AP ELECTIONS : ఎస్పీ సస్పెన్షన
ABN, Publish Date - May 17 , 2024 | 12:36 AM
తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో విఫలమైనందుకు ఎస్పీ అమిత బర్దర్‌పై సస్పెన్షన వేటు పడింది. తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైనందుకు ఎన్నికల కమిషన చర్యలు తీసుకుంది. ఆయనతోపాటు తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, సీఐ ఎస్.మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ...
డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణ కూడా..
తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో విఫలం చర్యలు తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం
అనంతపురం క్రైం, మే 16: తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో విఫలమైనందుకు ఎస్పీ అమిత బర్దర్‌పై సస్పెన్షన వేటు పడింది. తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైనందుకు ఎన్నికల కమిషన చర్యలు తీసుకుంది. ఆయనతోపాటు తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, సీఐ ఎస్.మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు పోలింగ్ రోజున పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. వైసీపీ వర్గీయులు టీడీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై సైతం దాడి చేశారు. మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్‌ను డీఎస్పీ చైతన్య ఆదేశాలతో పోలీసులు
విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులు ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. సీఈసీ ఆదేశాల మేరకు ఎస్పీ అమిత బర్దర్, డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణపై సస్పెన్షన వేటు వేశారు. వీరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
డీఎస్పీ చైతన్య రౌడీయిజం..
తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్య.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. టీడీపీ నాయకుల పట్ల అణచివేత ధోరణి అవలంభించారు. ఇదే కారణాలతో ఆయనను గతంలో కడప జిల్లా రాజంపేటకు బదిలీ చేశారు. అలాంటి అధికారిని ఎన్నికల గొడవల సమయంలో తాడిపత్రికి తీసుకువచ్చారు. అల్లర్లను నియంత్రించే పేరిట వచ్చిన డీఎస్పీ చైతన్య.. మునుపటి ధోరణిలోనే వ్యవహరించారు. రౌడీలా ప్రవర్తించారు. ఆయన ఆదేశాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్‌ను స్పెషల్ పార్టీ పోలీసులు జూనియర్ కాలేజీ మైదానానికి మంగళవారం అర్ధరాత్రి ఈడ్చుకువెళ్లారు. అక్కడ విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన దాసరి కిరణ్.. రక్తపు మడుగులో ఉండగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య సైతం శాంతిభద్రతలను కాపాడే విషయంలో విఫలమయ్యారు. ఎస్పీ బర్దర్ కొత్త కావడంతో కొందరు కిందిస్థాయి అధికారులు సరిగా స్పందించనట్లు తెలుస్తోంది. ఈ గొడవలను సీరియ్‌సగా తీసుకున్న ఎన్నికల సంఘం.. అధికారులపై వేటు వేయాలని ఆదేశించింది.
ఎస్బీ నిద్రపోయిందా...?
ఎన్నికల సమయంలో తాడిపత్రిలో ఏ స్థాయిలో గొడవలు జరుగుతాయో తెలియంది కాదు. అలాంటి ప్రాంతంలో హింస చెలరేగుతుందని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కొత్తగా వచ్చిన డీఐజీ, ఎస్పీకి ఈ విషయం గురించి స్పెషల్ బ్రాంచ చెప్పలేదా..? అన్న చర్చ నడుస్తోంది. పోలింగ్ రోజున గొడవలు మొదలైతే.. మరుసటి రోజు వరకూ నియంత్రించలేకపోవడం విస్మయం కలిగిస్తోంది. డీఎస్పీ చైతన్య గతంలో తాడిపత్రిలో ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. అలాంటి అధికారిని అల్లర్లు జరిగే సమయంలో తీసుకురావడం మరో తప్పిదం. ఆయన వ్యవహార శైలి గురించి ఎస్పీ, డీఐజీకి చెప్పాల్సిన బాధ్యత స్పెషల్ బ్రాంచి వారిదే. డీఎస్పీ చైతన్యలాంటి అధికారి తాడిపత్రికి వెళితే వివాదాలు సద్దుమణగడం మాని.. కొత్త సమస్యలు తలెత్తుతాయని పోలీసు శాఖలో ఎవరిని అడిగినా చెబుతారు. కానీ ఆయన్నే తాడిపత్రికి పంపించారు.
ఇక్కడ ఉండొద్దు
జేసీ కుటుంబంపై పోలీసుల ఆంక్షలు
అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎంపీ జేసీ
చూసేందుకు వచ్చిన జేసీ పవనరెడ్డి హౌస్ అరెస్ట్
ఆపై బలవంతంగా హైదరాబాదుకు తరలింపు
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన జేసీ దివాకర్ రెడ్డిని, ఆయన సతీమణి విజయమ్మ, సోదరి సుజాతను సైతం ఊరు విడిచి వెళ్లాలని హెచ్చరించారు. బలవంతంగా వారిని హైదరాబాదుకు తరలించారు. ఎన్నికల గొడవల నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిని పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. వారి ఇళ్లలో పనిమనుషులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న జేసీ, ఆయన సతీమణి, సోదరి, జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి ఉమారెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న జేసీ తనయుడు పవన రెడ్డి హైదారాబాదు నుంచి గురువారం ఉదయం తాడిపత్రికి చేరుకున్నారు. అక్కడ కాపలాగా ఉన్న పోలీసులు ఆయనను ఇంట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తన తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగా, లేదని వారిని చూడటానికి వచ్చానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. చాలాసేపు వాదోపవాదాల జరిగాక పవనరెడ్డిని ఇంటిలోకి అనుమతించారు. మధ్యాహ్న సమయంలో హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు అందించారు. ఆ తరువాత
గంటల వ్యవధిలోనే ఊరువిడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీచేశారు. హౌస్ అరె్‌స్టలో ఉన్న తాను ఎందుకు ఊరు విడిచివెళ్లాలని ఆయన నిలదీశారు. తాను నడవలేని స్థితిలో ఉన్నానని, తన సోదరి కోమాలో ఉన్నారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో చేసేది లేక అందరూ పోలీసుల బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు తరలివెళ్లారు. వివాదం నేపథ్యంలో జేసీ ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన విలేకరులను పోలీసులు అడ్డుకున్నారు. జేసీ పవన రెడ్డి మీడియాతో మాట్లాడాలని భావించినా.. పోలీసులు అనుమతించలేదు.
భయం గుప్పిట్లో తాడిపత్రి
ఎక్కడ చూసినా పోలీసులే..
పెద్దారెడ్డి, జేసీపీఆర్ నివాసాల వద్ద దయనీయ పరిస్థితులు
ఇళ్లకు తాళం వేసుకుని వెళ్లిపోయిన సమీప ప్రాంతాలవారు
వెంటాడుతున్న కేసుల భయం.. అజ్ఞాతంలోకి నాయకులు
చిరు వ్యాపారులు, కార్మికులకు తీవ్ర ఇబ్బందులు
తాడిపత్రి టౌన, మే 16: వరుస దాడులు, ప్రతిదాడులతో అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రజలు భయం గుప్పిట్లో బతుకున్నారు. ఎప్పు డు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పోలింగ్ రోజు మొదలైన హింస ప్రభావం నాలుగు రోజులు గడిచినా కొనసాగుతోంది. పట్టణంలో ఎక్కడచూసినా పోలీసు బలగాలే దర్శనమిస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు, చిరువ్యాపారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాల పరిసర ప్రాంతాల్లో ఉండేవారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. బయటకు వస్తే ఏం జరుగుతుందోనని
మహిళలు, చిన్నారులు ఇళ్ల నుంచి అడుగు బటయపెట్టడం లేదు. మరికొందరు పరిస్థితి సద్దుమణిగాక రావచ్చని భావించి.. ఇళ్లకు తాళం వేసుకుని బంధువుల ఊర్లకు వెళ్లిపోయారు. రాత్రి 9 గంటలు దాటితే అత్యవసరమైతే తప్ప ఏ ఒక్కరూ బయటకు రావడం లేదు. బయట కనిపిస్తే చాలు.. ‘ఎవరు..? ఎక్కడ..?’ అని పోలీసులు ప్రశ్నిస్తున్నారని, వారికి సమాధానం చెప్పలేకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్ర్టాటెక్, స్టీల్ ఫ్యాక్టరీ, సాగర్‌సిమెంట్, పెన్నాసిమెంట్, రామ్‌కో సిమెంట్ పరిశ్రమల్లో పనిచేసేవారు రాత్రి విధులు ముగించుకొని తిరిగి వచ్చేందుకు జంకుతున్నారు. తహసీల్దారు కార్యాలయం సమీపంలో పోలీసులు అడ్డుకుని, ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. గుర్తింపు కార్డులు చూపించినా లాఠీ దెబ్బలు తప్పడం లేదని అంటున్నారు.
అజ్ఞాతంలోకి..
రెండు పార్టీలో గొడవల్లో ఎవరెవరు పాల్గొన్నారోగాని.. సంబంధమే లేని వ్యక్తులు పారిపోవాల్సి వస్తోంది. రాజకీయ నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరూ అజ్ఞాతంలోకి వెళుతున్నారు. తాడిపత్రి పట్టణంలోని వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పోలీసు కేసుల భయం పట్టుకుంది. రెండురోజులుగా కేంద్రబలగాలు పట్టణంలో నాయకుల ఇళ్లవద్దకు వెళ్లి ఆరాతీస్తున్నాయి. చుట్టుపక్క మండలాలలోనూ తనిఖీలు పెంచారు. దీంతో ఎవరికివారు బ్యాగులు సర్దుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గొడవల్లో పాల్గొన్నవారిని గుర్తిస్తున్నారు. వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో నాయకుల్లో వణుకుపుడుతోంది. పోలీసుల కంటపడకుండా తోటలు, కొండల్లో తలదాచుకుంటున్నారు. వారికి మూడు పూటలా భోజనం సమకూర్చలేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రభోదానంద ఆశ్రమం వద్ద జరిగిన గొడవలకు సంబంధించిన కేసులో వందల సంఖ్యలో నిందితులను చేర్చారు. కేసులు నమోదుచేసి జైలుకు పంపించారు. ఈ కేసు ఇప్పటికీ నడుస్తోంది. దీంతో తాజా గొడవల్లో తమ పేరు ఎక్కడ చేరుస్తారోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.
వ్యాపారులకు చిక్కులు
తాడిపత్రి పట్టణానికి చుట్టుపక్కల గ్రామాలు, పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి మండలాల రైతులు, చిరువ్యాపారులు ప్రతిరోజూ వస్తుంటారు. నిత్యావసరాలు, పరికరాలు, మందులు కొనుగోలు చేస్తుంటారు. వ్యవసాయ దిగుబడులను మార్కెట్‌కు తెచ్చేవారూ ఉంటారు. పోలీసుల ఆంక్షలతో వీరందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణానికి రావాలంటే చెక్‌పోస్టు వద్ద తమ గుర్తింపుకార్డులను చూపించాల్సి వస్తోందని అంటున్నారు. గుర్తింపుకార్డులు లేనివారి పోలీసులు వెనక్కి పంపుతున్నారు.
91 మందిపై 307 కేసు నమోదు
తాడిపత్రి గొడవలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 91 మందిపై ఐపీసీ సెక్షన 307 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వారిని గురువారం ఉరవకొండ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో టీడీపీకి చెందిన 54 మంది, వైసీపీకి చెందిన 37 మంది ఉన్నారు. అరెస్టు అయిన వారిలో టీడీపీకి చెందిన మల్లికార్జునరెడ్డి, పవనకుమార్‌రెడ్డి, వైసీపీకి చెందిన బొంబాయి రమే్‌షనాయుడు, బాలా రమే్‌షబాబు, కంచం రాంమోహనరెడ్డి, జావిద్‌ఖాద్రీ, నాగభూషణం తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 17 , 2024 | 12:36 AM