EVETEASERS : బడిదావలో పోకిరీలు
ABN, Publish Date - Dec 21 , 2024 | 12:48 AM
ఇంటర్ చదువుతున్న ఓ బాలికకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు. ఉన్నట్లుండి కాలేజీ మాన్పించారు. పెళ్లి ఇష్టం లేదని, చదువుకుంటానని ఆమె చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో ఆ బాలిక డయల్ 100కు ఫోన చేసింది. అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మైనర్‌కు వివాహం చేయొద్దని, బాగా చదివించాలని సూచించింది. తమకూ చదివించాలనే ఉందని, కానీ కాలేజీకి వెళ్లొచ్చే సమయంలో తమ కూతురుకు ఇబ్బందులు ...
బాలికలకు భద్రత కరువు
చదువు మాన్పిస్తున్న తల్లిదండ్రులు..
బాల్య వివాహాల దిశగా అడుగులు
ఇంటర్ చదువుతున్న ఓ బాలికకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు. ఉన్నట్లుండి కాలేజీ మాన్పించారు. పెళ్లి ఇష్టం లేదని, చదువుకుంటానని ఆమె చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో ఆ బాలిక డయల్ 100కు ఫోన చేసింది. అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మైనర్‌కు వివాహం చేయొద్దని, బాగా చదివించాలని సూచించింది. తమకూ చదివించాలనే ఉందని, కానీ కాలేజీకి వెళ్లొచ్చే సమయంలో తమ కూతురుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు అధికారులతో అన్నారు. ఆకతాయిలు, తాగుబోతులు వెంటపడి వేధిస్తున్నారని, అందుకే కాలేజీ మాన్పించామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఇబ్బందులు లేకుండా చూస్తామని, ధైర్యంగా బాలికను కాలేజీకి పంపించాలని అధికారులు సూచించారు. ఇది యాడికి పట్టణంలో
ఇటీవల చోటు చేసుకున్న సంఘటన..! ఆ ఒక్క బాలికే కాదు.. చాలామంది ఆకతాయిల వేధింపులు తాళలేక చదువు మానేస్తున్నారు. యాడికి పట్టణంలోని కాలేజీలు, పాఠశాలల వద్ద ఆకతాయిల ఆగడాలు పెరిగిపోయాయి. బాలికల భద్రత ప్రశ్నార్థకంగా మారింది అనేందుకు అనేక సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
- ఆంధ్రజ్యోతి, యాడికి
కూడళ్లలో తిష్ట
యాడికి మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, హైస్కూల్, ఆదర్శ పాఠశాలకు సమీప గ్రామాలు, పట్టణం నుంచి అధిక సంఖ్యలో బాలికలు వస్తుంటారు. పట్టణంలోని కొందరు పోకిరీలు, తాగుబోతులు వారి వెంటపడి వేధిస్తున్నారు. కాలేజీకి, బడికి వెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో టార్గెట్ చేస్తున్నారు. కాలేజీ సమీపంలోని బస్టాప్, కోనరోడ్డు సర్కిల్, బస్టాండ్ సర్కిల్, పాత పోలీస్‌స్టేషన సర్కిల్, కమలపాడు సర్కిల్ వద్ద పోకిరీల బెడద ఎక్కువగా ఉంది. మరికొందరు యువకులు ఆదర్శ పాఠశాలకు వెళ్లే బస్సును బైక్‌లో ఫాలో అవుతున్నారు. వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఆకతాయిల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు కాలినడకన, సైకిళ్లు, ఆటోల్లో వెళ్లే బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి భద్రత ప్రశ్నార్థకం కావడంతో తల్లిదండ్రులు చదువు మాన్పిస్తున్నారు.
భద్రత ఎక్కడ..?
- యాడికి హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై కమలపాడు రోడ్డులో శ్మశాన వాటికవద్ద కొన్ని నెలల క్రితం ఇద్దరు యువకులు దాడి చేశారు. బాలికకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ విషయం గురించి బయటకు చెబితే తమ గౌరవం పోతుందని బాలిక తల్లిదండ్రులు మౌనంగా ఉండిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
- పాఠశాల నుంచి ఇంటికి కాలినడకన వెళుతున్న ఓ బాలికను కోనరోడ్డు సర్కిల్‌లో కొందరు యువకులు వేధించారు. సమాచారం అందుకున్న బాలిక తల్లిదండ్రులు అక్కడికి వెళ్లేసరికి ఆకతాయిలు పారిపోయారు.
- వీరన్నపల్లి గ్రామానికి చెందిన ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో తాగుబోతులు వెంటపడి వేధించారు. దీంతో తల్లిదండ్రులు చదువు మాన్పించారు. అధికారులు బాలికల ఇళ్ల వద్దకు వెళ్లి విచారించారు. తాగుబోతుల, ఆకతాయిల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, నిఘా పెట్టిస్తామని, బాలికల చదువు మాన్పించవద్దని చెప్పి వచ్చారు.
- ఆదర్శ పాఠశాలకు బాలికలతో వెళ్లే బస్సును కొందరు పోకిరీలు బైక్‌లలో వెంబడించారు. అడ ్డరోడ్డులో (యాడికి- రాయలచెరువు క్రాస్‌రోడ్డు) ఫాలో అవుతూ వెకిలి చేష్టలు చేశారు. విషయం తెలుసుకున్న కొందరు తల్లిదండ్రులు వారిపై నిఘా వేశారు. వెంటపడి పట్టుకుని దేహశుద్ధి చేసి వదిలిపెట్టారు.
పోలీసులు స్పందించాలి..
బాలికల చదువుకు, భద్రతకు అడ్డుగా మారిన పోకిరీలు, తాగుబోతులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధాన కూడళ్లలో ఉదయం, సాయంత్రం పోలీసులు నిఘా పెడితే ఆకతాయిలు దొరికిపోతారని అంటున్నారు. లేదంటే బాలికల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని, వారి భవిష్యత్తు నాశనమౌతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు చేపట్టాలి..
భద్రత లేకుంటే తల్లిదండ్రులు బాలికలను బడికి పంపలేరు. అందుకే ఆకతాయిల ఆగడాలపై పోలీసులు చర్యలు చేపట్టాలి. బాలికా విద్యను ప్రోత్సహించాలి. వేధింపులకు గురయ్యే వారు డయల్ 100, చైల్డ్‌లైన 1098కు ఫోన చేయాలి. గ్రామంలోని ఐసీడీఎస్ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చినా సమస్య పరిష్కారానికి కృషిచేస్తారు. - మహాలక్ష్మి, అంగనవాడీ వర్కర్, యాడికి
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 21 , 2024 | 12:48 AM