ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Payyavula Keshav : నదుల అనుసంధానానికి నిధులివ్వండి

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:58 AM

రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్‌ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

  • కరువు పీడిత జిల్లాలకు సహకరించండి

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ వినతి

అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్‌ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యాలు, ఏయే ప్రాజెక్టులకు ఎన్ని నిధులు అవసరం అనే విషయాలను రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌ కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన బడ్జెట్‌ ప్రతిపాదనల సమావేశానికి కేశవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో గోదావరి నది నుంచి ఏటా 2 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. మరో వైపు అనంతపురం జిల్లాలో దేశంలోనే అతితక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా, పెన్నా, వంశధార నదులను అనుసంధానించి వర్షాలు లేక అల్లాడుతున్న సీమ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరు అందించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. రాజస్థాన్‌లో 11 నదులను అనుసంధానించడానికి సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీలోనూ నదుల అనుసంధానానికి సహకరించాలి. రానున్న కేంద్ర బడ్జెట్‌లో నదుల అనుసంధాన ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి’’ అని పయ్యావుల కేశవ్‌ కోరారు.


  • 90 శాతం మీరే భరించాలి!

‘‘2024-25 కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌, ఝార్ఘండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి కేంద్రం పూర్వోదయ ప్రాజెక్టును ప్రకటించింది. సాధారణంగా ఏపీకి ప్రకృతి విపత్తులు ఎక్కువ. కోస్తా ప్రాంతం తుఫాన్లతో, రాయలసీమ ప్రాంతం కరువుతో విలవిలలాడిపోతుంటాయి. దీనికి తోడు రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరగడంతో పారిశ్రామిక రంగం కుదేలైంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు, పెట్టుబడులు ఆకర్షించడానికి, పారిశ్రామిక రంగానికి ఊతమివ్వడానికి కేంద్రం ఆర్థిక తోడ్పాటును అందించాలి. దీనికిగాను పూర్వోదయ ప్రాజెక్టులో ఉన్న ఏపీకి కేంద్ర ప్రాయోజిత పథకాలకు అన్నింటికీ 90 శాతం నిధులు ఇవ్వాలి. అదేవిధంగా పీపీపీ ప్రాజెక్టులన్నింటికీ కేంద్రమే వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్‌) భరించాలి. రోడ్లను అభివృద్ధి చేసేందుకు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి సాయం చేయాలి. విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైల్‌ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా వీజీఎ్‌ఫను కేంద్రమే భరించాల’’ని పయ్యావుల విన్నవించారు.

  • రూ.100 కోట్ల చొప్పున ఇవ్వండి

కరువు వల్ల ఎడారిగా మారిపోతున్న జిల్లాలకు జల్‌జీవన్‌ మిషన్‌, ఇతర ఇరిగేషన్‌ పథకాల ద్వారా కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిష్పత్తిలో నిధులు అందించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కోరారు. కృత్రిమ మేధ(ఏఐ), ఏవియేషన్‌ యూనివర్సిటీ, పునరుత్పాదక శక్తి వనరులపై పరిశోధనలు చేసే విశ్వ విద్యాలయాలకు ఒక్కొక్క ప్రాజెక్టుకు రూ.100 కోట్ల చొప్పున కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విన్నవించారు. అదేవిధంగా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్‌ ఇవ్వాలని కోరారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వారిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి 5 టెక్స్‌టైల్‌ పార్కులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేశవ్‌ విన్నవించారు.

Updated Date - Dec 21 , 2024 | 04:59 AM