AP Politics: ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా..? ఏపీ సీఎం జగన్‌పై షర్మిల ధ్వజం
ABN, Publish Date - Feb 15 , 2024 | 10:48 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడగడంపై మండిపడ్డారు. మరి ఇన్నాళ్లు ఏం చేశారని షర్మిల ధ్వజమెత్తారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడగడంపై మండిపడ్డారు. మరి ఇన్నాళ్లు ఏం చేశారని షర్మిల ధ్వజమెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
జగన్‌పై విమర్శలు
‘ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా ? చేతకాకపోవడంతో ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ? ఐదేళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా. రాష్ట్రానికి రాజధాని లేదు. ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక ప్యాకేజీ లేవు. పోలవరం పూర్తి కాలేదు. జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదు. కొత్త పరిశ్రమలు లేవు. ఉన్నవి ఉంటాయో లేదో తెలియదు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారు. అభివృద్ధి చూపలేదు .ప్రధాని మోదీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది త్రీడీ గ్రాఫిక్స్. మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట. పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతలు వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం అని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా రాజధాని, రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ది లేదు’ అని షర్మిల మండిపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 15 , 2024 | 12:32 PM