POSTAL BALLOT VOTING : పోస్టల్ ఓటింగ్ గందరగోళం
ABN, Publish Date - May 04 , 2024 | 12:31 AM
ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు దూరంగా ఉంచాలని అధికార పార్టీ ప్రయత్నించింది. దరఖాస్తుల మొదలు ఓటింగ్ వరకూ గందరగోళం కనిపిస్తోంది. ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు వచ్చాయి. అధికారులు స్పందించి.. ఫారం-12 స్వీకరణలో సమస్యలను కొంతవరకూ సరిదిద్దారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 23,532 మంది పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేశారు. వీరందరికీ శుక్రవారం నుంచి ఈ నెల 6వతేదీ ...
ఎంపీ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు ఆలస్యం
రాప్తాడులో సాయంత్రానికి ఓటింగ్ ప్రారంభం
అధికారుల తీరుపై పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల ఆగ్రహం
రాయదుర్గంలో మధ్యాహ్నం తరువాత పోలింగ్
ఎన్నికల అధికారుల మధ్య కనిపించని సమన్వయం
అనంతపురం టౌన/రాప్తాడు/రాయదుర్గం, మే 3: ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు దూరంగా ఉంచాలని అధికార పార్టీ ప్రయత్నించింది. దరఖాస్తుల మొదలు ఓటింగ్ వరకూ గందరగోళం కనిపిస్తోంది. ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు వచ్చాయి. అధికారులు స్పందించి.. ఫారం-12 స్వీకరణలో సమస్యలను కొంతవరకూ సరిదిద్దారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 23,532 మంది పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేశారు. వీరందరికీ శుక్రవారం నుంచి ఈ నెల 6వతేదీ వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రతి నియోజకవర్గంలో ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
తొలిరోజే అస్తవ్యస్తం
ఫెసిలిటీ కేంద్రాల్లో పోస్టల్ ఓటింగ్‌కు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయలేదు. ఎన్నికల నిబంధనల మేరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరగాలి. కానీ ఎక్కడా నిర్దేశించిన సమయానికి ఓటింగ్ ప్రారంభించలేదు. అనంతపురంలో ఉదయం 10 గంటలకు మొదలైంది. రాప్తాడు పరిధిలోని టీటీడీసీ కేంద్రంలో సాయంత్రం వరకూ మొదలు కాలేదు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేర్లు గల్లంతు..
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఫారం-12 సమర్పించినా.. జాబితాలో కొందరి పేర్లు కనిపించలేదు. అనంతపురం అర్బనలో పీఓ, ఏపీఓలు 1,905 మంది, ఓపీఓలు 2,278 మంది ఉన్నారు. వీరికి నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వెళ్లిన పలువురు ఉద్యోగుల పేర్లు జాబితాలో కనిపించలేదు. శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడు, ఆయన భార్య ఫారం-12ను డీఆర్‌డీఏ కార్యాలయంలో అందజేశారు. ఆయన భార్య పేరు మాత్రమే జాబితాలో ఉంది. దాదాపు 30 మంది పేర్లు జాబితాలో కనిపించలేదు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
ఎరలో పడలేదు..
పోస్టల్ ఓటర్లను అధికార పార్టీ ప్రలోభ పెట్టింది. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ ఇస్తామంది. కానీ ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం తమ పొట్ట కొట్టిందని ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. వారి వలలో పడలేదు. డబ్బులు అవసరం లేదని, నచ్చినవారికి ఓటు వేస్తామని ఖరాకండిగా చెప్పేశారని సమాచారం. ఫెసిలిటీ కేంద్రాల ఏర్పాటు సైతం వారికి కలిసొచ్చింది. పోస్టల్ బ్యాలెట్ చేతికి వస్తే తమపై తీవ్ర ఒత్తిడి ఉండేదని, పైగా తాము అమ్ముకున్నట్లు ప్రచారం జరిగేదని కొందరు గతాన్ని గుర్తు చేసుకున్నారు.
రాప్తాడులో గందరగోళం
రాప్తాడు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పట్ల ఎన్నికల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీటీడీసీ కార్యాలయంలో ఓటింగ్ కోసం ఉదయం 10 గంటలకే ఓటర్లు చేరుకున్నారు. ఆ సమయానికి అసెంబ్లీ బ్యాలెట్ పేపర్లు మాత్రమే ఉందుబాటులో ఉన్నాయి. ఎంపీ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్లు అక్కడికి రాలేదు. పోస్టల్ బ్యాలెట్ మీద గెజిటెడ్ అధికారి సంతకాలు చేసి, సీలు వేయాల్సి ఉండగా.. అక్కడ గెజిటెడ్ అధికారి కనిపించలేదు. దీంతో ఓటింగ్ కోసం వచ్చినవారు ఉదయం నుంచి సాయంత్రం వరకూ చెట్ల కింద పడిగాపులు కాశారు. ఎంపీ బ్యాలెట్ పేపర్లు మధ్యాహ్నం 3:30 గంటలకు వచ్చాయి. ఆత్మకూరు తహీల్దార్ పరమేశ్వరస్వామిని ఇక్కడ ఇనచార్జిగా నియమించారు. కానీ సకాలంలో రాలేదు.
కలెక్టర్‌కు పరిటాల సునీత ఫిర్యాదు
రాప్తాడులో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆలస్యం పట్ల మాజీ మంత్రి పరిటాల సునీత జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్‌కు ఫోన చేసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని కోరారు.
అక్కడా అంతే..
రాయదుర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మధ్యాహ్నం వరకు ప్రారంభించలేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల అధికారుల్లో సమన్వయం, అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఉద్యోగులు పెదవి విరిచారు. నియోజకవర్గంలో 1,105 మంది పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారులు తుదిజాబితాను ప్రకటించలేదు. జాబితాలో 22 మంది పేర్లు, ఐడీలు రెండుసార్లు నమోదైనట్లు తెలిసింది. అభ్యర్థులు అధికారులకు నిలదీయడంతో జాబితాలో వాటికి మార్కింగ్ వేసినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి ఏమాత్రం అనుకూలంగా లేవని, మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా సరైన సమాచారం అందలేని తెలిసింది. ఎన్నికల అధికారుల తీరుపై ఎన్నికల కమిషనకు ఫిర్యాదులు పంపినట్లు తెలిసింది. దీంతో అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, డబుల్ ఎంట్రీలు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఉద్యోగుల ఆగ్రహం
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలకు రాప్తాడు తహసీల్దారు సీతారామన టీటీడీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉద్యోగులు ఆయనను జాప్యం ఎందుకైందని ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఏం కొంపలు మునిగాయి..’ అని తహసీల్దారు నిర్లక్ష్యంగా మాట్లాడటంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పరిస్థితే ఇలా ఉంటే.. 13న సాధారణ ఓటింగ్ పరిస్థితి ఏమిటని అధికారులను నిలదీశారు. ఎట్టకేలకు సాయంత్రం 5:30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 04 , 2024 | 12:31 AM