CLINIC SEIZED: ఆర్‌ఎంపీ అవతారమెత్తిన వైద్యశాఖ ఉద్యోగి
ABN , Publish Date - Oct 15 , 2024 | 11:45 PM
వైద్యఆరోగ్యశాఖలో ఓ చిరుద్యోగి ఆర్‌ఎంపీ డాక్టర్‌గా అవతారమెత్తి క్లినిక్ నడపడంపై వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఈబీ దేవి ఈబీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తనిఖీ చేసి క్లినిక్‌ను సీజ్ చేయించారు.
అనంతపురం టౌన, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): వైద్యఆరోగ్యశాఖలో ఓ చిరుద్యోగి ఆర్‌ఎంపీ డాక్టర్‌గా అవతారమెత్తి క్లినిక్ నడపడంపై వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఈబీ దేవి ఈబీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తనిఖీ చేసి క్లినిక్‌ను సీజ్ చేయించారు. వివరాలలోకి వెళితే బుక్కరాయసముద్రం, నార్పల మండలాల్లో ఆరోగ్యశాఖలో మునిరెడ్డి కాంట్రాక్ట్ కింద ఎంపీహెచఏ (మేల్)వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన నిబంధనల మేరకు క్లినిక్ నడపరాదు. కొన్నేళ్లుగా బీకేఎ్‌సలో క్లినిక్ నడుపుతూ వచ్చీరాని వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. స్థానికంగా రాజకీయపార్టీల నేతలతో సంబంధాలు ఉండడంతో ఏ ఘటన జరిగినా బహిర్గతం కాకుండా సర్దుబాటు చేస్తూ వస్తున్నారనే ప్రచారం ఉంది. కొన్ని నెలల క్రితం ఓ మహిళకు ఆ ఉద్యోగి వైద్యం చేయగా వికటించింది. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కొద్దిరోజులక్రితం నాగరత్నమ్మ అనే మహిళకు పవర్‌ఫుల్ డోస్ ఇవ్వడంతో రియాక్షన అయింది. అనంతరం జిల్లాకేంద్రంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించినా ఆ మహిళ ప్రాణం దక్కలేదు. ఆమె చనిపోయినా మళ్లీ పాతకథే. తనకున్న పలుకుబడితో వివాదం రాకుండా చూసుకున్నారు. ఇటీవల ఈనకిలీ ఆర్‌ఎంపీ డాక్టర్ వ్యవహారాలపై జిల్లా కలెక్టరు, డీఎంహెచఓలకు ఫిర్యాదులు అందాయి. డీఎంహెచఓ బృందం మంగళవారం క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి విచారణ జరిపిన అనంతరం మునిరెడ్డి క్లినిక్‌ను సీజ్ చేయించారు.