏమి ప్రయోజనమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - ఆంధ్రజ్యోతి, శింగనమల
ఓపీ 200పైనే...
ఈ ఆస్పత్రికి రోజు దాదాపు 200 మంది రోగులు వస్తున్నట్లు ఓపీ రికార్డులు చెబుతున్నాయి. సీజనల్ వ్యాధుల కాలంలో ఇది 300కు పైగానే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఆస్పత్రిలో ఉదయం పూట నలుగురైదుగురు వైద్యులు అందుబాటులో ఉంటారు. మధ్నాహ్నం దాటితే ఒక్కరూ ఉండరు. దీంతో మధ్యాహ్నం తరువాత వచ్చే రోగులకు డ్యూటీలో ఉన్న నర్సు చికిత్స చేయాల్సిందే. ఏదైనా అత్యవసర కేసులు వస్తే అనంతపురం రెఫర్ చేసి పంపుతారు. రాత్రి సమయంలో కనీసం సూది మందు కూడా అందుబాటులో ఉండదని, మాత్రలు కూడా తక్కువగానే ఇస్తారని పలువురు రోగులు చెబుతున్నారు.
రాత్రి పూట డాక్టర్ ఉండాలి
రాత్రి సమయంలో అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే ఒక్క డాక్టర్ కూడా ఉండటం లేదు. ఒక నర్సు మాత్రమే ఉంటుంది. ఆమె ఏవో కొన్ని మాత్రలు మాత్రమే ఇస్తారు. చిన్న సమస్యతో వెళ్లినా అనంతపురం పొమ్మంటారు. ఆస్పత్రిలో రాత్రి పూట డాక్టర్ అందుబాటులో ఉంటే సమస్య తీరుతుంది.
- బోయ నరేష్
ఆన కాల్ డ్యూటీ మాత్రమే ఉంది
ఈ ఆస్పత్రిలో రాత్రి సమయంలో వైద్యులకు ఆన కాల్ డ్యూటీ మాత్రమే ఉంది. ఆసుపత్రి నుంచి రోగులకు ఎమర్జెన్సీ ఉంటే అక్కడ సిబ్బంది ఫోన ద్యారా సమాచారం ఇస్తారు. దీంతో డాక్టర్లు అక్కడికి వెళ్లి చికిత్స అందిస్తారు. ఆస్పత్రిలో ఎలాంటి మందుల కొరత లేదు. రాత్రి సమయంలో కూడా అవసరమైన మాత్రలు, ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి.
- డాక్టర్ ప్రవీణ్‌కుమార్
మాత్రల కొరత
రాత్రి సమయంలో రోగులు చికిత్స కోసం వస్తే అరకొరగా మాత్రలు ఇచ్చి పంపుతున్నారు. కొన్ని సమయంలో అర్ధ మాత్రే ఇస్తున్నారు. రాత్రి సమయంలో అవసరమైన సూది మందులు, మాత్రలు అందుబాటులో ఉంచాలి. వైద్యులు 24 గంటు ఆసుపత్రిలో ఉం డేలా స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి.
- ఎర్రిస్వామి
మరిన్ని అనంతపురం వార్తల కోసం..